వాసాలమర్రి అభివృద్ధికి బాటలు

ABN , First Publish Date - 2022-05-19T06:27:56+05:30 IST

సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రి సమగ్రాభివృద్ధికి జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. గ్రామ పునర్నిర్మాణంలో భాగంగా సకల సదుపాయాలతో ఆధునిక కాలనీల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.

వాసాలమర్రి అభివృద్ధికి బాటలు
తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులు, రోడ్డు వెంట పలు ఇళ్లను కూల్చిన అధికారులు

గ్రామ పునర్నిర్మాణానికి ప్రణాళిక 

అర్కిటెక్‌తో నూతనంగా లేఅవుట్‌ రూపకల్పన 

426కుటుంబాలకు 200గజాల్లో పక్కా ఇళ్లకు ప్రతిపాదనలు 


యాదాద్రి, మే18 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రి సమగ్రాభివృద్ధికి జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. గ్రామ పునర్నిర్మాణంలో భాగంగా సకల సదుపాయాలతో ఆధునిక కాలనీల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో గ్రామ స్వరూపాన్ని, రూపురేఖలను మార్చేందుకు కసరత్తు ప్రారంభించింది.  గ్రామంలోని పురాతన ఇళ్లు, గుడిసెలను తొలగించి, నూతనంగా లేఅవుట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఆర్కిటెక్‌తో గ్రామ పునర్నిర్మాణ స్వరూపాన్ని రూపొందించింది. ఈమేరకు రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న పలువురి ఇళ్లను ఎక్స్‌కవేటర్లతో తొలగించారు. ప్రస్తుతం వాసాలమర్రి నుంచి ప్రధానరోడ్డుకు అనుసంధానంగా రహదారిని నిర్మిస్తున్నారు. ఈ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా గ్రామంలో కమ్యూనిటీవారీగా ఇళ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్న దానిపై అధికారులు సర్వే చేపట్టారు. అయితే ఇటీవల గ్రామ పునర్నిర్మాణంపై నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్రామ పునర్నిర్మాణం చేపడుతామని, అన్ని అనుమానులు నివృత్తి చేసిన తర్వాతే పనులు చేపడుతామని జిల్లా అధికారులు ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు అంగీకారం తెలపడంతో గ్రామంలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో మొత్తం 426 కుటుంబాలు ఉన్నాయని, ఒక్కో కుటుంబానికి నూతనంగా ఏర్పాటు చేయనున్న లే అవుట్‌లో 200గజాల చొప్పున ఇళ్లను నిర్మిస్తామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ఇందుకు సహకరించాలని కోరింది. 


ఎక్కువ స్థలాలున్న వారి పరిస్థితి ఏమిటీ? 

వాసాలమర్రిలో గుడిసెలతోపాటు పెంకుటిళ్లు, ఆర్‌సీసీ భవనాలు ఉన్నాయి. అయితే ఇవ్వన్ని కూడా అత్యల్పంగా 50 గజాల నుంచి 1000 గజాల స్థలంలో ఇళ్లను నిర్మించుకున్నారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన లేఅవుట్‌లలో 200 గజాల్లోనే ఇళ్లను నిర్మిస్తుందని, తమకు ఉన్న మిగతా స్థలం పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా తమకు గ్రామంలో బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఇళ్ల స్థలాల కు ఎలాంటి పరిహారం చెల్లిస్తారని ప్రజలు పట్టుబడుతున్నారు. దీంతో అధికారులు గ్రామంలోని మొత్తం ఇళ్లు, ఓపెన్‌ ప్లాట్ల సర్వే చేపట్టారు. గ్రామంలో మొత్తం 426 పక్కా ఇళ్లను గుర్తించారు. వీరిలో 100గజాల్లో పు ఇళ్లు ఉన్న వారు 90 కుటుంబాలు ఉండగా, 100నుంచి 200 గజాల్లోపు 181 కుటుంబాలు, 500 గజాలలోపు 42 కుటుంబాలు, 600 గజాలలోపు ముగ్గురు, 1000 గజాలలోపు నలుగురు ఉన్నారు. అదేవిధంగా ఓపెన్‌ ప్లాట్లు 100గజాలలోపు 78 మంది, 100 నుంచి 200 గజాల వారు 65 మంది, 200నుంచి 300గజాలు వారు 16మంది, 600 నుంచి 1000 గజాలు వారు ఒకరు ఉండగా, మరో 54 మంది తమ ప్లాట్ల వివరాలను వెల్లడించని వారు ఉన్నారు. 200 గజాలలోపు ఇళ్లు ఉన్న వారందర్నీ కూడా అధికారులు సహకరించాలని కోరుతున్నారు. అయితే 200 గజాలకు పైగా ఇళ్లు నిర్మించుకున్న కుటుంబాలు తమకు మిగతా స్థలానికి పరిహారం చెల్లించాలని కోరుతుండటంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఓపెన్‌ప్లాట్ల ఉన్నవారు కూడా మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అధికారులు మాత్రం గ్రామంలోని సమగ్ర వివరాలను సేకరించి, స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదికను పంపించేందుకు సన్నద్ధమవుతోంది.  


