ప్చ్‌.. 63 పైసలే!

ABN , First Publish Date - 2022-08-14T05:28:38+05:30 IST

ఓ పాత ఇంటిని కూల్చేస్తున్నారు. పాత లాకర్‌ ఒకటి బయటపడింది. ఇంకేం.. భారీగా నిధులు ఉన్నాయనుకున్నారు. ఇంటి యజమాని, కూలీల మధ్య వివాదం మొదలైంది.

ప్చ్‌.. 63 పైసలే!
బయటపడిన లాకర్‌



ఇల్లు కూలుస్తుండగా బయటపడిన లాకర్‌
యజమాని, కూలీల మధ్య వివాదం
బంగారు, వెండి ఉన్నాయంటూ ప్రచారం
ఆనోటా ఈనోటా వెలుగులోకి విషయం


ఓ పాత ఇంటిని కూల్చేస్తున్నారు. పాత లాకర్‌ ఒకటి బయటపడింది. ఇంకేం.. భారీగా నిధులు ఉన్నాయనుకున్నారు. ఇంటి యజమాని, కూలీల మధ్య వివాదం మొదలైంది. విషయం బయటకు పొక్కింది. అంతే.. పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చారు. నాలుగు కష్టపడితే లాకర్‌ ఓపెన్‌ అయింది. అయితే అందులో ఉన్నది 63 పైసలే!

రాజాం రూరల్‌, ఆగస్టు 13: రాజాం పట్టణంలో రామలింగం అనే వ్యక్తి చీపురుపల్లికి చెందిన ఓ వ్యక్తి నుంచి పాడుపడిన ఇంటిని ఆర్నెళ్ల క్రితం కొనుగోలు చేశారు. అక్కడ కొత్త ఇంటిని కట్టుకోవాలనుకున్నారు. కూలీల సాయంతో పాత ఇంటిని కొట్టివేయడం మొదలు పెట్టారు. ఇంటి పైకప్పు, గోడలు కూల్చేస్తున్నారు. ఈనెల 10న ఇంటి గోడ నుంచి ఓ పాత లాకర్‌ బయటపడింది. అందులో భారీగా నిధులు ఉంటాయని భావించారు. ఇంటి యజమాని, కూలీల మధ్య వివాదం మొదలైంది. తమకు వాటా ఇవ్వాలని కూలీలు డిమాండ్‌ చేశారు. ఏమైందోగానీ.. కూలీలు చడీచప్పుడు కాకుండా ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఆ ఇంట్లో భారీగా బంగారు, వెండి ఆభరణాలు ఉన్న లాకర్‌ బయటపడిందంటూ ప్రచారం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసింది. శనివారం ఉదయానికి పట్టణంలో దావానలంలా వ్యాపించింది. అంతే ఆ ఇంటి ముందు సందడి మొదలైంది. తెలిసిన వారంతా వచ్చారు. దీంతో సీఐ రవికుమార్‌, కానిస్టేబుళ్లు, తహసీల్దార్‌ విజయభాస్కర్‌, రెవెన్యూ సిబ్బంది, స్పెషల్‌ బ్రాంచ్‌, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది ఆ ఇంటి వద్దకు వచ్చారు. ఇంటి యజమానితో మాట్లాడారు. లాకర్‌ తెరిస్తే ఏముందో తెలిసిపోతుంది కదాని అనుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తెరవడం మొదలు పెట్టారు. అందరూ తీవ్ర ఉత్కంఠతతో చూస్తున్నారు. నిధులు ఉంటాయని భావించారు. ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. దీంతో లాకర్‌ను పోలీసు వాహనంలో బీరువాల షెడ్‌కు తరలించారు. అక్కడ పరికరాల సాయంతో లాకర్‌ను పగులగొట్టారు. నాలుగు గంటల సమయం పట్టింది. అయితే లాకర్‌లో ఉన్న వాటిని చూసి అందరూ ఉసూరుమన్నారు. 63 పైసల విలువైన మూడు నాణేలు మాత్రమే లభించాయి. దీంతో ఇంటి యజమానితో పాటు కూలీలు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికారులు లాకర్‌, నాణేలను ఇంటి యజమానికి అప్పగించారు.



Updated Date - 2022-08-14T05:28:38+05:30 IST