చిత్ర పరిశ్రమ పట్ల ఆసక్తి, అవగాహన ఏ మాత్రం లేకపోయినా అనుకోకుండా ఈ పరిశ్రమలోకి ప్రవేశించి, దర్శకుడిగా రాణించి, అద్భుత విజయాలు సాధించిన వ్యక్తి పందిల్లపల్లి చంద్రశేఖరరెడ్డి. పీసీ రెడ్డిగా అందరికీ చిరపరిచుతుడైన ఆయన 1933 అక్టోబర్ 15న నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలోని అనుమసముద్రం గ్రామంలో జన్మించారు. నాలుగో తరగతి నుండి డిగ్రీ వరకూ చెన్నైలోనే చదువుకున్నా ఆయనకు ఏనాడూ సినిమాలంటే ఆసక్తి కలగలేదు. చిత్రపరిశ్రమలోకి వెళ్లాలనే ఆలోచన కూడా రాలేదు. అయితే అనుకోకుండా ఒకరోజు సరదాగా షూటింగ్ చూద్దామని వెళ్లారు. అక్కడ సెట్లో అందరూ దర్శకుడిని గౌరవించే విధానం పీసీ రెడ్డిని ఆకట్టుకుంది. ఇటువంటి గౌరవప్రదమైన వృత్తిలోకి రావాలని ఆనాడే ఆయన నిర్ణయించుకున్నారు.
అలా 1959లో ‘శ్రీకృష్ణ రాయభారం’ చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చంద్రశేఖరరెడ్డి కెరీర్ మొదలైంది. 1971లో ‘అత్తలు కోడళ్లు’ చిత్రంతో ఆయన దర్శకుడయ్యారు. 2005 వరకూ ఆయన సినీజీవితం నిర్విరామంగా సాగింది. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు.. ఇలా అగ్ర హీరోలందరితో పనిచేశారు. ఆ తర్వాతి తరం హీరోల్లో చిరంజీవితో పనిచేసే అవకాశం పీసీ రెడ్డికి వచ్చింది కానీ ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమా పేరు ‘చిన్నపులి- పెద్దపులి’. హీరో కృష్ణ నటించిన ‘అత్తలు కోడళ్లు’ చిత్రంతో దర్శకుడిగా అడుగులు ప్రారంభించిన చంద్రశేఖరరెడ్డి.. ఆయన నటించిన ‘శాంతిసందేశం’ చిత్రంతోనే కెరీర్‌కు బ్రేక్ పడడం గమనార్హం.
మరో విశేషమేమిటంటే ఎన్టీఆర్‌తో చేసిన ‘బడిపంతులు’, కృష్ణతో చేసిన ‘ఇల్లు ఇల్లాలు’, శోభన్‌బాబుతో తీసిన ‘మానవుడు దానవుడు’ చిత్రాలు మూడూ 1972లో విడుదలై సిల్వర్‌జూబ్లీ సాధించడం. అది నిజంగా అరుదైన రికార్డే.
-వినాయకరావు