May 17 2021 @ 13:33PM

ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నలిగిపోతున్నాం: పావలా శ్యామల

ఐదు రోజులు పస్తులున్నా...

ఆకలితో చనిపోతామనుకున్నా..

దయ చేసి మమ్మల్ని ఆదుకోండి

రంగస్థల నటి, హాస్యనటి, సహాయనటిగా తెలుగులో ఎన్నో చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన అలనాటి నటి పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్య పరిస్థితులతో నటనకు దూరమైన ఆమె ఎస్‌.ఆర్‌.నగర్‌ బీకేగూడలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. దురదృష్టశాత్తు ఆమె కూతురు కూడా మంచనా పడ్డారు. గతంలో టీబీతో బాధ పడి కోలుకుంటున్న సమయంలోనే  ఓ కాలికి ఫ్యాక్చర్‌ కావడంతో 18 నెలలుగా మంచానికే పరిమితమయ్యారు. అనారోగ్యంతో ఓపిక లేకుండా ఉన్న తల్లి శ్యామలనే ఆమెకు అన్ని పనులు చేసి పెడుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులతో నలిగిపోతున్నారు. సినీ పరిశ్రమ నుంచి, దాతల నుంచి సాయం కోరుతున్నారు. ఆమె కష్టాలు తెలుసుకున్న నటి కరాటే కల్యాణి ఆదివారం పావలా శ్యామల ఇంటికి వెళ్లి రూ.10వేల సాయం చేశారు. ఈ తరుణంలో పావల్యా శ్యామల ‘చిత్రజ్యోతి’తో మాట్లాడారు. 

‘‘చాలాకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మూడు నెలలుగా ఇంటి అద్దె కట్టలేదు. ఇటీవల ఓ ఐదు రోజులు పస్తులున్నాం. ఆకలితో, నా బిడ్డను మంచం మీద  వదిలేసి నా ప్రాణం పోతాదేమో’ అని భయపడుతున్నా.  కెరీర్‌ బిగినింగ్‌ నుంచి ఆకలి నొప్పి తెలిసినా, ప్రస్తుతం అనుభవించిన బాధ, నొప్పితో భయపడాల్సి వచ్చింది. చుట్టు పక్కల వారు అభిమానులు 100, 150, 200, 500 ఇలా సాయం చేయడంతో పూట గడుస్తుంది. నాకు, కూతురికి కలిపి మందుల నిమిత్తం నెలకు రూ.10 వేలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు నేనే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. దిక్కు తోచడం లేదు. అవార్డులు అమ్మి ఇల్లు గడుపుతున్నా. ప్రతి నెల వచ్చే ఫించన్‌ కూడా రావడం లేదు. కరోనా వల్ల ఎవరూ ఏ సాయం చేయడానికి ముందుకు రావడం లేదు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
చిరంజీవి స్వయంగా పంపారు...

రెండేళ్ల క్రితం మా అమ్మాయికి టీబీ వ్యాధి వచ్చిన సమయంలో మా పరిస్థితి తెలుసుకున్న చిరంజీవిగారు వారి కుమార్తెతో రూ. 2 లక్షల పంపించి ఆదుకున్నారు. ఆ తర్వాత కాలికి చేయించిన సర్జరీకి రూ.5 లక్షలు ఖర్చయింది. ఆ సమయంలో చెన్నైలో ఉన్న రాజా రవీంద్రగారు ‘నేను చిరంజీవిగారిని కలిపిస్తాను. మీ కష్టాన్ని ఆయనతో చెప్పండి’ అన్నారు. అన్నట్లుగానే చిరంజీవిగారిని కలిసే ఏర్పాటు చేశారు. కానీ మా అమ్మాయి కదలలేని స్థితిలో ఉండడం వల్ల ఆయనకు కలవలేకపోయాం, కృతజ్ఞతలు చెప్పలేకపోయాం. ‘గబ్బర్‌సింగ్‌’ టైమ్‌లో పవన్‌కల్యాణ్‌ లక్ష, నాకు పరిచయం లేని అజయ్‌ రెడ్డిగారు నా వివరాలు తెలుసుకుని అమెరికా నుంచి లక్ష పంపారు. వీరందరి సహాకారంతో నా బిడ్డకు వైద్యం చేయించగలిగాను. ఆసుపత్రి బిల్లుకు కొంత తక్కువైతే ‘మా’ అసోసియేషన్‌లో నేను సభ్యురాలిని కాకపోయినా రూ.80వేలు చెల్లించింది’’ అని శ్యామల తెలిపారు.