పావలావడ్డీ ఫట్‌

ABN , First Publish Date - 2022-05-17T06:52:47+05:30 IST

జిల్లాలో పొదుపు సంఘాల మహిళలకు గత మూడు సంవత్సరాల నుంచి వడ్డీ డబ్బులు చెల్లించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నా యి.

పావలావడ్డీ ఫట్‌
స్వయం సహకార సంఘాల సమావేశం(ఫైల్‌)

మూడేళ్ల నుంచి డ్వాక్రా మహిళలకు అందని నిధులు 

జిల్లాలో రూ.49కోట్ల బకాయిలు 

పొదుపు సంఘాల మహిళల్లో నిరాశ

నిర్మల్‌, మే 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పొదుపు సంఘాల మహిళలకు గత మూడు సంవత్సరాల నుంచి వడ్డీ డబ్బులు చెల్లించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నా యి. 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పొదుపు సంఘాల మహిళలు తమ రుణాలకు సంబంధించిన చెల్లింపులు జరిపినప్పటికీ ఆ రుణాలకు సంబంధించిన వడ్డీడబ్బులు మాత్రం సంబంధిత అధికారులు చెల్లించడం లేదు. ప్రభుత్వం ద్వారా నిధులు విడుదలకాకపోతుండడంతోనే మహిళలకు ఈ వడ్డీ డబ్బులను చెల్లించలేకపోతున్నారన్న అభిప్రాయాలున్నాయి. పొదుపుసంఘాల మహిళలను అన్నివిధాలుగా ఆదుకొని వారికి అండగా నిలుస్తామని చెబుతున్న పాలకులు, ప్రజా ప్రతినిధులు వారికి చెల్లించాల్సిన వడ్డీ డబ్బుల విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.49 కోట్లను పొదుపు సంఘాల మహిళలకు వడ్డీడబ్బుల రూపంలో చెల్లించాల్సి ఉంది. ఈ వడ్డీ డబ్బుల కోసం పొదుపు సంఘాల మహిళలు అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. ప్రభుత్వం ద్వారా నిధులు విడుదలకాకపోతుండడంతోనే స్థానిక అఽధికారులు సైతం దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారని చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 18 మండలాలకు గానూ 504 వీఓలు, 12195 పొదుపు సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో 1,34,484 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. అలాగే నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో మొత్తం 2567 సంఘాలున్నాయి. ఈ సంఘాలన్నింటికీ మూడేళ్ల నుంచి వడ్డీ డబ్బుల బకాయిలు పేరుకుపోతుండడంతో కొత్తరుణాల మంజూరుకు అలాగే మంజూరైన రుణాల చెల్లింపులపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అయితే వడ్డీడబ్బుల విషయంలో జాప్యం చేస్తున్న అధికారులు మాత్రం ప్రభుత్వపరమైన కార్యక్రమాల కోసం పొదుపు సంఘాల మహిళలను ప్రధానశ్రోతలుగా ఆహ్వానిస్తూ ఆ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. ప్రస్తుతం పొదుపు సంఘాల మహిళలు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారంటున్నారు. ఆర్థికంగా వ్యాపారాలతో ఎదిగేందు కోసం ప్రయత్నిస్తున్న మహిళలకు వడ్డీడబ్బులు అందకపోతున్న కారణంగా ఆర్థికపరంగా వారు ఇబ్బందుల పాలవుతున్నారంటున్నారు. 

12,195 పొదుపు సంఘాల ఎదురుచూపులు

జిల్లాలోని 18 మండలాల్లోని 12195 డ్వాక్రా సంఘాల మహిళలతో పాటు నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాల్లోని 2,567 సంఘాల్లోని మహిళా సభ్యులంతా వడ్డీ డబ్బుల కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. 12195 సంఘాల్లో 1,34,484 మంది సభ్యులున్నారు. అలాగే మూడు మున్సిపాలిటీల్లో కూడా పెద్దసంఖ్యలోనే సభ్యులున్నప్పటికి వారి విషయంలో ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తోందన్న ఫిర్యాదులున్నాయి. వడ్డీ డబ్బుల కోసం పొదుపు సంఘాల మహిళలు అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ మూడేళ్ల నుంచి వారి గోడు అరణ్య రోధనగా మారుతోంది. 

రూ. 49 కోట్ల బకాయిలు

వడ్డీ డబ్బుల కింద పొదుపు సంఘాల మహిళలకు మొత్తం రూ. 49 కోట్ల మేరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2019 - 2020 సంవత్సరానికి గానూ 9423 సంఘాలకు రూ.7 కోట్ల 81 లక్షల 59వేల వడ్డీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2020 - 2021 సంవత్సరానికి గానూ 9,253 సంఘాలకు రూ.18 కోట్ల 22 లక్షల 66వేలను చెల్లించాల్సి ఉండగా 2021 - 2022 సంవత్సరానికి గానూ 9759 సంఘాలకు రూ.22 కోట్ల 10 లక్షల 52 వేలను చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 2019 - 2020 సంవత్సరంలో జిల్లాలోని అన్ని పొదుపు సంఘాలకు రూ. 166కోట్ల36 లక్షలను రుణాలుగా అందించారు. అలాగే 2020 - 2021 సంవత్సరంలో రూ. 264 కోట్లు, 2021- 2022 సంవత్సరంలో రూ.284 కోట్లను రుణాలుగా అందిం చారు. ఈ రుణాలకు సంబందించి రూ. 49 కోట్ల వడ్డీ డబ్బులు పొదుపు సంఘాలకు చెల్లించాల్సి ఉందంటున్నారు. 

మూడు మున్సిపాలిటీల్లో ఇదే దుస్థితి

జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో కూడా పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ డబ్బులు గత మూడు సంవత్సరాల నుంచి పేరుకుపోయాయి. వడ్డీడబ్బుల విషయంలో ఏ ఒక్క అధికారి కూడా పొదుపు సంఘాల సభ్యులకు స్పష్టతనివ్వడం లేదంటున్నారు. మూడు మున్సిపాలిటీలకు కలిపి 2567 పొదుపు సంఘాలున్నాయి. మూడు సంవత్సరాలకు కలిపి ఈ సంఘాలకు మొత్తం రూ. 39 కోట్లను రుణాలుగా చెల్లించారు. దీనికి సంబంధించి రూ.2 కోట్ల వడ్డీ మహిళ సంఘాలకు చెల్లించాల్సి ఉందంటున్నారు. పొదుపు సంఘాల మహిళలకు సంబందించిన వడ్డీ డబ్బులను జాప్యం లే కుండా వెంటనే చెల్లించాలన్న డిమాండ్‌ విస్తరిస్తోంది. 


చాలా రోజుల నుంచి వడ్డీ డబ్బులు రావడం లేదు

డ్వాక్రాగ్రూపులతో పావలావడ్డీకి రుణాలు తీసుకున్నాం. రుణాలు తీసుకొని చాలా రోజులు గడుస్తున్నప్పటికీ వడ్డీడబ్బులు మాత్రం ఇంతవరకు చెల్లించలేదు. ప్రభుత్వం పావలవడ్డీకి నెలనెలా డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ తమకు రా వాల్సిన వడ్డీ డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. ఇకనైనా సంబందిత అధికారు లు స్పందించి తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలి. 

మామిడాల రూప, డ్వాక్రా సంఘం సభ్యురాలు,                               

బుధవార్‌పేట్‌ కాలనీ , నిర్మల్‌

Updated Date - 2022-05-17T06:52:47+05:30 IST