Abn logo
Oct 22 2021 @ 00:52AM

మట్టి మేత!

క్వారీ వద్ద జరుగుతున్న మట్టి తవ్వకాలు

  గుంటూరు రూరల్‌ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు

నేతల అండదండలతో అడ్డగోలు తవ్వకాలు

 నోరుమెదపని అధికార యంత్రాంగం


ప్రత్తిపాడు, అక్టోబరు 21: చేతిలో అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చు.. ఎంతైనా కొల్లగొట్టవచ్చు.. అనే రీతిలో గుంటూరు రూరల్‌ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జాతీయ రహదారిలో వరుసగా లారీల్లో మట్టి తరలిపోతోంది.  అడిగేవారు.. అడ్డుకునేవారు లేరు.. ఏ మాత్రం జంకుగొంకూ లేకుండా.. పగలూ రాత్రి తేడా లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి గొడుతూ అక్రమ రవాణా సాగుతోంది. వీటిని అదుపు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

గుంటూరు రూరల్‌ మండలం ఓబులనాయుడుపాలెం, నాయుడుపేట గ్రామాల పరిధి అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డాగా మారింది. గతంలో మట్టి మాఫియా ఇక్కడ రాజ్యమేలింది. నాడు గుట్టు చప్పుడు కాకుండా రాత్రివేళల్లో తవ్వకాలు చేసేవారు. కాని వారి స్థానాన్ని నేడు ప్రజా ప్రతినిధులు ఆక్రమించారు. అధికార పార్టీ నేతలు అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ నియోజవర్గానికి చెందిన ఓ కీలక నేత కనుసన్నల్లో మట్టి తవ్వకాలు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. కొండల నుంచి గుట్టల వరకు ఏదీ వదలకుండా మట్టిని కొల్లగొడుతున్నారు. 

ఓ నేత కుమారుడి మిత్రబృందం దందా

ఓ నేత కుమారుడు నాయుడుపాలెం ప్రాంతంలో తన మిత్ర బృందం ఆధ్వర్యంలో  తవ్వకాలను సాగిస్తున్నట్లు సమాచారం. మిత్రబృందంలో ఒకరు అక్కడే ఉండి మట్టి లారీలను లెక్కగట్టి వారి ఖర్చులకు సంపాదించుకుంటున్నారు. ఇందుకోసం మట్టి తవ్వకాల్లో అనుభవం కలిగిన వ్యక్తికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి తన చేతికి మట్టి అంటకుండా సబ్‌లీజ్‌లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. వారాలు, నెలల చొప్పున కాబూలీ వసూళ్ల లాగా ఆ నేతకు సొమ్ము ఇచ్చే పద్ధతిలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక చోట కాదు.. రెండు చోట్ల కాదు.. ఏకంగా నాలుగైదు చోట్ల గ్రూపుల వారీగా మట్టిని కొల్లగొడుతున్నారు. ఇందులో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా వాటాలు కలవడంతో ఇక ఈ ప్రాతం మొత్తం రాత్రింబవళ్లు టిప్పర్ల మోతలు, దుమ్ముతో సందడిగా ఉంటుంది. 

నిత్యం వందలాది లారీల మట్టి తరలింపు

ఇక్కడి నుంచి నిత్యం వివిధ ప్రాంతాలకు వందలాది లారీల మట్టి సరఫరా అవుతుంది. మట్టి కోసం ఇక్కడ సుమారు 20 నుండి 30 వరకు పెద్ద పెద్ద టిప్పర్లు వెయిటింగ్‌లో ఉంటున్నాయంటే ఇక్కడ మట్టి తవ్వకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ అడ్డగోలుగా 50 అడుగుల లోతు వరకు మట్టిని  తీస్తున్నారు. ఈ క్వారీల వలన ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా  ప్రాణానికి విలువ లేకుండా మట్టిని తవ్వేస్తున్నారు. 

మౌనంగా  సంబంధిత అధికారులు 

 మట్టి తవ్వకాల విషయంలో నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు మౌననిద్రలో ఉన్నారు. ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడరు.. ఆ ప్రాంతంలో వేరెవరైనా మెనింగ్‌కు అడుగు పెడితే మాత్రం సంబంధిత అధికారులు అప్రమత్తమవుతున్నారు. వారిని చీల్చి చెండాడి తిన్నది కక్కించే వరకు నిద్ర పోరు. కానీ కీలకనేత కనుసన్నల్లో జరిగే తవ్వకాల వైపు కన్నెత్తి కూడా చూడరు. ఇందులో మాత్రం తమ భక్తిని ప్రదర్శిస్తూ మెప్పు పొందుతున్నారు. దీంతో మట్టి తవ్వకాలకు ఎలాంటి అడ్డూఅదుపు లేకుండా పోతోంది.  జిల్లాలోని ఓ కీలక నేత కనుసన్నల్లో మట్టి తవ్వకాలు జరుగుతుండటంతో  సంబంధిత అధికారులు  మిన్నకుండిపోతున్నారు. పత్రికలలో కథనాలు వచ్చిన సమయంలో నాలుగు రోజులు మట్టి తవ్వకాలు ఆపడం, ఆ తరువాత తిరిగి మరలా ప్రారంభించడం ఆనవాయితీగా మారింది.