బీజేపీతో దోస్తీపై పవన్‌కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-01-23T16:27:21+05:30 IST

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలకు జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఏ పార్టీ నుంచీ వుంటారన్న దానిపై

బీజేపీతో దోస్తీపై పవన్‌కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

  • కలసికట్టుగా పని చేస్తేనే కూటమికి విలువ 
  • బీజేపీతో దోస్తీపై పవన్‌కల్యాణ్‌ 


తిరుపతి: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలకు జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఏ పార్టీ నుంచీ వుంటారన్న దానిపై పవన్‌కల్యాణ్‌ పర్యటనతో కూడా స్పష్టత రాలేదు. గురు, శుక్రవారాల్లో తిరుపతిలో పార్టీ నేతలతో  పవన్‌ కళ్యాణ్‌ సమావేశాలు నిర్వహించిన సందర్భంగా ఉమ్మడి అభ్యర్థిపై స్పష్టత వస్తుందని భావించారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను ఆయన తెలుసుకున్నారు. అలాగే జిల్లాలోని ఇతర నియోజకవర్గాల నేతల అభి ప్రాయాలను కూడా సేకరించారు. వీటిపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. పార్టీ పూర్తిస్థాయి యంత్రాంగం అంటే రాజకీయ వ్యవహారాల కమిటీ తిరుపతిలో ఆయన ఎదుటే అందుబాటులో వున్నా కూడా అభ్యర్థి విషయమై నిర్ణయం మాత్రం తీసుకోలేదు. శ్రేణుల నుంచీ మాత్రం తమ పార్టీ అభ్యర్థే బరిలో దిగాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. కాకపోతే పవన్‌ కళ్యాణ్‌ నుంచీ శ్రేణులకు ఏ రకమైన సంకేతాలూ ఇంకా అందలేదు. బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలతో మరోమారు చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని, ఏ విషయమైనా వారం రోజుల్లో తేల్చేస్తామంటూఆయన ప్రకటించారు.


గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన, బీజేపీ నిబద్ధతతో, కలసికట్టుగా పోటీ చేసిన తీరులోనే తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయాల్సివుందని, అప్పుడే తమ కూటమికి విలువ వుంటుందంటూ వ్యాఖ్యానించారు. పవన్‌ తీరును పరిశీలిస్తే తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి బీజేపీ నుంచే వుంటారన్న భావన కలుగుతోందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జనసేన పార్టీ నుంచీ ఉమ్మడి అభ్యర్థి వుంటే శ్రేణులు పూర్తిస్థాయిలో ఉత్సాహంగా ఎన్నికల్లో పనిచేస్తాయని, బీజేపీ అభ్యర్థి అయితే మాత్రం ఆ స్థాయిలో శ్రేణులు పనిచేయకపోవచ్చునని ఆ వర్గాలే చెబుతున్నాయి. అలాగని ఇప్పటికి అనిపిస్తున్నా ఉప ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ తిరుపతిలోనే మకాం వేసి ప్రత్యక్షంగా ప్రచారానికి దిగి, పార్టీ వర్గాలను పర్యవేక్షిస్తే మాత్రం శ్రేణులు పూర్తిస్థాయిలో శక్తియుక్తులు ప్రదర్శించి ఎన్నికల్లో దిగుతాయని ఆ వర్గాలు భావిస్తున్నాయి. 

Updated Date - 2021-01-23T16:27:21+05:30 IST