హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలను తలపించిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకూ జరగనున్న ఈ పోలింగ్‌లో రాత్రి 8 గంటలకు ‘మా’ కింగ్ ఎవరో తేలిపోనుంది. ఓటేసేందుకు సభ్యులు తరలివస్తున్నారు. ఉదయమే ఓటేసేందుకు వచ్చిన టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా ఎన్నికల్లో ఇంత పోటీ గతంలో ఎప్పుడూ నేను చూడలేదు. ఈ ఎన్నికలకు ఇంత హడావుడి అక్కర్లేదు. తిప్పికొడితే 900ల ఓట్లున్నాయ్.. ఇందులో వ్యక్తిగత దూషణలు అవసరమా..?. వ్యక్తులు చేసే పని సినీ రంగానికి అంటదు. మా సభ్యుల్లో చీలిక అనేది రాదు. సినిమా ఇండస్ట్రీ చీలడమనే ప్రశ్నే ఉండదు. సినిమాలు చేసేవాళ్లు ఆదర్శంగా ఉండాలి. మోహన్ బాబు, అన్నయ్య (చిరంజీవి) గారు ఇద్దరూ మంచి స్నేహితులే. మా ఎన్నికలకు ఇంత హడావుడి అవసరమా..?. అసలు ఇంత హైప్ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. పొలిటికల్ టర్న్ అంటూ ఏమీ లేదు.. ఉండదు. అద్దాల మేడలో ఎవరు ఉంటున్నారు..?’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అనంతరం ఓటేసేందుకు పవన్ పోలింగ్ బూత్‌లోకి వెళ్లిపోయారు. ఇంతవరకూ ‘మా’ ఎన్నికలపై ఒక్క మాట కూడా మాట్లాడటని పవన్ ఒక్కసారిగా ఇలా మాట్లాడటం గమనార్హం.
కాగా.. ‘మా’ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది మొదలుకుని.. నిన్నటి వరకూ బరిలో ఉన్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. ప్యానెల్ సభ్యుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు.. కౌంటర్ ఎటాక్‌లు చాలానే జరిగాయి. ఓ వైపు.. ఇంటర్వ్యూలు.. మరోవైపు ప్రెస్మీట్లు, సభా వేదికలగా మాటల తూటాలు పేలాయి. ఈ ‘మా’ వ్యవహారం కాస్త వ్యక్తిగతంగా కూడా వెళ్లింది. మొత్తానికి కొన్ని గంటల్లో ‘మా’ పీఠం ఎవరిదో తేలిపోనుంది. మరీ ముఖ్యంగా పోటీ చేసే వారికంటే అటు ఇటు సపోర్ట్ చేసే వారయితే ఏ రేంజ్ మాట్లాడారో.. ఏం మాట్లాడారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎవరు గెలుస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు ఇలా ఉంటే.. గెలుపెవరిదనేది అధికారిక ప్రకటన వచ్చిన పరిస్థితి ఎలా ఉంటుందో.. ఏంటో..!