సహనం, సాహసాలే ఆభరణాలుగా...

ABN , First Publish Date - 2022-08-11T08:59:07+05:30 IST

అది 1932. మాతృదేశ విముక్తి కోసం శాంతి సమరంలో పాల్గొన్న మహిళా ఖైదీలతో రాయవేలూరు జైలు కిక్కిరిసి ఉంది.

సహనం, సాహసాలే ఆభరణాలుగా...

ది 1932. మాతృదేశ విముక్తి కోసం శాంతి సమరంలో పాల్గొన్న మహిళా ఖైదీలతో రాయవేలూరు జైలు కిక్కిరిసి ఉంది. వారిలో జానకీబాయి ఒకరు. ఉన్నట్టుండి ఒక రోజు ఆమె గదిలో నుంచి పాపాయి ఏడుపు వినిపించింది. ‘‘జానకీబాయమ్మ వదినగారి యోగమాయను చూద్దాం రండి’’ అని సంబరపడుతూ మహిళా ఖైదీలందరూ ఆమె గది దగ్గరకు చేరుకున్నారు. ఆ యోగమాయే జానకీబాయి తొలి సంతానం రఘుమాయాదేవి. 


విశాఖపట్నంలో తీవ్రస్థాయిలో శాసనోల్లంఘన ప్రచారం చేసి... సభలు, సమావేశాలు జరిపి... పికెటింగులు, హర్తాళ్ళు నడిపి... ఉప్పు తయారు చేసి, పద్ధెనిమిది నెలల శిక్ష అనుభవించడానికి జైలుకు వచ్చారు జానకీబాయి. అప్పటికి ఆమెకు రెండో నెల గర్భమని ఇంట్లో వాళ్ళకే తెలీదు. పురిటి సమయం వచ్చింది. ఇకమీదట రాజకీయాలలో పాల్గొననని ఒక కాగితం ముక్క మీద రాసి ఇచ్చి, సుఖంగా ఇంటికి పొమ్మని జైలు అధికారులు ఆమెకు ఎన్నో విధాలుగా చెప్పి చూశారు. ‘‘నేను జైలుకు వచ్చి స్వాతంత్య్రం తేలేకపోతున్నానేమో కానీ, క్షమాపణ ఇచ్చి ఇంటికిపోయి, నా దేశానికి అపఖ్యాతి తీసుకురాను’’ అని ఆమె కచ్చితంగా చెప్పేశారు. కాన్పు జైలులోనే జరిగింది. అది ఆమెకు రెండోసారి జైలు వాసం. ఆమె భర్త.. రామస్వామి గాంధీజీ శిష్యునిగా ప్రసిద్ధి పొందినవారే.


జానకీబాయి విశాఖపట్నంలో 1902 నవంబరు 30న జన్మించారు. పన్నెండేళ్ళకు దిగుమర్తి రామస్వామితో వివాహం అయింది. విశాఖపట్నంలో భర్త అనుమతితో  క్వీన్‌ మేరీస్‌ హైస్కూలు చేరి, స్కూలు ఫైనల్లో టాపరయ్యారు. మద్రాస్‌ క్వీన్‌ మేరీస్‌ కాలేజీలో ఇంటర్మీడియెట్‌లో చేరినా, కంటి జబ్బు కారణంగా ముగించలేదు. ప్రభుత్వం తరఫున ఎడ్యుకేషన్‌ కమిటీలోకి ఆహ్వానించినా తిరస్కరించి, కొండా వెంకటప్పయ్యపంతులు స్థాపించిన శారదా నికేతనంలో లెక్కలు, ఇంగ్లీషు బోధించేవారు. 


