కలిసి పని చేద్దాం

ABN , First Publish Date - 2020-12-06T04:05:38+05:30 IST

త్వరలో జరగనున్న తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలలో కలిసి పని చేసి, విజయం సాధిద్దామని జనసేనాని పవన్‌ కల్యాన్‌ బీజేపీ నేతలతో అన్నారు.

కలిసి పని చేద్దాం
పవన్‌ను కలిసిన ఎమ్మెల్సీ వాకాటి, బీజేపీ నాయకులు

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచి తీరుదాం

బీజేపీ నాయకులతో జనసేనాని

నెల్లూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : త్వరలో జరగనున్న తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలలో కలిసి పని చేసి, విజయం సాధిద్దామని జనసేనాని పవన్‌ కల్యాన్‌ బీజేపీ నేతలతో అన్నారు.  బీజేపీ నేత, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గుండ్లుపల్లి భరత్‌గుప్తా, మాజీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డిలు శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీరి మద్య తిరుపతి ఉప ఎన్నికల ప్రస్తావన వచ్చింది.  తిరుపతి ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని వారితో అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, జనసేన కలిసి పని చేస్తున్నాయని, ఈ జిల్లాలో కూడా కలిసి పని చేయాలని, జనసేన సైనికులను కలుపుకొని ప్రజ ప్రయోజనాల కోసం పోరాడడాలని పవన్‌ కోరారు. 


ముగిసిన పర్యటన

తుఫాన్‌ బాధిత రైతులను పరామర్శించి మనోధైర్యం నింపడానికి జిల్లాకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ రెండు రోజుల పర్యటన ముగిసింది. ప్రధానంగా రైతుల కోసమే జిల్లాకు వచ్చిన ఆయన పనిలోపనిగా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల పాటు పవన్‌ జిల్లాలోనే ఉన్నా అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. భారీ వర్షాల కారణంగా పవన్‌ రోడ్డు షోలు రద్దు కావడంతో తమ ప్రియతమ నాయకుడ్ని దగ్గరగా చూసే అవకాశం అభిమానులకు లేకపోయింది. 


రైతు బాధలు తెలుసుకొంటూ..!!

నాయుడుపేట, గూడూరు, మనుబోలు, నెల్లూరు, వెంకటగిరి, కోవూరు ప్రాంత రైతులతో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. తుఫాన్‌ నష్ట ప్రభావాన్ని వారిని అడిగి తెలుసుకున్నారు. మొలకెత్తిన విత్తనాలను, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ‘‘మీకు భయం లేదు మీకు అండగా జనసేన ఉంది. మీ పక్షాన ప్రభుత్వంతో పోరాడుతా’’మన్నారు. వరుసగా మూడు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.35వేల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లపై స్పందించకుంటే రైతులతో కలిసి  7వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపడతామని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 


జనసైనికులకు దిశానిర్దేశం

విభేదాలతో ఉన్న జనసైనికులతో శుక్రవారం రాత్రి పవన్‌ సమావేశమయ్యారు. విభేదాలు వీడి అందరూ కలిసి కట్టుగా ఉండాలని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు. అంతర్గత కుమ్ములాటలను సహించనని, పార్టీ ప్రతిష్టను బజారుకీడ్చేవాళ్లను ఉపేక్షించనని హెచ్చరించారు. ‘‘త్వరలో నెల్లూరుకు వస్తా, మూడు రోజులు ఇక్కడే ఉండి అన్నీ సెట్‌చేస్తా..! అప్పటి వరకు అందరూ సమైక్యంగా ఉండండి’.’ అని జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు.   

  

Updated Date - 2020-12-06T04:05:38+05:30 IST