Haryana: వామ్మో.. స్కూల్ పిల్లలే కానీ పెళ్లిదాకా వెళ్లారు బాబోయ్.. ట్విస్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-07T20:15:19+05:30 IST

సోషల్ మీడియా ప్రభావం కావొచ్చు.. సినిమాల ప్రభావం కావొచ్చు.. లేదా మరోటి కావొచ్చు పిల్లల ఆలోచనల్లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. వయసును కూడా మర్చిపోయి.. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. అం

Haryana: వామ్మో.. స్కూల్ పిల్లలే కానీ పెళ్లిదాకా వెళ్లారు బాబోయ్.. ట్విస్ట్ ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్రభావం కావొచ్చు.. సినిమాల ప్రభావం కావొచ్చు.. లేదా మరోటి కావొచ్చు పిల్లల ఆలోచనల్లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. వయసును కూడా మర్చిపోయి.. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పిల్లలే ఉదహరణ. పాఠశాలలో చదివే పిల్లలు.. పై చదువులపై దృష్టి పెట్టకుండా తెలిసీ తెలియని తనంతో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అయ్యారు. ట్విస్ట్ ఏంటంటే.. వివాహం చేసుకోవడానికి ఏకంగా ఆ పిల్లలు రాష్ట్ర సరిహద్దులు కూడా దాటేశారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


బిహార్‌లోని పాట్నా‌లో స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతున్న ఇద్దరు టీనేజ్ అమ్మాయిలను ఇద్దరు టీనేజ్ అబ్బాయి‌లు ఇష్టపడ్డారు. ఆ అమ్మాయిలు కూడా ఆ ఇద్దరబ్బాయిలకు ఆకర్షితులు కావడంతో వారి మనసుల్లో కలిగిన భావాలను ప్రేమ అనుకున్నారు. వయసుకు మించిన ఆలోచన చేసి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్రాలు దాటి హర్యానాలోని పానిపట్‌కు చేరారు. అక్కడ ఉన్న ప్రముఖ దేవీ ఆలయంలో పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టారు. అయితే.. దేవాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ సమయంలో అక్కడ ఉన్న ఐదుగురు టీనేజర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముగ్గురు బాలికలు.. ఇద్దరు అబ్బాయిలను చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా అధికారులు వారి నుంచి వివరాలు సేకరించేందుకు పలు ప్రశ్నలు అడిగారు. అయితే.. తొలుత తమ చిరునామాను చెప్పేందుకు ఇష్టపడని ఆ ఐదుగురు.. కట్టు కథలు వినిపించారు. ఆ తర్వాత అధికారులు లోతుగా ప్రశ్నించడంతో చివరికి నోరు విప్పారు. వివాహం చేసుకోవడానికి పాట్నా నుంచి పానిపట్‌కు వచ్చినట్టు చెప్పారు.



ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అధికారులు.. తమ సంరక్షణలో ఐదుగురు టీనేజర్లు ఉన్నట్టు చెప్పారు. ఇందులో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమ పేరుతో పెళ్లికి సిద్ధం కాగా.. మరో అమ్మాయి వారికి మద్దతు ఇచ్చిందని అన్నారు. అంతేకాకుండా ఇద్దరు అబ్బాయిలూ ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నారని.. అందులో ఒకరి వయసు 18ఏళ్లు కాగా.. మరొకరి వయసు 17 ఏళ్లని వెల్లడించారు. అదే విధంగా ఇద్దరు అమ్మాయిలు 8వ తరగతి చదువుతున్నారని.. వారి వయసు 15-16 ఉంటుందని పేర్కొన్నారు. ఈ అమ్మాయిల వెంట వచ్చిన మరో అమ్మాయి వయసు మాత్రం కేవలం 13 ఏళ్లే ఉన్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. కాగా.. టీనేజర్ల విషయంలో పానిపట్ పోలీసులు పాట్నా పోలీసులను సంప్రదించి వివరాలు తెలియజేశారు. పేపర్ వర్క్ పూర్తైన తర్వాత పిల్లలను బిహార్ పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉంటే.. పిల్లలు కనిపించకుండా పోవడంతో భయాందోళనలకు గురైన టీనేజర్ల తల్లిదండ్రులు.. స్థానిక పోలీసులను ఆశ్రయించారట. తమ పిల్లలను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు కూడా చేశారట.


Updated Date - 2022-08-07T20:15:19+05:30 IST