చెరకు తోలిన 15 రోజుల్లోగా డబ్బు చెల్లించాలి

ABN , First Publish Date - 2021-04-13T05:47:52+05:30 IST

షుగర్‌ ఫ్యాక్టరీలకు చెరకు తోలిన 15 రోజుల్లోగా డబ్బు చెల్లించాలని, లేని పక్షంలో 15 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు.

చెరకు తోలిన 15 రోజుల్లోగా డబ్బు చెల్లించాలి
ధర్నాలో మాట్లాడుతున్న హేమలత

కలెక్టరేట్‌ వద్ద చెరకు రైతుల ధర్నా


చిత్తూరు, ఏప్రిల్‌ 12: షుగర్‌ ఫ్యాక్టరీలకు చెరకు తోలిన 15 రోజుల్లోగా డబ్బు చెల్లించాలని, లేని పక్షంలో 15 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. చెరకు బకాయిల కోసం సోమవారం కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ నేతమ్స్‌ పరిధిలోని చెరకు రైతులకు రూ.36.1 కోట్లు, మయూర పరిధిలోని యూనిట్‌-1 రైతులకు రూ.28.6 కోట్లు, యూనిట్‌-2 పరిధిలోని రైతులకు రూ.8.6 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిల కోసం పలుమార్లు పోరాటాలు చేసిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చీఫ్‌విఫ్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కలెక్టర్‌, కేన్‌ కమిషనర్లను కలిసిన స్పందన లేదన్నారు. రైతులకు బకాయిలు చెల్లించడంతో పాటు ఫ్యాక్టరీల్లో క్రషింగ్‌ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ధర్నా కార్యక్రమంలో చెరకు సంఘం నేతలు కుమార్‌రెడ్డి, హేమలత, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే చిత్తూరు- తచ్చూరు(716-బి హైవే) బాధితులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చిత్తూరు రూరల్‌, జీడీ నెల్లూరు, ఎస్‌ఆర్‌పురం, నగరి, పిచ్చాటూరు, నిండ్ర, విజయపురం మండలాల రైతులు ధర్నా నిర్వహించారు. 

Updated Date - 2021-04-13T05:47:52+05:30 IST