1919లో రౌలట్‌ చట్టాన్ని గాంధీజీ నిరసించారు. గాంధీజీ మాటను పాటించి... జానకీబాయి భర్త రామస్వామి కూడా ఉద్యోగం వదిలేసి, భార్యాసమేతంగా... నెల్లూరులో గాంధీజీ శంకుస్థాపన చేసిన పినాకినీ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ జానకీబాయమ్మ అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారు. కాకినాడ కాంగ్రెస్‌ మహాసభ.. ఢిల్లీలో జరిగిన రెండవ మహిళా విద్యా సభలో పాల్గొని... మహిళలకూ పురుషులతో సమానంగా ఆస్తి తదితర హక్కులుండాలని వాదించారు. ఉప్పు సత్యాగ్రహం కోసం విజయనగరం నుంచి భర్తతో కలిసి విశాఖపట్నానికి పాదయాత్ర చేశారు. ఆ సమయంలో పోలీసులు రామస్వామి చేతి బొటనవేలును విరిగేలా వంచి, బలవంతంగా ఆయన గుప్పిట నుంచి ఉప్పు లాక్కున్నారు. ఒకతను జానకీబాయి చేతిలోంచీ ఉప్పు తీసుకోవడానికి మొరటుగా చేతిని నొక్కేశాడే. ‘‘నన్ను అరెస్ట్‌ చేసి ఉప్పు స్వాధీనం చేసుకో’’ అని ఆమె పిడికిలి బిగించారు. అతను ఇంకా బలంగా నొక్కుతున్నా ఆమె ఆ బాధ భరించి, నవ్వుతూ నిలబడ్డారు. 


1932 జనవరిలో గాంధీజీ అరె్‌స్టను నిరసిస్తూ... మహిళలు బహిరంగ సభలు జరిపారు. పోలీసులు ఆ సభను చెల్లాచెదురు చేస్తే.. నిరసనగా జానకీబాయి, ఆమె అత్త బంగారమ్మ తదితరులు ఆ మరునాడు నిరసన సభ జరిపారు. జానకీబాయిని కాళ్ళు, చేతులు పట్టుకొని విసిరేశారు. అక్కడ ఉద్రిక్తం కావడంతో... మహిళలు సత్యాగ్రహంలో పాల్గొనకూడదని ఆంధ్ర నాయకులు శాసించారు. కానీ జానకీబాయి తదితరులు కార్యకలాపాలను కొనసాగించారు. 


రామస్వామితో సహా నాయకులందరూ అరెస్ట్‌ కావడంతో... ఒంటరిగానే వాలంటీర్‌ శిబిరాన్ని జానకీబాయి నిర్వహించారు. వాలంటీర్లతో విశాఖ శిబిరంలో ఉప్పు వండారు. ఆమె రాకపోకలను పోలీసులు అటకాయించగా... నిరశన చేశారు. పోలీసులు శిబిరంపై దాడి చేసి... 1932 ఫిబ్రవరి 16న ఆమెను అరెస్ట్‌ చేశారు. ఏడాది శిక్ష, అయిదొందల జరిమానా విధించారు. చెల్లించను అనటంతో మరో ఆరు నెలల శిక్ష వేశారు. జరిమానా ఎదుర్కొన్న ప్రథమ ఆంధ్ర మహిళ జానకీబాయి. అప్పటికి ఆమె గర్భిణి. 


జైలు నుంచి విడుదలైన రామస్వామి బందరు జాతీయ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా నియమితులు కావడంతో... ఆ తరువాత విడుదలైన జానకీబాయి కూడా అక్కడికి చేరుకున్నారు. ఉద్యమాల్లో, ప్రచారాల్లో పాల్గొన్నారు. తర్వాత ఆమె దృష్టి సంఘసేవ వైపు మళ్ళింది. విశాఖపట్నం పురపాలక సంఘం సభ్యురాలుగా పోటీ లేకుండా రెండుసార్లు ఎన్నికయ్యారు. వివిధ సంఘాలతో కలిసి పని చేశారు. మహిళా, వయోజన విద్యకోసం, వైద్య సాయం కోసం పలు కార్యక్రమాలు సాగించారు. 

స్వాతంత్య్ర సమర రజతోత్సవం సందర్భంగా ఆంధ్రమహిళా సభ ఆమెను, రామస్వామినీ సన్మానించింది. అదే ఏడాది భారత ప్రభుత్వం తామ్రపత్రంతో ఆమెను గౌరవించింది. ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో భరించే సహనం, సాహసం ఆభరణాలుగా చివరివరకూ సమాజ శ్రేయస్సుకోసం తపించి, శ్రమించిన జానకీబాయి 1987 జూన్‌ 25న తనువు చాలించారు. 

(‘స్వతంత్ర సమరంలో ఆంధ్రమహిళలు’ సంకలనం నుంచి)

Updated Date - 2022-08-11T08:59:07+05:30 IST