సింగిల్‌గా రమ్మనడానికి వాళ్లెవరు?

ABN , First Publish Date - 2022-05-09T08:25:21+05:30 IST

‘‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధమే. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వం.

సింగిల్‌గా రమ్మనడానికి వాళ్లెవరు?

ఎలా రావాలో డిసైడ్‌ చేసేది నేనే.. వైసీపీపై పవన్‌ ఫైర్‌

రాజకీయాల్లో నా వ్యూహాలన్నీ ప్రజల కోసమే.. జనం ఎజెండా తప్ప ఏ జెండా పట్టించుకోను

టీడీపీ ముందుకొస్తే పొత్తులపై మాట్లాడతా

రాష్ట్రంలో ఏదో ఒక అద్భుతం జరగనుంది

అస్తవ్యస్త పాలన, అంధకారం తొలగిపోవాలి

అందుకే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు

151 సీట్లు ఇచ్చిన జనాన్నే హింసిస్తున్నారు

ఈసారి వైసీపీకి 15 సీట్లు కూడా రావు

ప్రజల కన్నీళ్లు తుడవలేని ప్రభుత్వమెందుకు?

అధికారమిస్తే ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు

కుటుంబాలకు పింఛన్లు.. పిల్లలకు చదువులు

నంద్యాల జిల్లా శిరివెళ్ల రచ్చబండలో పవన్‌ 

130 కుటుంబాలకు లక్ష చొప్పున సహాయం


‘‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధమే. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వం. నేను పంతాలు, పౌరుషాలకు వెళ్లను. పొత్తుల విషయంలో రాష్ట్ర ప్రజల క్షేమం గురించే ఆలోచిస్తాను’’ - పవన్‌ కల్యాణ్‌


కర్నూలు, మే 8 (ఆంధ్రజ్యోతి): ‘‘మీరు ‘సింగిల్‌గా రావాలి... సింగిల్‌గా రావాలి’ అంటే... రావాలో లేదో నేను నిర్ణయించుకోవాలి. అది చెప్పడానికి నువ్వెవరవయ్యా!’’ అంటూ వైసీపీ నేతలపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు ‘సింహం సింగిల్‌గా వస్తుంది’ అని చెబుతున్నారని, సింగిల్‌గా సింహంలా వచ్చేసి వాళ్లు ప్రజలందరినీ చీల్చి చెండాడేస్తున్నారని మండిపడ్డారు. ‘‘సింహాలు గడ్డం గీసుకోవు.. నేను గీసుకుంటా.. అనే డైలాగులన్నీ నేను సినిమాల్లో చెబుతాను. అవి సినిమాల్లోనే బావుంటాయి’’ అని వ్యాఖ్యానించారు. ప్రజల ఎజెండా తప్ప మరే జెండా, ఎజెండా తాను మోయనని స్పష్టం చేశారు. ‘‘రాజకీయాల్లో పౌరుషాలు ఉండవు.  వ్యూహాలే ఉంటాయి. వైసీపీ నేతలు ఈ విషయం తెలుసుకోవాలి. అది కూడా ప్రజా క్షేమం కోసమే. నాకు పదవి కావాలని నేనెప్పుడూ వ్యూహం వేయను. మీ గుండెల్లో ఉన్న పదవి కంటే నాకు ఏ పదవీ ఎక్కువ కాదు’’ అని భావోద్వేగంతో అన్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని, ఆలోచించి ప్రజలు అడుగు ముందుకు వేయాలని కోరారు. 


‘కౌలు రైతు భరోసా యాత్ర’లో భాగంగా నంద్యాల జిల్లా శిరివెళ్ల మండల కేంద్రంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. వైసీపీ నేతలు, ప్రభుత్వం, సీఎం జగన్‌పై ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు. ‘‘వైసీపీ నేతలకు కొంచెం అతి ఎక్కువైంది. దాన్ని తగ్గించుకోవాలి. పుట్టిన కులాన్ని నేను గౌరవిస్తాను. కానీ, కులాన్ని ఆధారం చేసుకుని రాజకీయాలు చేయాలనుకుంటే ఎవరికీ మనుగడ ఉండదు. నేను అలాంటి వ్యక్తిని కాదు. కానీ, నన్ను వ్యక్తిగతంగా వైసీపీ నాయకులు దూషిస్తున్నారు. నేను కూడా వారి గురించి చాలా మాట్లాడగలను. పాత చిట్టాలు బయటకు తీయగలను. కానీ దానివల్ల ప్రయోజనం ఏముంది? జగన్‌ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇచ్చి.. జాబ్‌ కేలండర్‌ వేసి.. సీపీఎ్‌సను రద్దు చేస్తే  చప్పట్లుకొడతాం. ఏమీ చేయకుండా ఎందుకయ్యా! మేమేమైనా మీకు భజనపరులమా?’’ అని పవన్‌ నిలదీశారు. పొత్తులపై టీడీపీ ముందుకు వచ్చి మాట్లాడితే అప్పుడు పరిశీలిస్తామని ఒకప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి, ప్రజల యోగక్షేమాల కోసం పొత్తుల అంశాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తాం. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పని చేశాం. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడాలి. వ్యక్తిగతంగా లాభాపేక్ష ఆశించి పొత్తులకు వెళ్లను’’ అన్నారు. 


