ముగ్గురు గంజాయి నిందితులపై పీడీ యాక్టు నమోదు: సంగారెడ్డి ఎస్పీ

ABN , First Publish Date - 2022-05-19T05:19:25+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో ఎండు గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో ముగ్గురు నిందితులపై పీడీ యాక్టు నమోదైంది.

ముగ్గురు గంజాయి నిందితులపై పీడీ యాక్టు నమోదు: సంగారెడ్డి ఎస్పీ
నిందితులను చూపుతున్న దృశ్యం :

సంగారెడ్డి క్రైం, మే 18: సంగారెడ్డి జిల్లాలో ఎండు గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో ముగ్గురు నిందితులపై పీడీ యాక్టు నమోదైంది. సంగారెడ్డి ఎస్పీ ఎం.రమణకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై, థానేకు చెందిన సునీలల్‌ బాబన్‌ షిండే (39), జీన్‌పూర్‌కు చెందిన కమలేష్‌ కుమార్‌ శివమూర్తి శర్మ(37), సంగారెడ్డి జిల్లా నాగిల్‌గిద్ద మండలం కర్‌సగుత్తి గ్రామానికి చెందిన అదే రాజు(40) తమ వాహనంలో రహస్య అరలు తయారు చేసి దాదాపు రూ.21 లక్షల విలువ చేసే 140 కిలోల ఎండు గంజాయి అక్రమంగా తరలిస్తుండగా కోహీర్‌ పోలీసులు వారిని పట్టుకున్నారు. అదే సమయంలో వారి నుంచి ఎండు గంజాయితో పాటు 5 సెల్‌ఫోన్‌లు, రూ. 15వేల నగదు స్వాధీనం చేసుకొని పోలీసులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. జిల్లా కలెక్టర్‌ ఎం.హన్మంతరావు ఆదేశాల మేరకు బుధవారం ముగ్గురు నిందితులపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ రమణకుమార్‌ వెల్లడించారు. నిందితులను సంగారెడ్డి జైలు నుంచి చెర్లపల్లి జైలుకు తరలించామన్నారు.  మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌ ఎవరైనా రవాణా చేసినా, సేవించినా నిల్వ ఉంచినా, అమ్మడం కానీ, కొనుగోలు చేయడం గానీ చేసినా వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు.   

Updated Date - 2022-05-19T05:19:25+05:30 IST