కాసులున్నా.. చెల్లింపులు సున్నా!

ABN , First Publish Date - 2020-08-07T10:25:17+05:30 IST

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు నెలల బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. ఎన్నిసార్లు చెల్లించాలని వేడుకున్నా అధికారుల్లో స్పందన..

కాసులున్నా.. చెల్లింపులు సున్నా!

 వసతిగృహల్లో కాంట్రాక్టర్లకు అందని బిల్లులు

రూ.2కోట్ల మేర పేరుకుపోయిన బకాయిలు

అధికారుల తీరుపై విమర్శలు


(కలెక్టరేట్‌): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు నెలల బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. ఎన్నిసార్లు చెల్లించాలని వేడుకున్నా అధికారుల్లో స్పందన లేదు. నేడు, రేపూ అంటూ తప్పించుకుంటున్నారు. దీనికి కారణం వారికి మామూళ్లు ఇవ్వకపోవడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదీ సమగ్ర శిక్షాభియాన్‌ శాఖలోని పరిస్థితి. ఈ శాఖ అధికారుల తీరుతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ(కేజీబీవీ) వసతిగృహాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు బిల్లుల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 32 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 230 మంది వంతున విద్యార్థినులు ఉన్నారు. వీరి ఆహారం కోసం బియ్యం, కూరగాయలు, పాలు, గుడ్లు, పండ్లు, పప్పులు, ఉప్పులు, నూనెతో పాటు కాస్మెటిక్స్‌,  దుస్తులు, వంటివి ప్రతి నెలా సరఫరా చేసే బాధ్యతను 12 మంది కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. దీనికోసం ప్రభుత్వం నెలకు ఒక్కో విద్యార్థినికి రూ.1400 చొప్పున ఖర్చు చేస్తోంది.


ఈ వస్తువులు అందించే కాంట్రాక్టర్లకు గత ఏడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు బిల్లులు చెల్లించలేదు. సుమారు రూ.2కోట్లపైనే బిల్లుల బకాయి ఉంది. ఈ శాఖలో నిధులు పుష్కలంగా ఉన్నా.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. పెండింగ్‌ బిల్లులు చెల్లించేందుకు అధికారులు బేరసారాలకు దిగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బేరం కుదరకపోవడంతో బిల్లులు చెల్లింపులో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబరు నెలకు సంబంధించి కొన్ని కేజీబీబీ వసతిగృహాలకు కూరగాయలు, నిత్యవసరాల బిల్లులు చెల్లించాల్సి ఉండగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి అన్ని కేజీబీవీలకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులే బహిరంగంగా చెబుతున్నారు.


సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల భారం మరింత పెరుగుతోందని కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మళ్లీ కేజీబీవీ వసతిగృహాలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందించాల్సి ఉంది. బిల్లుల బకాయిల కారణంగా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. 


త్వరలో చెల్లిస్తాం..పైడి వెంకటరమణ, సమగ్ర శిక్షాభియాన్‌ పీవో.

 కస్తూర్బా వసతిగృహాల కాంట్రాక్టర్లకు బిల్లులు బకాయిలు ఉన్నది వాస్తవమే.  త్వరలో వారికి బిల్లులు చెల్లిస్తాం. బిల్లుల చెల్లింపునకు కాంట్రాక్టర్లతో  బేరసారాలు సాగిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.  


Updated Date - 2020-08-07T10:25:17+05:30 IST