అందుకే ఓటు చీలనివ్వను.. 

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అనే వైఖరిని ఎందుకు తీసుకున్నది పవన్‌ వివరించారు. ‘‘వైసీపీ అస్తవ్యస్త పాలన నుంచి ఆంరఽధప్రదేశ్‌ను రక్షించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు. రాష్ట్రంలో ఎవరినీ బతకనీయడం లేదు. ఈ పరిస్థితులను బేరీజు వేసుకునే వైసీపీని తిరిగి అధికారంలోకి రానీయొద్దని కోరుతున్నాను. మళ్లీ వైసీపీ వస్తే ఆంధ్రప్రదేశ్‌ అంధకారంలోకి వెళ్లడం ఖాయం. రాష్ట్ర భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి. మా వెంట ఎవరెవరు కలిసి వస్తారో నాకు తెలియదు. కానీ, జనసేన బలంగా ఈ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్తుంది’’ అని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, పొత్తుల గురించి భవిష్యత్తులో మాట్లాడుకోవచ్చునని ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. త్యాగాలకు సిద్ధంగా లేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అంటున్నారు కదా అన్న ప్రశ్నకు పవన్‌ స్పందిస్తూ.... ‘‘ఆయన ఏం మాట్లాడారో నేను చూడలేదు. వంద శాతం బీజేపీతోనే పొత్తు ఉంది. అమరావతి గురించి అమిత్‌షాతో మాట్లాడాను. నాపై కేసులు లేవు. కాబట్టి ఏపీ భవిష్యత్తు గురించి, రాష్ట్ర అప్పులపై బీజేపీ జాతీయ నాయకత్వంతో నేను మాట్లాడగలను’’ అని పవన్‌ అన్నారు. 


మీ కోసమే భరిస్తున్నా...

ప్రజలకు మంచి చేస్తుంటే అది చూసి ఓర్వలేని వైసీపీ తన ఆర్థిక మూలలను దెబ్బతీసేవిధంగా ప్రయత్నిస్తోందని, మానసికంగా వేధిస్తోందని, అయినా ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్నీ భరిస్తున్నానన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల బిడ్డల చదువు, వారి కుటుంబాల్లోని వారికి పింఛన్లను అందించే బాధ్యతను తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా,  రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలకు మానవతా దృక్పథంతో స్పందించలేని ముఖ్యమంత్రి ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదేండ్ల మనోహర్‌ అన్నారు.


కన్నీరు తుడవని సర్కారు ఎందుకు?

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే... అందులో ఎక్కువమంది కర్నూలు జిల్లాలోనే ఉన్నారని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కన్నీరు తుడవలేని అధికారం, ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు.. ‘‘మంచి చేస్తారని నమ్మి ప్రజలు 151 సీట్లతో వైసీపీకి అధికారాన్ని కట్టబెడితే అధికారంలోకి వచ్చాక ప్రజలను హింస్తున్నారు. ఎన్నికల వేళ హామీలిచ్చిన అధికార పార్టీ నాయకులు ఆ తర్వాత ప్రజలకు మొహం చూపించడమే మానేశారు. ఈసారి ఆ పార్టీకి 15 సీట్లు కూడా రావు’’ అని మండిపడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.ఏడు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన వైసీపీ.. ఆ విషయమై పట్టించుకోవడం మానేసిందన్నారు. కానీ, అదే పని జనసేన చేస్తుంటే మాత్రం అడ్డుకుంటున్నారన్నారు. ‘‘ప్రజలకు మేలు చేయడానికే అప్పులు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ డబ్బులు మొత్తం ప్రజలకు చేరకుండా నాయకుల జేబుల్లోకి పోతున్నాయి. రైతులకోసం ధరల స్థిరీకరణ పేరిట రూ.మూడు వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్పింది. ఆ నిధులే అందితే రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటారు?’’ అని ప్రశ్నించారు. 

Read more