పదేళ్లలో చెల్లించాలి..

ABN , First Publish Date - 2020-09-02T06:30:31+05:30 IST

లికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పదేళ్లలో ఈ బకాయిలను చెల్లించాలి...

పదేళ్లలో చెల్లించాలి..

  • ఏజీఆర్‌ బకాయిలపై ‘సుప్రీం’ తీర్పు 
  • టెల్కోలపై రూ.1.4 లక్షల కోట్ల భారం 


న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సర్దుబాటు చేసిన స్థూల బకాయిల (ఏజీఆర్‌)ను టెలికమ్యూనికేషన్స్‌ శాఖ (డాట్‌)కు చెల్లించేందుకు 15-20 ఏళ్ల గడువు ఇవ్వాలని వొడాఫోన్‌ ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌, టాటా టెలీసర్వీసెస్‌ చేసిన విజ్ఞప్తిని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. అంతేకాకుండా పదేళ్లలో ఈ బకాయిలను చెల్లించాలని ఆదేశించింది. అది కూడా వచ్చే ఏడాది మార్చిలోపు మొత్తం బకాయిల్లో 10 శాతం చెల్లించిన కంపెనీలకు మాత్రమే ఈ అర్హత లభిస్తుందని స్పష్టం చేసింది. మిగిలిన బకాయి మొత్తాలను 2022 మార్చి 31 నుంచి పది వాయిదాల్లో చెల్లించాలని ఆదేశించింది. 


ఇదే తుది తీర్పు

ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి ఇదే తుది తీర్పు అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో టెలికాం కంపెనీలపై రూ.1.4 లక్షల కోట్ల ఏజీఆర్‌ చెల్లింపుల భారం పడనుంది. మొత్తం రూ.1.69 లక్షల కోట్ల ఏజీఆర్‌ బకాయిల్లో కంపెనీలు ఇప్పటికే రూ.29,000 కోట్లు చెల్లించాయి. డాట్‌ కోరిన విధంగా ఏటా 8 శాతం వడ్డీతో పదేళ్లలో ఈ బకాయిలు చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.


వ్యక్తిగత పూచీ 

ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు సర్వోన్నత న్యాయస్థానం ఆయా కంపెనీల ఎండీలు, సీఈఓలను బాధ్యులను చేసింది. ఇందుకు వారు నెల రోజుల్లో తమ కంపెనీల తర పున లేదా వ్యక్తిగత హామీ ఇవ్వాలని కోరింది. దీంతో ఎంత మంది ఎండీలు, సీఈఓలు ఇందుకు సిద్ధమవుతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చెల్లింపుల్లో ఏ మాత్రం విఫలమైనా కోర్టు ధిక్కార చర్యలతో పాటు బకాయిలపై వడ్డీ, జరిమానా తప్పవని హెచ్చరించింది. చి వరి విడత బకాయి చెల్లించే వరకు ఈ సంస్థలు.. డాట్‌కు హామీగా చూపిన బ్యాంకు గ్యారెంటీలనూ సొమ్ము చేసుకునేందుకు వీల్లేదని పేర్కొంది. 


‘దివాలా’ బకాయిలు

దివాలా ప్రక్రియలో ఉన్న ఆర్‌కామ్‌, వీడియోకాన్‌ కంపెనీల ఏజీఆర్‌ బకాయిల చెల్లింపు విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం జాతీయ కంపెనీల న్యాయ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కి వదిలేసింది. ఈ కంపెనీల స్పెక్ట్రమ్‌ ఉపయోగించుకుంటున్న రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ నుంచి ఎందుకు ఈ బకాయిలు వసూలు చేయకూడదని గతంలో విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో దీనిపైనా మంగళవారమే ఈ అంశంలోనూ సుప్రీంకోర్టు స్పష్టత ఇస్తుందని కంపెనీలు భావించాయి. అయితే న్యాయస్థానం ఈ విషయాన్ని ఎన్‌సీఎల్‌టీకి అప్పగించింది. 


వొడాఫోన్‌కు తిప్పలే 

సుప్రీంకోర్టు తీర్పుతో వొడాఫోన్‌ ఐడియాకు తిప్పలు తప్పవని భావిస్తున్నారు. ఏజీఆర్‌ బకాయిల కింద ఈ కంపెనీ డాట్‌కు ఇంకా రూ.50,400 కోట్లు చెల్లించాల్సి ఉంది. కంపెనీ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే అంతంత మాత్రంగా ఉంది. దీంతో అసలు వొడాఫోన్‌  ఐడియా కంపెనీ దేశీయ టెలికాం రంగంలో ఉంటుం దా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఏజీఆర్‌ బకాయిలపై ఊరట లభించకపోతే దుకాణం మూసుకోవడం తప్ప మరో మార్గం లేదని కంపెనీ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా ఇంతకు ముందే ప్రకటించారు. 


రివ్యూ పిటిషన్‌!

ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీంకోర్టు తాజా తీర్పుపై టెలికాం కంపెనీలు రివ్యూ పిటిషన్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిశ్రా ధర్మాసనం ఇచ్చిన తీర్పు అమలు చేస్తే ఎయిర్‌టెల్‌పైనా రూ.25,985 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. తీర్పుపై రివ్యూకు వెళతామని టెలికాం కంపెనీల తరఫున వాదించిన అభిషేక్‌ సింఘ్వీ ఇప్పటికే ప్రకటించారు. 


మొబైల్‌ చార్జీలు పెరిగే చాన్స్‌

ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం ఇచ్చిన తీర్పుతో టెలికాం కంపెనీలు... వాయిస్‌, డేటా  టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ఏజీఆర్‌ బకాయిల్లో పది శాతం మొత్తాన్ని చెల్లించాలని టెలికాం కంపెనీలను సుప్రీం ఆదేశించటంమే ఇందుకు ప్రధాన కారణమం. సుప్రీం ఆదేశాల మేరకు మార్చి నాటికి భారతి ఎయిర్‌టెల్‌ రూ.2,600 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.5,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కంపెనీలు ఈ మొత్తాలను చెల్లించాలంటే ఒక్కో వినియోగదారు నుంచి ఆర్జించే రెవెన్యూ 10 శాతం, 27 శాతం పెంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే టారిఫ్‌ ధరలు కనీసం పది శాతం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులంటున్నారు. 


Updated Date - 2020-09-02T06:30:31+05:30 IST