ప్చ్‌.. సచివాలయం

ABN , First Publish Date - 2022-04-20T05:41:51+05:30 IST

సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు తెచ్చిన సచివాలయాలు బాలారిష్టాలు దాటడం లేదు.

ప్చ్‌.. సచివాలయం
కోసిగి మండలంలోని వందగల్లు గ్రామ సచివాలయం

  1. పని వేళలు పాటించని సిబ్బంది
  2. డుమ్మా కొట్టేవాళ్లకు కొదువ లేదు 
  3. సేవలందక ప్రజలకు ఇక్కట్లు


నంద్యాల, ఆంధ్రజ్యోతి: సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు తెచ్చిన సచివాలయాలు బాలారిష్టాలు దాటడం లేదు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల  లక్ష్యం మాత్రం నెరవేరడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పింఛను, రేషనకార్డు, సంక్షేమ పథకాల పనులేవీ సచివాలయాల్లో జరగకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులు అందుబాటులో లేకపోవడం, నెట్‌ సరిగా పని చేయకపోవడం వంటి సమస్యలతో ప్రజలకు సేవలు అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా సచివాలయాల స్థితిగతులపై కథనం... 


 నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని మంచాలకట్ట సచివాలయంలో తొమ్మిది మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలైనా విధులకు రాలేదు. కొంతమంది ఆంధ్రజ్యోతి విలేకరులు వచ్చారని తెలుసుకుని అప్పుడు వచ్చారు. హాజరు రిజిస్టరులో వివరాలు లేవు. చాలా మంది సిబ్బంది హాజరు సంతకాలు చేయాల్సిన చోట   ఖాళీలు కనిపించాయి. సంబంధిత అధికారిని అడగ్గా అందరూ రోజూ విధులకు హాజరవుతున్నారని, సంతకం చేయడం మర్చిపోయారని తెలిపారు.  

పత్తికొండ మండలంలోని చక్కరాళ్ల గ్రామ పంచాయతీలోని సచివాలయానికి పంచాయతీ కార్యదర్శి 11 గంటలకు కార్యాలయానికి వచ్చారు.  ప్రజలు   పనుల నిమిత్తం రాకపోవడంతో ఉద్యోగులకు సచివాలయం కాలక్షేప కేంద్రంగా మారింది.


- మద్దికెర మండలం ఎం.అగ్రహారం సచివాలయ సిబ్బంది 10.30 గంటలైనా విధులకు హాజరు కాలేదు. 10:30 గంటలకు డిజిటల్‌ అసిస్టెంట్‌ మనోజ్‌ రాగా, 11.10గంటలకు వెల్పేర్‌ అసిస్టెంట్‌ మాధవి, 11.20గంటలకు ఇంజనీరింగ్‌ అధికారి ఉదయ్‌భాను  విధులకు వచ్చి తమ సెల్‌ఫోన్‌లో బయోమెట్రిక్‌ వేశారు. ఏఎన్‌ఎం కరోనా వ్యాక్సిన్‌ వేయడానికి వెళ్లారు. మహిళా పోలీస్‌, సర్వేయర్‌, వీఆర్వో, కార్యదర్శి, వ్యవసాయ శాఖ సహాయకులు విధులకు రాలేదు. 

 - కోడుమూరు సచివాలయంలో డిజిటల్‌, హార్టికల్చర్‌, వెల్ఫేర్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, ఏఎనఎం, సర్వేయర్‌, వీఆర్వో, జేఎల్‌ఎం ఉద్యోగులు పనిచేస్తున్నారు. మహిళా పోలీసు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ పోస్టు భర్తీ కాలేదు.   హార్టకల్చర్‌ అసిస్టెంట్‌, ఏఎనఎం, 10.36 గంటలకు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ 10.49 గంటలకు,   సర్వేయర్‌ 3.30 గంటలకు సచివాలయానికి వచ్చారు. ఇంటి నిర్మాణం బిల్లుల వివరాలు,  ప్రసవ నమోదు, నాడునేడు పనుల తీర్మానంపై సంతకం, సర్వే చలానా వంటి పనుల కోసం కొందరు కార్యాలయానికి  వచ్చారు.  

- ఆదోని మండలంలోని నారాయణపురం పంచాయతీ సచివాలయంలో సిబ్బంది హాజరుకు సంబంధించిన వేలిముద్ర వేయడానికే 10.30 గంటల వరకు కసరత్తు చేయాల్సి వచ్చింది.  మిగతా సిబ్బంది అప్పటికీ కార్యాలయం చేరుకోలేదు. 11 గంటలకు వెల్ఫేర్‌ ఎడ్యుకేషన అసిస్టెంట్‌ శైలజ,  మధ్యాహ్నం 12 గంటలకు మహిళా కానిస్టేబుల్‌ కె.లక్ష్మీదేవి విధులకు హాజరయ్యారు. మిగతా ఐదుగురు  అసలు హాజరు కాలేదు. 


- హొళగుంద మండలంలోని లింగంపల్లి పంచాయతీ సచివాలయంలో ఉదయం 10.50 గంటలకు ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ఎస్‌. అన్వర్‌సోయాల్‌ కార్యాలయం తెరిచారు.  11.15 నిమిషాల వరకు బయోమెట్రిక్‌ వేలిముద్ర పడలేదు. కార్యాలయంలో కంప్యూటర్‌ సైతం పనిచేయలేదు.  సమస్యలపై వచ్చిన ప్రజలు కార్యాలయం బయట వేచి చూడాల్సి వచ్చింది. 


- బనగానపల్లె గ్రామ సచివాలయాల్లో బయోమెట్రిక్‌ మిషన్లు మొరాయిస్తున్నాయి. మూడుసార్లు సచివాలయ సిబ్బంది బయో మెట్రిక్‌ వేయాల్సి వస్తోంది. మీరాపురం గ్రామం సచివాలయంలో ఉద్యోగులకు గత సంవత్సరం అక్టోబరు నాటికి ప్రొబెషనరీ పీరియడ్‌ పూర్తి అయినా నేటికి పర్మినెంట్‌ చేయలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. 


- ప్యాపిలి మండలంలోని వెంగళాంపల్లి గ్రామ సచివాలయంలో 8 మంది ఉద్యోగులు ఉండగా సగం మంది సిబ్బందే విధులకు హాజరయ్యారు. బయోమెట్రిక్‌ యంత్రం పనిచేయకపోవడం వలన ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. గ్రామంలో యాప్‌ సరిగా పనిచేయదని తెలిపారు.  3నెలల నుంచి తిరుగుతున్నా తన సమస్యను పట్టించుకోవడం లేదని రైతు శ్రీరాములు అన్నారు. 


- ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల -1వ సచివాలయంలో తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. ఉద్యోగులు బయోమెట్రిక్‌ వేసేందుకు ప్రయత్నించినా అది మోరాయించింది.  సమస్యల పరిష్కారం కోసం  మధ్యాహ్నం 3గంలవరకు కార్యాలయానికి పది మంది కూడా రాలేదు. సంపూర్ణ గృహహక్కు పథకం పత్రాలు రాకపోవడంతో లబ్ధిదారులు  వెనుతిరిగి పోయారు.  మధ్యాహ్నం  2.50గంటలప్పుడు కూడా  బయోమెట్రిక్‌ వేసేందుకు నలుగురు సిబ్బంది కసరత్తు చేయాల్సి వచ్చింది. 

- మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం వందగల్లు గ్రామసచివాలయంలో   ఇద్దరు ఉద్యోగులే హాజరయ్యారు. మిగతవారిలో డిజిటల్‌ అసిస్టెంట్‌ సెలవులో ఉన్నారు.  జూనియర్‌ సర్వేయర్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ మెడికల్‌ లీవులో ఉన్నారు. మిగతా ఉద్యోగులు ఇనచార్జీలు. వారు కార్యాలయానికి రాలేదు.   



Updated Date - 2022-04-20T05:41:51+05:30 IST