చివరి మజిలీ పట్నమే!

ABN , First Publish Date - 2021-05-15T08:19:50+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఎస్‌.లింగోటం గ్రామానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి కరోనాతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

చివరి మజిలీ పట్నమే!

  • జిల్లాల నుంచి హైదరాబాద్‌ ఆస్పత్రులకు రోగులు.. 
  • చికిత్స పొందుతూ మృతిచెందితే ఇక్కడే అంత్యక్రియలు’’
  • ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర మృతులూ ఇక్కడి మట్టిలోనే
  • ఊర్లో పాడె వెంట నలుగురు నడిచేవారు ఉండరనే? 
  • అంత్యక్రియలకు రూ.70వేల దాకా వసూలు

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఎస్‌.లింగోటం గ్రామానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి కరోనాతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ మృతిచెందాడు. అంత్యక్రియలను ఊర్లో నిర్వహించాలా? నగరంలోనే జరపాలా? అని బంధువులు కొట్టుమిట్టాడారు. బంధువులను, ఊర్లో పెద్ద మనుషులను సలహా కోరగా నగరంలో నిర్వహించడమే ఉత్తమం అని సూచించారు. దీంతో ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని నేరుగా హయత్‌నగర్‌ శ్మశాన వాటికకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత ఊరికి వెళ్లి పోయి ఇతర కార్యక్రమాలు చేసుకున్నారు.
 

   పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన 52ఏళ్ల వ్యక్తికి కరోనా సోకగా తొలుత ఇంట్లోనే చికిత్స పొందాడు. పది రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సహాయకులుగా వెంట భార్య, కొడుకు ఆస్పత్రికి వచ్చారు. ఇటీవల అదే ఆస్పత్రిలో ఆ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్‌ వచ్చింది. మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లలేమని, ఇక్కడే అంత్యక్రియలు జరిపేయండంటూ ఆస్పత్రి నిర్వాహకులను కోరారు. అంత్యక్రియల నిర్వహణకు వారు రూ.35వేలు అడిగితే చెల్లించేసి.. మృతదేహాన్ని కడసారి చూసి, అప్పగించి ఇంటికి వెళ్లిపోయారు. 


 ..ఇలా ఎన్నో ఘటనల్లో వివిధ ప్రాంతాలకు చెందిన రోగులకు చివరి మజిలీ హైదరాబాదే అవుతోంది. బంధుమిత్రుల కన్నీళ్ల నడుమ మృతులకు చివరి వీడ్కోలు పలికే పరిస్థితులు ఎప్పుడో పోయినా.. మృతుల్లో చాలామందికి   కనీసం వారు పుట్టి పెరిగిన ఊర్లోనైనా అంత్యక్రియలు జరగట్లేదు. స్వస్థత పొందేందుకు నగరానికొస్తే, ప్రాణాలు పోయి.. ఇక్కడి మట్టిలోనే కలవాల్సి వస్తోంది. వివిధ జిల్లాలకు చెందినవారే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగుల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. మృతదేహాలను స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, బంధువులు సాహసించడం లేదు. కొందరు ఆ ఆలోచన చేసినా.. వారి సంబంధీకులు వారిస్తున్నారు. దీంతో చివరి చూపు చూసి.. నాలుగు కన్నీటి బొట్లు కార్చేసి.. నగర శ్మశానవాటికల్లో ఎక్కడో ఓ చోట అంత్యక్రియలు జరిపించండంటూ దహన కార్యాలను జరిపించే సంస్థలకు మృతదేహాలను అప్పగించేస్తున్నారు. నగరంలో మెరుగైన వైద్య సేవలు లభిస్తుండటంతో మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక నుంచి కూడా రోగులు వస్తున్నారు. వీరిలోనూ ఎవరైనా మరణిస్తే.. స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు సంబంధీకులు సాహసించడం లేదు. 


సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మహారాష్ట్ర నుంచి వచ్చిన రోగుల్లో సుమారు 30మంది వరకు మరణిస్తే వారి మృతదేహాలను స్థానికంగా అంత్యక్రియలు నిర్వహించే కాంట్రాక్టర్లకు రూ.50వేల నుంచి రూ.70వేల వరకు చెల్లించి అప్పగించిన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ కొవిడ్‌ నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో కరోనా మరణాలు ఇటీవల పెరిగాయి. రోజుకు కనీసం 20 వరకు మరణాలు ఉంటున్నాయని సిబ్బందే చెబుతున్నారు. ఆయా వార్డుల నుంచి కుటుంబీకులకు సిబ్బంది ఫోన్‌ చేసి చెబితే వారొచ్చి వచ్చి చివరి చూపు చూసుకొని వెళ్తున్నారు. సొంతూరికి తీసుకెళితే.. అంత్యక్రియల కోసం నలుగురు వెంట వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇక్కడే జరిపిస్తున్నారు. మరికొందరైతే తమకు అంత్యక్రియలు నిర్వహించే స్థోమత లేదని, మునిసిపాలిటీకి అప్పగించాలని గాంధీ ఆస్పత్రి సిబ్బందిని వేడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో గాంధీ సహా నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి అంతిమ సంస్కారాలను విద్యుత్తు దహన వాటికల్లో నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖ సిబ్బంది పర్యవేక్షణలో కొనసాగుతోంది.  

అంత్యక్రియలకు భారీగా వసూలు
కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండటం, ఇక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తుండటంతో దహన క్రియల కోసం భారీగా వసూలు చేస్తున్నారు. మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు అంబులెన్స్‌ల నిర్వాహకులు రూ.15వేల నుంచి రూ.20వేలు తీసుకుంటుండగా, శ్మశానంలో చితి సిద్ధం చేసి, దహనం చేసేందుకు నిర్వాహకులు రూ.30వేల నుంచి రూ.50వేలు వసూలు చేస్తున్నారు.  

Updated Date - 2021-05-15T08:19:50+05:30 IST