Advertisement
Advertisement
Abn logo
Advertisement

భూ మాయ!

వక్ఫ్‌బోర్డు భూమి తనదంటూ..

స్టాంప్‌ పేపర్లపై రాసిచ్చిన గనికపూడి వైసీపీ సర్పంచ్‌

అందులో ప్రభుత్వ భవన నిర్మాణాలు

తాజాగా బిల్లులు మంజూరు

చర్యలు మాత్రం శూన్యం

 

 అధికార వైసీపీకి చెందిన ఓ సర్పంచ్‌ తనది కాని వక్ఫ్‌బోర్డు భూమిని తనదంటూ పంచాయతీకి స్టాంపు పేపర్లపై రాసి ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ విషయం  గతంలో అటు అధికారులు, ఇటు హోంమంత్రి దృష్టికి వెళ్లింది. అయినా దీనిని ఇప్పటివరకు గుట్టుగా ఉంచారు. అయితే ఇప్పుడు ఈ బిల్డింగులకు బిల్లులు మంజూరు చేయడంతో విషయం బయటకు వచ్చింది. 


ప్రత్తిపాడు, డిసెంబరు 2: మండలంలోని గనికపూడిలో సచివాలయంతో పాటు వెల్‌నెస్‌ సెంటర్‌, రైతుభరోసా కేంద్రం ఏర్పాటుకు స్థల అన్వేషణ జరిగింది. అయితే ఆ సమయంలో గ్రామ సర్పంచ్‌ షేక్‌ మహమ్మద్‌  20 సెంట్ల వక్ఫ్‌బోర్డు భూమిని తనదంటూ పంచాయతీకి రాసిచ్చాడు. దీనిని పరిశీలించకుండా అధికారులు వెంటనే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వర్క్‌ ఆర్డర్‌ రావడం సచివాలయం, వెల్‌నెస్‌ సెంటర్‌, రైతుభరోసా కేంద్రాలను హుటాహుటిన ప్రారంభించారు. బిల్డింగ్‌ నిర్మాణాలు సగం పూర్తయిన తరువాత వక్ఫ్‌బోర్డుకు చెందిన సభ్యుల ద్వారా ఈ భూమి సర్పంచ్‌ మహమ్మద్‌ది కాదని అధికారులకు తెలిసింది. దీంతో వారి గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. స్థానిక నాయకుల ద్వారా ఈ విషయాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత దృష్టికి కూడా తీసుకెళ్లారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. సాధారణంగా ఇలాంటి విషయాలలో అధికారులు తప్పుడు రిజిస్టర్‌ చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారు. కాని ఆ దిశగా అడుగులు వేయకపోగా ఇప్పుడు బిల్లులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ బిల్డింగులలో స్థానికులు పత్తిని నిల్వ ఉంచుకున్నారు. 


బిల్డింగులకు బిల్లులు మంజూరు

వక్ఫ్‌బోర్డు భూమి విషయంలో స్పష్టమైన జీవోలు ఉన్నాయి. వాటిని ఎవరికి అమ్మకాలు కాని, ఏ విధమైన కట్టడాలు కాని ఉండకూడదనే నిబంధన ఉంది. అలాంటి భూమిలో కట్టడాలకు ప్రభుత్వం ఇప్పుడు బిల్లులు మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీకి చెందిన సర్పంచ్‌ కావడంతో బిల్లులను మంజూరు చేయిస్తున్నారనే విమర్శ కూడా వినిపిస్తోంది


పనులను ఎప్పుడో ఆపివేశాం..

ఈ విషయంపై పంచాయతీ రాజ్‌ ఏఈ కిషోర్‌ను వివరణ కోరగా.. అది సర్పంచ్‌ స్థలం కాదని, వక్స్ఫ్‌బోర్డు భూమి అన్న విషయం తమ దృష్టికి రావడంతోనే పనులను ఆపివేశాం అన్నారు. అయితే ఇప్పుడు బిల్లులు ఎలా మంజూరయ్యాయో తనకు తెలియదన్నారు.   

Advertisement
Advertisement