పీఆర్సీ కాదది..పే రివర్స్‌ కమిషన్‌

ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST

సీఎం జగన్‌ అప్రజాస్వామికంగా రాత్రిపూట జీవోలతో ప్రభుత్వ ఉద్యోగుల కడుపుకొట్టేలా పే రివర్స్‌ కమిషన్‌ ప్రకటించారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ ఆరోపించారు.

పీఆర్సీ కాదది..పే రివర్స్‌ కమిషన్‌
సమావేశంలో మాట్లాడుతున్న కందుల దుర్గేష్‌, పీఏసీ సభ్యులు పంతం నానాజీ

  జనసేన నేత దుర్గేష్‌
సర్పవరం జంక్షన్‌, జనవరి 21:   సీఎం జగన్‌ అప్రజాస్వామికంగా రాత్రిపూట జీవోలతో ప్రభుత్వ ఉద్యోగుల కడుపుకొట్టేలా పే రివర్స్‌ కమిషన్‌ ప్రకటించారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ ఆరోపించారు.  నాగమల్లితోట ముత్తా క్లబ్‌లో పీఏసీ సభ్యుడు పంతం నానాజీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, డీఏలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన అశాస్త్రీయ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ పూర్తి సంఘీభావం తెలుపుతోందన్నారు. గతంలో ఎన్నడూలేని రీతిలో అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులను దూరం చేసుకున్న ఘనత సీఎంకే దక్కిందని ఆరోపించారు.  జాబ్‌ క్యాలెండర్‌తో నిరుద్యోగ యువత, ధాన్యం కొనుగోలు, బిల్లుల చెల్లింపులో రైతుల శాపనార్థాలు మూటకట్టుకున్నారని విమర్శించారు. ఏ ఉద్యోగులైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు పరోక్షంగా సహకరించారో వారి కడుపుకొట్టే రీతిలో ఉద్యోగ సంఘాలతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు. ఐఆర్‌ 27 శాతం ఉంటే దానిని 23 శాతానికి తగ్గించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. అయిదేళ్లకోసారి ఉద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాలను ఆర్థికపరిస్థితి బాగోలేదంటూ సాకు చూపుతున్న సీఎం సుమారు 80-85 మందిని సలహాదారులుగా నియమించి కోట్లాది రూపాయలను గౌరవ వేతనాలుగా చెల్లిస్తూ దుబారా చేస్తు న్నారని ఆరోపించారు.  పీఆర్సీని 10 ఏళ్లకు పెంచడం దారుణమన్నా రు. మట్టి ఖర్చులను సైతం తీసేసిన దౌర్భాగ్య పరిస్థితి ఉందని విమర్శించారు. 2020-21లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని కాగ్‌ నివేదిక ప్రకటిస్తే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందన్నారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా కౌంటర్‌ ఇవ్వాలని   సీఎం  మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు హుకుం జారీ చేశారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నాయకులు శెట్టిబత్తుల రాజబాబు, ఎం.శేషుకుమారి, అత్తి సత్యనారాయణ, పి.చంద్రశేఖర్‌, తాటికాయల వీరబాబు, కొండబాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST