ఒకటికే దిక్కులేదు.. మూడు రాజధానులా..

ABN , First Publish Date - 2020-12-03T05:48:49+05:30 IST

‘అమరావతి ఒక్క రాజధానికే దిక్కులేదు కానీ, మూడు రాజధానుల డాబెందుకో అర్థం కావటంలేదు. మూడు రాజధానులు కట్టేటంత సమర్థత ఉందంటే డబ్బున్నట్టే కదా. అటువంటప్పుడు రైతులకు పరిహారం ఇవ్వ డానికి ఇబ్బంది ఏమిటి..’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ రాష్ట్ర ప్రభు త్వాన్ని ప్రశ్నించారు.

ఒకటికే దిక్కులేదు.. మూడు రాజధానులా..
పెనుమూడి బ్రిడ్జి వద్ద పవన్‌ అభివాదం

48 గంటల్లోగా రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలి

హైదరాబాద్‌లో ఇళ్లలోకి నీరొస్తే రూ.10 వేలిచ్చారు..

ఇక్కడ పంట సర్వనాశనమైతే రూ.35 వేలు ఇవ్వలేరా..

ఒక్కఛాన్స్‌ కోసం కాదు.. సమస్య కోసం ఎక్కడికైనా వస్తా..

పంట పొలాలను పరిశీలించిన జనసేన నేత పవన్‌కళ్యాణ్‌ 


 తెనాలి, వేమూరు, రేపల్లె, భట్టిప్రోలు, అమృతలూరు, గుంటూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘అమరావతి ఒక్క రాజధానికే దిక్కులేదు కానీ, మూడు రాజధానుల డాబెందుకో అర్థం కావటంలేదు. మూడు రాజధానులు కట్టేటంత సమర్థత ఉందంటే డబ్బున్నట్టే కదా. అటువంటప్పుడు రైతులకు పరిహారం ఇవ్వ డానికి ఇబ్బంది ఏమిటి..’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ రాష్ట్ర ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. డెల్టా ప్రాంతంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి రైతుల కష్టాలను తెలు సుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో కష్టం వస్తే కానీ ఇంతమంది రోడ్డుపైకి రారని, సమస్య తీవ్రత అర్థం చేసుకున్నానని, నిద్రమత్తులో ఉన్న ప్రభుత్వాన్ని లేపుతానన్నారు. పాలకుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు. హైదరాబాద్‌లో ఇళ్లలోకి నీరొస్తేనే రూ.10 వేలు పరిహారంగా ఇచ్చారని, అన్నంపెట్టే రైతన్న సర్వం కోల్పోతే పెట్టుబడులు కూడా ఇవ్వకుంటే ఊరుకునేది లేదన్నారు. వచ్చే 48 గంటల్లో రూ.10 వేలు పరిహారం కింద విడుదల చెయ్యాలని, క్రిస్మస్‌ పండుగలోపు మిగిలిన రూ.25 వేలు మంజూరు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. సీఎం గాలిలో కాకుండా నేలపై తిరగాలని, రైతుల దగ్గరకు వెళ్తేనే వారి కష్టం తెలుస్తుందన్నారు. ఓ నేతలా తాను ఒక్క ఛాన్స్‌ ఇవ్వమని జనం దగ్గరకు వెళ్లి మోసం చెయ్యలేదని, భవిష్యత్‌లో అలా అడగనన్నారు. అదే సమస్య ఉందని పిలిస్తే ప్రజల కోసం ఎంతదూరమైనా వస్తానన్నారు.  అసెంబ్లీకి వచ్చి జనం కోసం చట్టాలు చేస్తారనుకుంటే బూతులతో నీచమైన సంస్కృతికి బీజం వేస్తున్నారని విమర్శించారు. రైతుల కన్నీళ్లు తుడవలేని ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటే ఉపయోగం ఏంటో చెప్పాలన్నారు. రాష్ట్రంలో 15 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినా ప్రభుత్వం స్పందించకపోవటం చూస్తుంటే రైతులను నట్టేట ముంచే దిశగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూ నేటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పంట నష్టపోయిన కారణంగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారని, ఇంకొకరికి ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం ఆదు కోవాలన్నారు. కొంతమంది మంత్రులు విచక్షణారహితంగా మాట్లాడుతూ రైతులను హేళన చేసే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 65 శాతం మంది కౌలు రైతులను తప్పనిసరిగా ఆదుకోవాలని డిమాండు చేశారు.     పట్టెడన్నం పెట్టే రైతన్న కష్టాల్లో ఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు అయినాలేదన్నారు. ఎంతసేపటికీ వారి పదవులు కాపాడుకోవటం కోసం ఒకరిపై మరొకరు తిట్ల దండకంతో పోటీ పడుతూ ముందుకు వెళుతున్నారే తప్ప రైతుల గురించి పట్టించుకోవడంలేదన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.


రైతు కన్నీరు.. చలించిన పవన్‌

‘మాది రేపల్లె అయ్యా నాపేరు గొరిపర్తి ఆంజనేయులు. 2.5 ఎకరాల్లో వరి పంట వేశాను. మొత్తం నీటిలో నానిపోయి ఇలా మొలకలు వచ్చాయి. అయ్యా మీరే ఆదుకోవాలి.. అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎదు ట కన్నీటి పర్యంతం అయ్యారు. చలించిపోయిన పవన్‌.. మీకు అండగా నేనుంటా అధైర్యపడవద్దు. ప్రభుత్వం ఆదుకునేంత వరకు పోరాటం చేస్తా నంటూ రైతుకు సర్థి చెప్పారు. చేతి లో చెయ్యి వేసి భుజం తట్టి ధైర్యం చెప్పారు.


Updated Date - 2020-12-03T05:48:49+05:30 IST