హైదరాబాద్‌లో పెట్రోల్‌ సెంచరీ

ABN , First Publish Date - 2021-06-15T08:16:04+05:30 IST

పెట్రో ధరలు భగభగమండుతున్నాయి. సోమవారం చమురు కంపెనీలు లీటరు పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచాయి.

హైదరాబాద్‌లో పెట్రోల్‌ సెంచరీ

  • రూ.100.20కు చేరిన లీటరు ధర 
  • అత్యధికంగా ఆదిలాబాద్‌లో లీటరుకు 102.22
  • వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల్లోనే వంద లోపు..
  • పెట్రోల్‌పై 29, డీజిల్‌పై 30 పైసలు పెంపు
  • మే 4 నుంచి 24సార్లు పెరిగిన ధరలు


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జూన్‌ 14: పెట్రో ధరలు భగభగమండుతున్నాయి.  సోమవారం చమురు కంపెనీలు లీటరు పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర 30 పైసలు పెరిగి రూ.100.20కు చేరింది. లీటరు డీజిల్‌ ధర రూ.95.14 పలుకుతోంది.  పెట్రోల్‌ ధర తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లోనే వందలోపు (24 పైసలు తక్కువ) ఉంది.  ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా రూ.102.22గా ఉంది. ఇక దేశంలో ముంబై తర్వాత పెట్రోల్‌ ధర రూ.100 దాటిన రెండో మెట్రో నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. ముంబైలో ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ రూ.102.58 ఉండగా.. డీజిల్‌ రూ.94.70గా ఉంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో లీటరు పెట్రోల్‌ ధర దేశంలోనే అత్యధికంగా రూ.107.53 ఉండగా.. డీజిల్‌ ధర రూ.100.37కు చేరింది. ఇక సోమవారంతో మే 4 నుంచి పెట్రో ధరలు 24సార్లు పెరిగాయి.  లీటరు పెట్రోల్‌ ధర రూ.6.01, డీజిల్‌ ధర రూ.6.55 పెరిగింది.   


ఆదిత్య థాక్రే జన్మదినాన రూ.1కే పెట్రోల్‌

పెట్రోల్‌ ధరలు మండిపోతున్న తరుణంలో ఈ ఇంధనాన్ని తక్కువ ధరకే పంపిణీ చేస్తే ఎలా ఉంటుంది. వాహనదారులకు పండగే! మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం థాణేలోని డోంబివ్లిలో ఓ పెట్రోల్‌ పంపు వద్ద శివసేన మద్దతుదారులు లీటరు పెట్రోల్‌ను రూ.1కే పంపిణీ చేశారు.  పెట్రోల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా ఇలా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 500 మందికి పెట్రోల్‌ పోయాలని నిర్ణయించారు. వాహనదారులు భారీ ఎత్తున తరలిరావడంతో  2 గంటల వరకు సమయాన్ని పొడిగించారు. దాదాపు 1,200 మంది ఈ ప్రయోజనాన్ని పొందారు.

Updated Date - 2021-06-15T08:16:04+05:30 IST