నేడు తిరుపతికి జనసేనాని రాక

ABN , First Publish Date - 2020-12-03T07:02:54+05:30 IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం తిరుపతి రానున్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించి తుఫాను నష్టాలను పరిశీలించనున్నారు.

నేడు తిరుపతికి జనసేనాని రాక

 జిల్లాలో రెండు రోజుల పర్యటన

 పార్టీ నేతలతో సమీక్ష.. ‘నివర్‌’ నష్టాల పరిశీలన


తిరుపతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం తిరుపతి రానున్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించి తుఫాను నష్టాలను పరిశీలించనున్నారు. నేతలతో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారని సమీక్షించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు పసుసులేటి హరిప్రసాద్‌, కిరణ్‌ రాయల్‌ పవన్‌ పర్యటన వివరాలను వెల్లడించారు. విజయవాడ నుంచి బయలుదేరి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ్నుంచి కరకంబాడి రోడ్డు మీదుగా విహాస్‌ హోటల్‌ చేరుకుని 4 గంటలకు మీడియా ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం జిల్లా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. అక్కడ్నుంచి నగర శివారులోని తాజ్‌ హోటల్‌కుఉ చేరుకుని రాత్రికి బస చేస్తారు. శుక్రవారం ఉదయం శ్రీకాళహస్తి వెళుతూ మార్గమధ్యంలో తుఫానుకు దెబ్బతిన్న పంటలు పరిశీలిస్తారు. ఇటీవల రాళ్ళవాగులో కొట్టుకుపోయి మరణించిన రైతు ప్రసాద్‌ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడ్నుంచి నెల్లూరు జిల్లా వెళ్లనున్నారు. కాగా, పవన్‌ కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది. నేతలతో సమీక్ష సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితి ఆరా తీయడంతోపాటు.. సంస్థాగత నిర్మాణం గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చనే ఆశాభావంతో ఉన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.

Updated Date - 2020-12-03T07:02:54+05:30 IST