బిల్లులు చూపించాల్సిందే.. కానీ వాళ్లకు మాత్రం మినహాయింపు.. తేల్చిచెప్పిన Kuwait

ABN , First Publish Date - 2021-09-18T23:30:46+05:30 IST

ఇతరుల నుంచి వాహనాలు కొనుగోలు చేసేవారికి కువైత్ తాజాగా కీలక సూచన చేసింది.

బిల్లులు చూపించాల్సిందే.. కానీ వాళ్లకు మాత్రం మినహాయింపు.. తేల్చిచెప్పిన Kuwait

కువైత్ సిటీ: ఇతరుల నుంచి వాహనాలు కొనుగోలు చేసేవారికి కువైత్ తాజాగా కీలక సూచన చేసింది. ఏదైనా వాహనం కొన్న తర్వాత తమ పేరుపై కాగితాలు మార్చుకునే సమయంలో అధికారులకు కొనుగోలుదారు దాని తాలుకు బిల్లు చూపించాల్సి ఉంటుందని వెల్లడించింది. నగదు చెల్లించి కొన్నట్లైతే దాని రశీదు, చెక్కు రూపంలో ఇచ్చినట్లైతే బ్యాంక్ రశీదు, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ చూపించాలని ట్రాఫిక్ విభాగానికి చెందిన అసిస్టెంట్ అండర్‌సెక్రెటరీ మేజర్ జనరల్ జమాల్ అల్ సయ్యేఘ్ ప్రకటించారు. ఇటీవల మనీలాండరింగ్ కేసుల విషయమై తనిఖీలు నిర్వహించిన సందర్భంలో కొందరు లగ్జరీ కార్లను నేరుగా నగదు ఇచ్చి కొనుగోలు చేసినట్లు తేలింది. వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా కువైత్ ఈ నిర్ణయం తీసుకుంది.


ఇవి కూడా చదవండి..

America లో దారుణం.. శవాలుగా కనిపించిన భారతీయ విద్యార్థులు.. కారులో వెళ్తుండగా..

New York లో మెగా ఫ్యాషన్ ఈవెంట్.. భారత్ నుంచి పాల్గొన్న ఈ Sudha Reddy ఎవరంటే..


అయితే, దీని నుంచి కుటుంబ సభ్యులకు మినహాయింపు ఇస్తున్నట్లు జమాల్ అల్ సయ్యేఘ్ ప్రకటించారు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య ట్రాన్స్‌ఫర్ జరిగినప్పుడు చెల్లింపులు జరిగే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తండ్రులు, కుమారులు, సోదరులు, భార్య, భర్తల మధ్య ఓనర్‌షిప్ మారితే బిల్లు చూపించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరికైన వాహనాన్ని బహుమతిగా ఇస్తే అమ్మిన వ్యక్తి ట్రాఫిక్ విభాగం హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక ట్రాన్సాక్షన్‌పై సంతకం చేయాల్సి ఉంటుందన్నారు. మిగతా అన్ని సందర్భాల్లో తప్పనిసరిగా కొనుగోలుదారు బిల్లులు చూపించాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.        



Updated Date - 2021-09-18T23:30:46+05:30 IST