నాటి ‘ఇందిర జలప్రభ’నే నేటి వైఎస్సార్‌ జలకళ

ABN , First Publish Date - 2020-09-30T11:27:06+05:30 IST

కాంగ్రెస్‌ హయాంలో అమలు చేసిన ఇందిర జలప్రభ పథకమే నేటి వైఎస్సార్‌ జలకళ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ..

నాటి ‘ఇందిర జలప్రభ’నే నేటి వైఎస్సార్‌ జలకళ

 అమ్మను మమ్మీ అని ఆర్భాటం చేసినట్లుంది

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి


వేంపల్లె, సెప్టెంబరు 29: కాంగ్రెస్‌ హయాంలో అమలు చేసిన ఇందిర జలప్రభ పథకమే నేటి వైఎస్సార్‌ జలకళ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లెలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో అమలైన వివిధ పథకాలకు పేర్లుమార్చి కొత్త పథకాలైనట్లు డబ్బా కొట్టుకోవడం వైసీపీ ప్రభుత్వానికి పరిపాటి అయిందని ఎద్దేవా చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిర జలప్రభ పథకాన్ని 2011 అక్టోబరు 2న గాంధీ జయంతి నాడు ప్రారంభించామన్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, సన్నకారు, చిన్నకారు రైతుల పొలాల్లో ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేసి మోటర్లు, పంపుసెట్లు, విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చి 10లక్షల ఎకరాల బీడుభూములకు సాగునీరందించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.


2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కొద్ది మార్పులు చేసి ఎన్టీఆర్‌ జలసిరి అని పేరు మార్చారన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేసి వైఎస్సార్‌ జలకళ అని నామకరణం చేసిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి జగనన్న విద్యాదీవెన అని, స్కాలర్‌షిప్‌ పథకాన్ని జగనన్న వసతిదీవెన అని, మెయింటెనెన్స్‌ గ్రాంట్‌కు మనబడి నాడు-నేడు అని, మధ్యాహ్న భోజన పథకానికి జగనన్న గోరుముద్ద అనిపేర్లు మార్చుకొని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. అమ్మను మమ్మీ అని, నాన్నను డాడీ అని, వేరుశనగ విత్తనాలను ఇండియాబాదం అనే వైఖరి మానుకోవాలని ధ్వజమెత్తారు.

Updated Date - 2020-09-30T11:27:06+05:30 IST