విపత్కాలంలోనూ చెల్లింపుల్లేవ్‌!

ABN , First Publish Date - 2022-01-11T06:38:06+05:30 IST

కొవిడ్‌ విపత్కర వేళ పలు రకాలుగా సేవలందించిన వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

విపత్కాలంలోనూ చెల్లింపుల్లేవ్‌!
రిమ్స్‌లోని ప్లాంట్‌లో ఆక్సిజన్‌ నింపుతున్న ట్యాంకర్‌ (ఫైల్‌)

కొవిడ్‌ బిల్లులకు  మోక్షం లేదు   

జిల్లాలో రూ.20 కోట్లకుపైగా  పెండింగ్‌

నిలిచిన ఆక్సిజన్‌, మందులు, ఫుడ్‌ సరఫరా చెల్లింపులు

తొమ్మిది నెలలుగా ఒక్క రూపాయి విడుదల కాని దుస్థితి

అధికారుల చుట్టూ ఏజెన్సీల ప్రదక్షిణలు

థర్డ్‌వేవ్‌ వేళ  యంత్రాంగంలోనూ ఆందోళన

ఒంగోలు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ విపత్కర వేళ పలు రకాలుగా  సేవలందించిన వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బిల్లుల చెల్లింపు విషయంలో ఉదాసీనత చూపుతోంది. మొదటి, రెండో వేవ్‌లకు సంబంధించి రూ.20కోట్లపైనే బిల్లులు తొమ్మిది నెలలుగా పెండింగ్‌ ఉన్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. థర్డ్‌ వేవ్‌ ప్రబలుతున్న వేళ సర్కారు తీరుతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో ఎలా ముందుకు పోవాలో తెలియక అల్లాడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. దాదాపు రెండేళ్లుగా ప్రపంచాన్ని, దేశాన్ని కుదిపేసిన కరోనా జిల్లాలోను తీవ్ర ప్రభావం చూపింది. గత ఏడాది మార్చిలో జిల్లాలో తొలి కేసు నమోదు కాగా ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 1.39లక్షల మంది కరోనా బారినపడగా 1,145 మంది వరకు మృతిచెందారు. అనధికారికంగా ఈ లెక్కలు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయం అలా ఉంచితే 2020 మార్చి నుంచి 2021 మార్చి వరకు మొదటి వేవ్‌గా.. 2021 ఏప్రిల్‌ నుంచి రెండో వేవ్‌గా ప్రభుత్వం లెక్కలు వేస్తూ వస్తోంది. జిల్లాలో తొలి వేవ్‌కన్నా రెండో వేవ్‌లో తీవ్రత అధికంగా ఉంది. కాగా తొలి విడత కొవిడ్‌పై ప్రజల్లో చైతన్యం, ఆస్పత్రుల్లో సౌకర్యాలు, చికిత్స, కొవిడ్‌ కేర్‌సెంటర్ల ఏర్పాటు ఇతరత్రా ఎక్కువ దృష్టిపెట్ట గా.. రెండో విడత ఆక్సిజన్‌పాటు మందులకు అధికంగా వెచ్చించాల్సి వచ్చింది. మొత్తంగా కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే రూ.50కోట్ల వరకు ఖర్చుపెట్టారు. 


భారీగా వ్యయం

మొదటి వేవ్‌ సమయంలో తొలుత పారిశ్రా మిక, వ్యాపార వర్గాల నుంచి ఆర్థిక సహకా రాన్ని జిల్లా అధికారులు సమీకరించారు. అలాగే మైనింగ్‌ రాబడి నుంచి ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం లభించే డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌) నిధులను కొవిడ్‌కు వాడేలా ప్రభుత్వం అనుమతించింది. అలా రూ.17కోట్లకుపైగా డీఎంఎఫ్‌ నిధులను మొదటి వేవ్‌లో వాడగా ప్రభుత్వం నేరుగా ఇచ్చిన ఇతర రూపాల్లో సమకూర్చిన మొత్తంతో తొలి వేవ్‌ను అధిగమించారు. ఇక రెండో వేవ్‌లో తీవ్రత అధికంగా ఉండి ఒంగో లులోని రిమ్స్‌తోపాటు పలు ఇతర ప్రాంతాల్లో ఆక్సిజన్‌ బెడ్లు, వెంటిలేటర్లతో కూడిన బెడ్లు పెంచడంతోపాటు ప్రభుత్వ డ్రగ్‌ స్టోర్‌లో దొరకని అనేక మందులు విడిగా కొనుగోలు చేశారు. పెద్ద ఎత్తున ఆక్సిజన్‌ కొనుగోలు అప్పటికప్పుడు అదనపు సౌకర్యాల కల్పన, బలవర్థకమైన ఆహారం సరఫరా, అదనపు సిబ్బంది నియామకం ఇలా అనేకం అత్యవ సరంగా చేయాల్సి వచ్చింది. సంబంధిత యంత్రాంగం పలు ఏజెన్సీలను సంప్రదించి వాటిని సమకూర్చారు. అలా పెద్దమొత్తంలో వెచ్చించారు. అందుతున్న సమాచారం మేరకు 2021 ఏప్రిల్‌ నుంచి గత తొమ్మిది మాసాలుగా ఇందుకు సంబంధించి ఒక్క పైసా ప్రభుత్వం విడుదల చేసిన పరిస్థితి లేదు. రూ.20కోట్లకుపైగా అలాంటి బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో జిల్లా అధికారులు అప్‌లోడ్‌ చేసి నెలలు గడుస్తున్నా మోక్షం లేదు. అందులో ఆక్సిజన్‌ సరఫరా చేసిన ఏజెన్సీలకే రూ.6కోట్ల బకాయి ఉన్నట్లు తెలుస్తుండగా మందులు, ఆహారం సరఫరా చేసిన వారికి భారీగానే పెండింగ్‌ ఉంది. 


ఈసారి ఖర్చు ఎలా?

ఒక్క ఒంగోలులోని రిమ్స్‌కు సంబంధించే కరోనా బాధితులకు అందజేసిన రూ.350 భోజనానికి సంబంధించి రూ.2కోట్లు, రిమ్స్‌లో లేక బయట కొనుగోలు చేసిన మందులకు సంబంధించి రూ.2కోట్లు ఆక్సిజన్‌ సరఫరాదారులకు రూ.1.74కోట్లకుపైగా బిల్లులు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఇతరత్రా వాటిలో చేసిన ఖర్చులు బిల్లులు భారీగా పెండింగ్‌ ఉన్నాయి. మందులు, ఆక్సిజన్‌ సరఫరా చేసిన ఏజెన్సీలు జిల్లాలోనే కాక ఇతర ప్రాంతాల వారు కూడా ఉండగా బిల్లుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వత్తిడి తెస్తుండగా సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేశామని ప్రభుత్వం నుంచి రాలేదని వారు చెప్తున్నట్లు సమాచారం. అంతవరకు అధికారులు వారిని సమాధానపరుస్తున్నప్పటికీ థర్డ్‌ వేవ్‌ విస్తృతం అవుతుండటంతో ఈసారి మందులు, ఆక్సిజన్‌, ఆహారం సరఫరా, ఇతరత్రా అత్యవసరమైన వాటికి ఎలా అన్న ఆందోళన అధికారుల్లోనూ వ్యక్తమవుతోంది. 


Updated Date - 2022-01-11T06:38:06+05:30 IST