టీడీపీ పథకాలకే వైసీపీ కొత్త ముసుగు వేస్తోంది: పట్టాభిరామ్

ABN , First Publish Date - 2020-02-25T22:09:14+05:30 IST

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానాలను తుంగలో తొక్కిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు.

టీడీపీ పథకాలకే వైసీపీ కొత్త ముసుగు వేస్తోంది: పట్టాభిరామ్

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానాలను తుంగలో తొక్కిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువు కోసం లక్షా యాభై వేలు ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పారన్నారు. ప్రకటనల కోసం కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వివిధ పథకాల కింద విద్యార్థులకు రూ.37 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సిఉందని.. కానీ కేవలం రూ. 12,400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. రూ. 25 వేల కోట్లు కోత పెట్టి విద్యార్థులను ముఖ్యమంత్రి మోసం చేశారన్నారు. 


టీడీపీ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఏటా రూ. 4 వేల కోట్లు చెల్లించామని పట్టాభిరామ్ తెలిపారు. టీడీపీ పథకాలకే వైసీపీ కొత్త ముసుగు వేస్తోందని విమర్శించారు. టీడీపీ అమలు చేసిన పథకాలను ప్రభుత్వం రద్దు చేసి విద్యావ్యవస్థను సర్వ నాశనం చేస్తోందన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ నిలిపివేయడం వల్ల ఏపీలో 100 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. టీడీపీ హయాంలో నేరుగా మెస్ చార్జీలు చెల్లిస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం విద్యార్థులను రోడ్డున పడేస్తోందని, టీడీపీ హయాంలో అందించిన 12 రకాల స్కాలర్ షిప్‌లను వైసీపీ రద్దు చేసిందన్నారు. వైసీపీ తప్పుడు, తుగ్లక్ నిర్ణయాలవల్ల కాలేజీల యాజమాన్యాలు కోర్టులను ఆశ్రయించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అమలు చేసిన నిరుద్యోగ భృతి కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి విద్యార్థులకు అన్యాయం చేసిందన్నారు. విద్యావ్యవస్థ విషయంలో వైసీపీ విధానాలకు వ్యతిరేకంగా  రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని పట్టాభిరామ్ స్పష్టం చేశారు.


Updated Date - 2020-02-25T22:09:14+05:30 IST