పార్కు పాయే..!?

ABN , First Publish Date - 2022-10-08T05:10:27+05:30 IST

నైపుణ్యం కలిగిన చేనేత యువతతోపాటు పలువురు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో గత చంద్రబాబు ప్రభుత్వం టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

పార్కు పాయే..!?

  1. టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుపై నీలి నీడలు
  2. టీడీపీ హయాంలో 96.5 ఎకరాల కేటాయింపు
  3. వైసీపీ ప్రభుత్వం వచ్చాక భూముల రద్దు
  4.  న్యాయస్థానం దారా నిలుపుదలచేయించిన చేనేతలు

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): నైపుణ్యం కలిగిన చేనేత యువతతోపాటు పలువురు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో గత చంద్రబాబు ప్రభుత్వం టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. బనవాసి జెర్సీ పశు క్షేత్రంలో 96.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కేటాయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక టెక్స్‌టైల్‌ పార్కుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాలు ముసుగులో పార్కుకు కేటాయించిన భూములను రద్దు చేశారు. దీంతో ఎమ్మిగనూరు చేనేతల దశాబ్దాల స్వప్నమైన టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. 

జిల్లాల్లో మగ్గమే ఆధారంగా జీవనం సాగిస్తున్న చేనేత కుటుంబాలు 25 వేలకు పైగా ఉన్నాయి. ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు, నందవరం, నాగులదిన్నె, గూడూరు ప్రాంతాల్లో అత్యధికంగా చేనేతలు ఉన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు.. మర మగ్గాల పోటీ.. రాజకీయ నాయకుల చేయూత కొరవడడం వెరసి అపరబ్రహ్మల బతుకు నానాటికి తీసికట్టుగా మారింది. స్వాతంత్ర్యానికి పూర్వమే చేనేత సహకార వ్యవస్థకు బలమైన పునాది వేసిన ఎమ్మిగనూరు పట్టణంలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2003లోనే ఎమ్మిగనూరు-ఆదోని ప్రధాన జాతీయ రహదారి పక్కనే ఉన్న బనవాసి జెర్సీ పశు క్షేత్రంలో ఈ పార్కు ఏర్పాటుకు ఆనాటి మంత్రి బీవీ మోహనరెడ్డి బీజం వేశారు. అయితే.. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, ఆ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పట్టించుకోకపోవడంతో టెక్స్‌టైల్‌ పార్కు లక్ష్యం నీరుగారిపోయిందిది.

96.5 ఎకరాలు కేటాయించిన చంద్రబాబు: 

పదేళ్ల తరువాత మళ్లీ టెక్స్‌టైల్‌ పార్కు ఆశలకు గత చంద్రబాబు ప్రభుత్వం జీవం పోసింది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన బీవీ జయనాగేశ్వరరెడ్డి ఈ పార్కు ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆనాటి సీఎం చంద్రబాబును ఒప్పించారు. అంతేకాదు.. పశుసంవర్థక శాఖకు చెందిన బనవాసి జెర్సీ పశు క్షేత్రంలో ఈ పార్కు ఏర్పాటు కోసం సర్వే నంబర్లు 343,344 పరిధిలో 91.31 ఎకరాల ప్రభుత్వం భూమిని చేనేత, జౌళి శాఖకు కేటాయిస్తూ 2016 ఏప్రిల్‌ 16న జీవోఎంఎస్‌ నెం:151 జారీ చేయించారు. గార్మెంట్‌ వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలు ఇక్కడకు రావాలంటే నీరు పుష్కలంగా ఉండాలి. ఈ భూములు పక్కనే తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) ప్రవహిస్తుంది. నీటి సమస్య తలెత్తకుండా ఆర్డీఎస్‌ కెనాల్‌లో భాగంగా ఇక్కడికి సమీపంలో 1.50 టీఎంసీ సామర్థ్యంతో కోటేకల్లు రిజర్వాయర్‌ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. డిగ్జమ్‌ వంటి ప్రముఖ గార్మెంట్‌ వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలను ఇక్కడికి తీసుకు వచ్చేందుకు పరిశ్రమ యాజమాన్యంతో టీడీపీ ప్రభుత్వం చర్చలకు సన్నహాలు కూడా చేసింది. రోడ్డు, డ్రైనేజీలు, నీటి సరఫరా, విద్యుత సరఫరా.. వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.3.7 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. కొద్ది నెలల్లోనే ఎమ్మిగనూరు ప్రజల చిరకాల స్వప్నమైన టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణానికి పునాది పడుతుందని ఆశించారు. ఇంతలో ఎన్నికలు రావడం, జగన సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. మళ్లీ ఈ పార్కు ఏర్పాటుపై నీలి మేఘాలు కమ్మేశాయి. 

ఫ భూములు రద్దు చేసిన ప్రభుత్వం: 

చేనేత యువతతో పాటు వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పించే టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, స్థానికి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆ దిశగా కృషి చేయాల్సి ఉంది. ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బనవాసి పశు క్షేత్రంలో టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేశారు. అక్కడ జగనన్న కాలనీల్లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు సన్నహాలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సహకారంతో చేనేత కార్మికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక్కడ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేసి గార్మెంట్‌ పరిశ్రామిక అభివృద్ధి చేస్తే ఆ పేరు టీడీపీకే దక్కుంతుందనే రాజకీయ దురుద్దేశంతోనే 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం, 2019లో జగన ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాయని చేనేత కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు కృషి చేయాలని చేనేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 


ఫ టీడీపీ ప్రభుత్వం రాగానే టెక్స్‌టైల్‌ పార్కు - బీవీ జయనాగేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మిగనూరు: 

ఎమ్మిగనూరు చేనేత కుటుంబాల్లో నైపుణ్యం కలిగిన యువత, మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో దివంగత మాజీ మంత్రి బీవీ మోహనరెడ్డి టెక్స్‌టైల్‌ పార్కుకు పునాది రాయి వేశారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక అటకెక్కించారు. పదేళ్ల తరువాత నేను ఎమ్మెల్యేగా గెలిచాక ఆనాటి సీఎం చంద్రబాబును ఒప్పించి టెక్స్‌టైల్‌ పార్కుకు 91.31 ఎకరాలు బనవాసి పశు క్షేత్రంలో కేటాయించాం. వైసీపీ ప్రభుత్వం భూములను రద్దు చేస్తే.. న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆపగలిగాం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయం. టెక్స్‌టైల్‌ పార్కు, ఆర్డీఎస్‌ కాలువ నిర్మాణం ప్రథమ ప్రాధాన్యతగా పూర్తి చేస్తాం. చేనేతలకు అండగా అన్ని విధాలుగా అండగా ఉంటాం. 

ఫ ఆ భూములు రద్దు వాస్తవమే - హరికృష్ణ, ఏడీ, చేనేత, జౌళి శాఖ, కర్నూలు: 

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎమ్మిగనూరు మండలం బనవాసి పశు క్షేత్రంలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు కేటాయించిన భూములను రద్దు చేసిన మాట వాస్తవమే. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ మేరకు ముందుకు వెళ్తాం. 


Updated Date - 2022-10-08T05:10:27+05:30 IST