నిరీక్షణకు తెరపడేనా?

ABN , First Publish Date - 2022-07-02T05:19:40+05:30 IST

‘వారం రోజుల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తాం.. దీనిపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. పనులు చేసిన వారందరికీ నిబంధనల మేరకు చెల్లిస్తాం. సుమారు రూ.1,300 కోట్లు జమ కాబోతున్నాయి.’ అని ఇటీవల సాలూరులో జరిగిన వైసీపీ ప్లీనరీలో మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీంతో కాంట్రాక్టర్లలో ఆశలు చిగురించాయి.

నిరీక్షణకు తెరపడేనా?

  మంత్రి ప్రకటనతో చిగురించిన ఆశలు

  వెంటాడుతున్న సందేహాలెన్నో.. 

   చెల్లింపులు కొత్త బిల్లులకే పరిమితమా..!

  పాతవాటికి వర్తింపజేస్తారో.. లేదో?

  కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధుల్లో ఉత్కంఠ


(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)


‘వారం రోజుల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తాం.. దీనిపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. పనులు చేసిన వారందరికీ నిబంధనల మేరకు చెల్లిస్తాం. సుమారు రూ.1,300 కోట్లు జమ కాబోతున్నాయి.’ అని ఇటీవల సాలూరులో జరిగిన వైసీపీ ప్లీనరీలో మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీంతో కాంట్రాక్టర్లలో ఆశలు చిగురించాయి. తమ సమస్యలన్నీ తీరిపోతాయని భావిస్తున్నారు. అయితే ఈ చెల్లింపులు కొత్త బిల్లులకే పరిమితమా? అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది.  పాత బిల్లుల పరిస్థితేమిటని పలువురు కాంట్రాక్టర్లు  ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన  ‘నీరు-చెట్టు’ పనులకు ఇంతవరకూ పైసా కూడా చెల్లించలేదు. ఏదేమైనా మంత్రి బొత్స ప్రకటనతో కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఉత్కంఠ నెలకొంది. 

ఇదీ పరిస్థితి.. 

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్‌శాఖ ద్వారా పార్వతీపురం మన్యం, విజయనగరం ఉమ్మడి జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమం కింద అనేక చెరువు పనులు, కల్వర్టులు, చెక్‌డ్యాముల నిర్మాణం ప్రారంభించారు. ప్రధానంగా మన్యం జిల్లాలో సుమారు రూ. 22 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందుకోసం అప్పటి కాంట్రాక్టర్లు, స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు భారీగానే అప్పులు చేశారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తనఖా పెట్టి మరీ వాటి పనులు చేపట్టారు. అయితే ఇంతలో ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడంతో పరిస్థితి మారింది. ఒకటి కాదు.. రెండు కాదు సుమారు నాలుగేళ్లు గడుస్తున్నా వైసీపీ ప్రభుత్వం నీరు-చెట్టు పనులకు బిల్లులు చెల్లించడం లేదు. విచారణ పేరుతో కాలయాపన చేస్తోంది. దీంతో ఆయా పనులు చేపట్టిన  కాంట్రాక్టర్లు  ఆర్థికంగా చితికిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు చెల్లించాలని కోర్టు చెబుతున్నా  ప్రభుత్వం స్పందించడం లేదు. ఇదిలా ఉండగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో చాలాచోట్ల గ్రామ సచివాలయాలు, అంగన్‌వాడీ భవనాలు, సీసీ రహదారులు ఇలా అనేక పనులు చేపట్టారు.   స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు , కాంట్రాక్టర్లు వాటి నిర్మాణాలు చేపట్టారు. అయితే వాటికి కూడా సర్కారు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. దీంతో అనేకమంది కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులకు దూరంగా ఉంటున్నారు. టెండర్లు పిలిచినా ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల అధికారులు బతిమలాడుతున్నా వినడం లేదు. కాగా ఈ సమస్యను వైసీపీ ప్రజాప్రతినిధులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇటీవల మంత్రి బొత్స స్పందించి బిల్లులు చెల్లిస్తామని అభయమిచ్చారు.  అయితే కేవలం కొత ్త పనులకేనా, లేదా టీడీపీ హయాంలో చేపట్టిన నీరు-చెట్టు పనుల పెండింగ్‌ బిల్లులకూ మోక్షం కలిగిస్తారా? అన్నది సందేహంగా ఉంది. దీనిపై సర్కారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మరికొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంది. 

 బిల్లుల చెల్లింపులు జరగలేదు

గతంలో నీరు - చెట్టు కార్యక్రమంలో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులు జరగలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ పనులపై విచారణ చేస్తున్నాం. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం బిల్లులు చెల్లింపులు జరుగుతాయి.

- అప్పలనాయుడు, జిల్లా ఇరిగేషన్‌శాఖ ఇంజినీరింగ్‌ అధికారి


 


Updated Date - 2022-07-02T05:19:40+05:30 IST