శివార్లకు మహర్దశ

ABN , First Publish Date - 2022-04-29T05:15:04+05:30 IST

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నగర శివార్లలోని

శివార్లకు మహర్దశ
హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి

  • జాతీయ రహదారుల విస్తరణకు నేడు శంకుస్థాపన
  • కేంద్రమంత్రి గడ్కరీ శంషాబాద్‌కు రాక
  • రూ. వేలకోట్లతో నిర్మాణ పనులు 
  • హైదరాబాద్‌- బీజాపూర్‌ హైవే పనులకు శ్రీకారం


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నగర శివార్లలోని జాతీయ రహదారుల విస్తరణ పనులకు నేడు తొలి అడుగు పడనుంది. హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేతో పాటు హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-నాగపూర్‌ రోడ్డు విస్తరణ పనులకు శుక్రవారం కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితీష్‌ గడ్కారీ శంకుస్థాపన చేయనున్నారు. శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న హైదరాబాద్‌ మహానగర విస్తరణకు అనుగుణంగా నగర శివార్లలో రూ. వేలకోట్ల రూపాయలతో కేంద్రం జాతీయ రహదారులను మరింత విస్తరిస్తోంది. ఈ అభివృద్ధి పనులకు నేడు కేంద్రమంత్రి నితీష్‌ గడ్కరీ శంషాబాద్‌లో భూమిపూజ చేయనున్నారు.  వాస్తవానికి హైదరాబాద్‌ శివార్లలోని జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విస్తరణ పనులు పూర్తయితే ట్రాఫిక్‌ సమస్యలు కూడా తీరతాయి. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవే విస్తరణకు ఇటీవలే కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. టెండర్లు కూడా పిలిచింది. ఈ రోడ్డు విస్తరణ పూర్తయితే రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లావాసులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నగర శివార్లలోని అనేక ప్రాంతాలు మరింత అభివృద్ధి సాధిస్తాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్‌-బీజాపూర్‌ నేషనల్‌ హైవే విస్తరణకు పర్యావరణ అటవీమంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపింది. అప్పా జంక్షన్‌ సమీపంలోని ఔటర్‌రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) నుంచి వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ వరకు గల 46 కిలోమీటర్లు రహదారిని రూ. 928.41 కోట్లతో నాలుగు లేన్లుగా  విస్తరిస్తున్నారు. ఈ రహదారి పనులకు అటవీశాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రోడ్డు విస్తరణ పనుల్లో అటవీశాఖకు సంబంధించి 106.85 ఎకరాల భూమిని సేకరించి ప్రత్యామ్నాయంగా మరోచోట 215 ఎకరాల భూములను కేటాయిస్తున్నారు. ఇక హైదరాబాద్‌-నాగపూర్‌ నాలుగు లేన్ల రోడ్లను ఇపుడు  ఆరులేన్లుగా విస్తరిస్తున్నారు. ఇందులో  కల్‌కల్లు నుంచి గుండ్లపోచంపల్లి వరకు 17 కి.మీ పొడవైన రహదారిని రూ.955.5 కోట్ల వ్యయంతో విస్తరించనున్నారు. అలాగే గుండ్లపోచంపల్లి నుంచి బోయినపల్లి వరకు గల 10కి.మీ పొడవైన రహదారిని రూ. 521.5కోట్ల వ్యయంతో విస్తరిస్తున్నారు. ఇక హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిని కూడా నాలుగులేన్ల నుంచి ఆరుకు విస్తరించనున్నారు. తొండుపల్లి- కొత్తూరు మధ్యగల  12కి.మీ నాలుగు లేన్ల రహదారిని రూ.541.6కోట్ల వ్య యంతో విస్తరిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌-విజయవాడ హైవేని ఆరులేన్లుగా విస్తరిస్తున్నారు. ఎల్‌బీనగర్‌ నుంచి మల్కాపూర్‌ వరకు గల  23కి.మీ రహదారిని రూ.545.11కోట్లతో విస్తరించనున్నారు. దీనికి సర్వీసు రోడ్డు కూడా నిర్మించనున్నారు. అలాగే బీహెచ్‌ఈఎల్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌- ముంబై హైవే మార్గంలో  రెండు కి.మీ పొడవైన ఫ్లైఓవర్‌ను రూ. 95కోట్ల వ్యయంతో  నిర్మిస్తున్నారు. అలాగే వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్‌ జిల్లాలో  (సీఆర్‌ఐఎఫ్‌) సెంట్రల్‌ రోడ్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ కింద రూ.154 కోట్లతో చేపడుతున్న 10కి.మీ పొడవైన నిర్మాణ పనులకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. 



Updated Date - 2022-04-29T05:15:04+05:30 IST