మొత్తం ఇళ్లను తొలగించనున్నారా? 

గ్రామంలో ప్రస్తుతం ఉన్న పక్కా ఇళ్లను మొత్తం తొలగిస్తారా? గుడిసెలు, పెంకుటిళ్లను తొలగిస్తారా? అనే సందేహం నెలకొంది. గ్రామ పునర్నిర్మాణం అంటే మొత్తం ఇళ్లను కూల్చివేసి, కొత్తగా లేఅవుట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం గ్రామంలో రెండస్థుల భవనాలతోపాటు ఆర్‌సీసీ పక్కా భవనాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా గ్రామస్థులు తమకు నచ్చిన రీతిలో నిర్మించుకున్నారు. అయితే కొత్తగా నిర్మించే ఇళ్లు ఎలా ఉంటాయో తెలియదని, తమ పక్కా భవనాలు ఉన్నందున వీటిని తొలగించొద్దని కొంతమంది అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. అయితే గ్రామంలోని ఇళ్లను మొత్తం తొలగించి లేఅవుట్‌ను ఏర్పాటు చేస్తారా? లేక పక్కా భవనాలను అలాగే ఉంచి రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైపులైన్‌, ఇతర సౌకర్యాలు కల్పిస్తారా అన్న ది స్పష్టం కావాల్సి ఉంది. మరోవైపు గ్రామంలోని ఇళ్లను తొలగించినట్లయితే, నూతనంగా ఇళ్లను నిర్మించే వరకు తామంతా ఎక్కడ నివసించాలని, తమకు పునరావాసం కల్పించాలని కోరుతున్నారు.


మోడల్‌ విలేజ్‌గా మారనుంది : పోగుల ఆంజనేయులు, సర్పంచ్‌, వాసాలమర్రి

గ్రామ పునర్నిర్మాణంతో వాసాలమర్రి ఒక మోడల్‌ విలేజ్‌గా మారనుంది. గ్రామంలో ఇళ్లులేని నిరుపేదలందరికీ 200గజాల స్థలంలో ఇళ్లు కట్టిస్తారు. నూతన హంగులతో పాఠశాల, పంచాయతీ భవనం,అంగన్‌వాడీ కేంద్రం, సబ్‌ మార్కెట్‌యార్డు, గ్రామం లో శుభకార్యాల కోసం ఫంక్షన్‌హాల్‌, క్రీడా భవనాలతోపాటు పలు నిర్మాణాలు రానున్నాయి. హెచ్‌ఎండీఏలో ఉన్న వసతులన్నీ వా సాలమర్రిలో కల్పిస్తారు. సీఎం గ్రామాన్ని దత్తత తీసుకోని అభివృద్ధి చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. 


Updated Date - 2022-05-19T06:27:56+05:30 IST