Pawan - Prakash Raj కలయిక... మరో రాజకీయ కలకలం!

ABN , First Publish Date - 2022-06-23T20:21:09+05:30 IST

ఒకప్పుడు ఆయన ఉప్పు అయితే.. ఈయన నిప్పు.. ఏమాత్రం పడేది కాదు. రాజకీయ విమర్శలు.. ప్రతి విమర్శలు సర్వసాధారణంగా జరుగుతుండేవి.

Pawan - Prakash Raj కలయిక... మరో రాజకీయ కలకలం!

హైదరాబాద్ : ఒకప్పుడు ఆయన ఉప్పు అయితే.. ఈయన నిప్పు.. ఏమాత్రం పడేది కాదు. రాజకీయ విమర్శలు.. ప్రతి విమర్శలు సర్వసాధారణంగా జరుగుతుండేవి. సీన్ కట్ చేస్తే.. ఓ సినిమాతో ఇద్దరూ కలిసిపోయారు. ఒక్కసారిగా కెమెరాల కళ్లన్నీ తమ వైపు తిప్పుకునేలా చేశారు. ఇక ఆ తరువాత వారిద్దరూ పెద్దగా కలిసింది లేదు. కానీ నేడు ఓ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారిద్దరూ మరోసారి కలిశారు. మళ్లీ వీరి కలయిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వారిద్దరూ ఎవరో కాదు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్.




పవన్ ఒక ఊసరవెల్లి...

ప్రకాష్‌రాజ్.. బీజేపీ పేరెత్తితే ఒంటికాలిపై లేస్తారు. ఇలాంటి తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీతో దోస్తి కట్టడం ఆయనకు కాస్త ఇబ్బందికరంగానే మారింది. దీంతో పవన్‌పై సైతం ఒకానొక సమయంలో ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. ‘పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి’ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ''పవన్ కల్యాణ్‌కు ఏమైందో నాకు నిజంగా అర్ధం కావండం లేదు. ఆయన నిర్ణయం నన్ను నిరుత్సాహానికి గురి చేసింది. మీరు నాయకుడు. మీకంటూ జనసేన పార్టీ ఉంది. మీరు ఇంకో నాయకుడికి మద్దతు ఎందుకు తెలుపుతున్నారు? మీ ఓట్ షేర్ ఏంటి? బీజేపీ ఓట్ షేర్ ఏంటి..? మీరు ఆయన భుజాలెక్కడం ఏంటి? 2014లో ఇంద్రుడు - చంద్రుడు అని మీరేనంటూ మద్దతు తెలిపారు. వారు ద్రోహం చేశారని గత ఎన్నికల్లో అన్నారు. మళ్లీ ఇప్పుడు మీకు నాయకుడిగా కనిపిస్తున్నారు. మీరు ఇన్ని సార్లు మారుతున్నారంటే ఊసరవెల్లి అయి ఉండాలి.'' అని ప్రకాష్ రాజ్ ఒకానొక సందర్భంలో పేర్కొన్నారు.




కెమెరాలు సైతం పోటీ పడ్డాయి..

రాజకీయంగా మంటలు చెలరేగుతున్న సమయంలోనే.. పవన్‌కి ‘వకీల్‌సాబ్’ సినిమాలో పవన్‌కి ధీటైన లాయర్ పాత్రకు మంచి నటుడు కావాల్సి వచ్చింది. ఆ పాత్రకు ఎవరైతే బాగుంటుందన్న తరుణంలో ప్రకాష్ రాజ్ టాపిక్ వచ్చింది. పవన్ నో అంటారేమోనని అంతా భావించారు. కానీ రాజకీయాలు వేరు.. సినిమా వేరని ప్రకాష్ రాజ్‌కి పవన్ ఓటేశారు. అప్పట్లో వకీల్ సాబ్ సెట్‌లోకి ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇవ్వడం పెద్ద సెన్సేషన్. వారిద్దరూ ఎదురు పడితే ఎలా ఉంటుంది? వారి ఎక్స్‌ప్రెషెన్స్‌కి క్యాప్చర్ చేయడానికి కెమెరాలు పోటీ పడ్డాయి. ఇద్దరూ చాలా ఆత్మీయంగా పలకరించుకున్నారు. అప్పటి నుంచి పవన్‌పై చేస్తున్న విమర్శలకు ప్రకాష్ రాజ్ చెక్ పెట్టారు.




సినిమా ప్రారంభోత్సవానికి పవన్, ప్రకాష్‌రాజ్..

సీన్ కట్ చేస్తే.. ‘మా’ ఎలక్షన్స్‌లో మెగా ఫ్యామిలీ.. ప్రకాష్‌రాజ్‌కు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఆ సమయంలో మరోసారి పవన్ సైతం ప్రకాష్ రాజ్‌కి అండగా నిలిచారు. ఇక ఇప్పటికీ కూడా పవన్ ‘బీజేపీకే నా ఫుల్ సపోర్ట్’ అంటున్నారు. అయినా కూడా ప్రకాష్ రాజ్.. బీజేపీని మాత్రమే విమర్శిస్తారు తప్ప.. పవన్‌ని పల్లెత్తు మాట కూడా అనరు. తాజాగా కూడా వీరిద్దరూ మరోసారి కలిశారు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌ తాజా చిత్రం నేడు ప్రారంభమయింది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రకాష్ రాజ్ సైతం హాజరయ్యారు. వీరిద్దరూ సెపరేట్‌గా కూర్చొని చాలా ఆత్మీయంగా మాట్లాడుకోవడం కెమెరా కళ్లను ఆకర్షించింది. రాజకీయంగా భిన్న ధృవాలైన వీరిద్దరూ అంత ఆత్మీయంగా చర్చించుకోవడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.




శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్టుగా.. 

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడా ప్రకాష్ రాజ్ సన్నిహితంగా మెలుగుతున్నారు.  కేసీఆర్ అనుకుంటే తప్ప ఆయన్ను కలవడం అసాధ్యం. కానీ ఈ ఏడాది ఆరంభంలో ప్రకాష్ రాజ్‌కు మాత్రం ఎప్పుడు అంటే అప్పుడు ఎంట్రీ లభించింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో ప్రకాష్ రాజ్, ప్రశాంత్‌కిషోర్‌లతో దాదాపుగా నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు. కేసీఆర్ ముంబై పర్యటనలోనూ ప్రకాష్ రాజ్ ఆయన పక్కనే ఉన్నారు. ఇది రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్టుగా.. వీరి దోస్తీ నడుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీకి బద్ద శత్రువైన ప్రకాష్ రాజ్‌తో కలిసి నడుస్తున్నారు. అప్పట్లో ప్రకాష్ రాజ్‌ను రాజ్యసభకు పంపాలని సైతం ఫిక్స్ అయ్యారని ప్రచారం జరిగింది. కానీ ఏమైందో ఏమో కానీ అది జరగలేదు. 


Updated Date - 2022-06-23T20:21:09+05:30 IST