హీరోగా పవన్‌కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నటన మాత్రమే కాదు.. ఆయనలో మరెన్నో టాలెంట్స్ ఉన్నాయి. కథలు రాస్తారు.. దర్శకత్వం వహిస్తారు, పాడతారు, ఫైట్స్ కంపోజ్ చేస్తారు. ఆయన ఏం చేసిన అభిమానులకు సంచలనమే! ఆయన పాట పాడారంటే ఆడియన్స్ కేరింతలు కొట్టాల్సిందే. అందుకు ఆయన పాడిన పాటలే నిదర్శరం. ఇప్పటిదాకా పవన్‌కల్యాణ్ 9 పాటలు పాడారు. ఒకటి రెండు మినహా అన్నీ సూపర్‌హిట్టే.
తాజాగా ఆయన మరోసారి గొంతు సవరించుకోబోతున్నారనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘భీమ్లానాయక్’ చిత్రంలో పవన్ ఓ పాట పాడబోతున్నారట. సంగీత దర్శకుడు తమన్ పవన్‌తో పాడించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ అందుకు సిద్ధంగా ఉన్నారా అన్నది తెలియాల్సింది. ఇప్పటికే ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్, ‘లాలా భీమ్లా’, పాటలు ఎంతగా అలరించాయో తెలిసిందే! మరి పవన్ పాడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.