మొబైల్ రీచార్జ్‌లపై బాదుడు మొదలెట్టేసిన Paytm

ABN , First Publish Date - 2022-06-11T02:47:09+05:30 IST

డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ప్లాట్‌ఫామ్ ద్వారా చేసుకునే మొబైల్

మొబైల్ రీచార్జ్‌లపై బాదుడు మొదలెట్టేసిన Paytm

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ప్లాట్‌ఫామ్ ద్వారా చేసుకునే మొబైల్ రీచార్జ్‌లకు సర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. చేసుకునే రీచార్జ్‌ను బట్టి ఇది రూపాయి నుంచి 6 రూపాయల వరకు వసూలు చేయనుంది.


పేటీఎం వాలెట్ బ్యాలెన్స్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేసినా సరే మోడ్‌తో సంబంధం లేకుండా అన్ని పేటీఎం మొబైల్ రీఛార్జ్‌లకు ఇది వర్తిస్తుంది. అయితే, ఇప్పటికిప్పుడు ఇది యూజర్లందరికీ వర్తించదు. పేటీఎం ప్రత్యర్థి అయిన ఫోన్ పే గతేడాదే మొబైల్ రీచార్జ్‌లపై సర్ చార్జీలను వసూలు చేయడం మొదలుపెట్టింది. కాగా, రూ. 100 పైన జరిగే లావాదేవీలకు కూడా అదనపు చార్జీలు వర్తిస్తాయని తెలుస్తోంది. 


 2019లో పేటీఎం ఓ ప్రకటన చేస్తూ.. వినియోగదారుల నుంచి తాము ఎలాంటి కన్వీనియన్స్ రుసుము కానీ, ట్రాన్సాక్షన్ రుసుము కానీ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. క్రెడిట్, డెబిట్ కార్డ్స్, యూపీఐ, వాలెట్ మోడ్ చెల్లింపులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. కానీ, ఇప్పుడు మొబైల్ రీచార్జ్‌లపై సర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం గమనార్హం. మరోవైపు, ఫోన్ పే గతేడాది అక్టోబరు నుంచే ‘ప్రాసెసింగ్ ఫీ’ పేరుతో మొబైల్ రీచార్జ్‌ల నుంచి సర్ చార్జ్ వసూలు చేస్తోంది.

Updated Date - 2022-06-11T02:47:09+05:30 IST