Oct 17 2021 @ 20:23PM

Pawan kalyan: మౌనంతోనే మంచు విష్ణుకు గట్టి సమాధానం!

‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణుకు పవన్‌కల్యాణ్‌ షాక్‌ ఇచ్చారు. జలవిహార్‌లో బండారు దత్తాత్రేయ నిర్వహించిన ‘అలయ్‌ బలాయ్‌’ కార్యక్రమానికి పవన్‌కల్యాణ్‌తోపాటు మంచు విష్ణు కూడా అతిథిగా హాజరయ్యారు. వేదికపై పవన్‌కల్యాణ్‌తో మాట్లాడటానికి విష్ణు ప్రయత్నించినా మౌనంతోనే తనదైన శైలిలో మంచు విష్ణుకు తన తిరస్కారాన్ని తెలిపారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. మౌనానికి మించిన తిరస్కారం మరొకటి లేదని, మంచు విష్ణుపై సమయానుకూలంగా తమ నాయకుడు దానిని ప్రయోగించారని జనసైనికులు సోషల్‌ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. 

ఇటీవల చిరంజీవి కుటుంబంపై మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణు పరోక్షంగా పంచ్‌లు వేసిన సంగతి తెలిసిందే! అంతకుముందు సమావేశంలో... పవన్‌కల్యాణ్‌ ఇండస్ట్రీ వైపా? ప్రకాశ్‌రాజ్‌ వైపా? అనే విమర్శలు చేశారు. ‘మా’ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి మెగా కుటుంబానికి ఆహ్వానం అందకపోవడంతో చిత్ర పరిశ్రమలో ఓ విభజన రేఖ ఏర్పడిందని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. పైగా ‘మేం అంతమంది ఉన్నాం.. ఇంత మంది ఉన్నాం’ అంటూ బెదిరించారని మోహన్‌బాబు పరోక్షంగా సెటైర్లు వేశారు. దీంతో ‘మేమంతా ఒకటి.. కళామతల్లి ముద్దు బిడ్డలం’ అంటూనే మోహన్‌బాబు మెగా ఫ్యామిలీని వేరుగా చూశారని విమర్శలు వస్తున్నాయి. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మంచు విష్ణు పవన్‌కల్యాణ్‌ను పలకరించినా..కన్నెతి చూడలేదు.  తన పక్కనే మంచు విష్ణు కూర్చున్నా ముక్కుమొహం తెలియని వ్యక్తి అన్నట్టుగా పవన్‌కల్యాణ్‌ కనీసం అటువైపు చూడలేదు. మామూలుగా పవన్‌కల్యాణ్‌ ఎలాంటి వ్యక్తి పలకరించినా మనసారా మాట్లాడతారు. కనీసం ఒక చిరునవ్వు విసురుతారు. తాజా కార్యక్రమాల్లో మంచు విష్ణు, మోహన్‌బాబు తన కుటుంబాన్ని శత్రువుల్లా అవమానించడం వల్లే పవన్‌ మౌనంగా ఉండి తగిన బుద్ది చెప్పారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు, మీమ్స్‌ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. క్రమశిక్షణకు మారుపేరైన మంచు కుటుంబ సభ్యులు ‘మాకు సంస్కారం ఉంది.. అటువైపు లేదు’ అనే అవకాశం కూడా ఉంది.