Abn logo
Nov 30 2020 @ 03:16AM

కొత్త తరాన్ని పద్యం వైపు నడిపించే ‘‘పాఠకమిత్ర’’

బేతవోలు రామబ్రహ్మం తన అధ్యాపక జీవితం, సాహిత్య సాహిత్యేతర పర్యటనల్లో భాగంగా ఎంతోమంది విద్యార్థులు, అధ్యాపకులు, ఔత్సాహికులను కలిసినప్పుడు వారి నుండి- పద్యాన్ని నేటి తరం సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వారికి అర్థం చేయించాలీ అన్నది సమస్యగా మారిందనీ, పరిష్కార మార్గం చెప్పమనీ అభ్యర్థనలు విన్నాడు. వాళ్ళు పడుతున్న ఆపసోపాలు నేరుగా చూశాడు. ఆ నేపథ్యంలోంచి, ఎంతో మథనం తర్వాత పుట్టుకొచ్చిందే ‘పాఠకమిత్ర వ్యాఖ్య’. పద్యంలోని విషయాల్ని ఒక అధ్యాపకుడిలాకాక, ఒక మిత్రుడిలా పాఠకుడి అవగాహనలోకి సులభంగా తీసుకురావాలన్నదే ఈ వ్యాఖ్యాన లక్ష్యం.


తెలుగులో పద్య సాహిత్యం చదివి అర్థం చేసు కోగల్గిన పాఠకులు తగ్గిపోతున్నారు. ఇప్పటి తరం వాళ్ళకి అసలు పద్యసాహిత్యం అర్థం చేయించే సామగ్రి అందుబాటులో లేదు. కొంతవరకు తెలుగులో వచ్చిన వ్యాఖ్యానాలు ఆ పనిచేస్తున్నా, అవి పాతబడి పోయాయ్‌. ఆ వ్యాఖ్యానం అర్థం చేసుకోవాలంటే మరో వ్యాఖ్యానం కావాలి. పద్యం, ప్రతిపదార్థం, తాత్పర్యం, వ్యాకరణ, ఛందో, అలంకారాది విశేషాలతో సుదీర్ఘంగా ఉండే గ్రాంథిక వ్యాఖ్యానాలు నేటి పాఠకుడికి మింగుడు పడడంలేదు. ఇలాంటి సమయంలో ఆధునికతరం పద్య సాహిత్యాన్ని అర్థంచేసుకుని, ఆస్వాదించేలా చేయడానికి మిత్రునిలా ముందుకొచ్చింది ‘పాఠకమిత్ర వ్యాఖ్య’ (Reader friendly Commentary). పద్య సాహిత్యం నేటి తరానికి దూరమవడానికి ఎన్నో కారణాలున్నా, వర్తమాన అవసరాలకు అనుగుణంగా వాటిని కొత్తతరా నికి అందించాల్సిన బాధ్యత సమర్థులైన తెలుగువారం దరి మీదా ఉంది. అలాంటి ప్రయత్నాల్లో సరికొత్తది పాఠకమిత్ర వ్యాఖ్య. 


బేతవోలు రామబ్రహ్మం పాఠకమిత్ర వ్యాఖ్య రూపకర్త. ఆయన కవి, సంస్కృతాంధ్రపండితుడు, అవధాని, కథకుడు, అనువాదకుడు, వ్యాఖ్యాత, అంతకుమించి అధ్యాపకుడు. ఇతర అధ్యాపకులు సైతం చెవులారా వినేలా చేయగల్గి నంత ఆకర్షణీయమైన అధ్యాపకత్వం ఆయనది. ఈ అనుభవమే పాఠకమిత్ర వ్యాఖ్య ఫలవంతం అవ్వడానికి బాగా పనికొచ్చింది. బేతవోలు రామబ్రహ్మం తన అధ్యా పక జీవితం, సాహిత్య సాహిత్యేతర పర్యటనల్లో భాగంగా ఎంతోమంది విద్యార్థులు, అధ్యాపకులు, ఔత్సాహికులను కలిసినప్పుడు వారి నుండి- పద్యాన్ని నేటి తరం సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వారికి అర్థం చేయించాలీ అన్నది సమస్యగా మారిందనీ, పరిష్కార మార్గం చెప్ప మనీ అభ్యర్థనలు విన్నాడు. వాళ్ళు పడుతున్న ఆప సోపాలు నేరుగా చూశాడు. ఆ నేపథ్యంలోంచి ఎంతో మథనం తర్వాత పుట్టుకొచ్చిందే పాఠకమిత్ర వ్యాఖ్య.


పద్య సాహిత్యం సమాజానికి పనికి రాదని, దాన్ని చదవాల్సిన అవసరం లేదని తెలుగు రాష్ర్టాల్లో హోరు గాలి వీస్తున్న రోజులవి. సాహిత్యమంటే వచన కవిత్వమే అని ఊగుతున్న రోజులవి. అస్తిత్వ చైతన్య పోరాటాల కాలమది. ఆ కాలంలో పద్యం గురించి మాట్లాడ్డమంటే సాహసం చేసినట్లే లెక్క. ఆ సాహసంతో పాటు, పద్యాన్ని ప్రజల దగ్గరికి చేర్చే మరో భగీరథ ప్రయత్నం చేసిన పద్యమూర్తి బేతవోలు రామబ్రహ్మం.


తెలుగు సాహిత్యంలోని కొన్ని ఘట్టాలకు తాత్పర్యం రాయడంతో మొదలైంది పాఠకమిత్ర వ్యాఖ్య ఆలోచన. అది ‘పద్య కవితా పరిచయం’ అనే పుస్తకంగా పాఠకుల ముందుకొచ్చింది (1997). పద్య సాహిత్యం తెలుగు పాఠకులకు దగ్గర చేయాలని బేతవోలు రామన్న మనస్సున పుట్టిన పాపాయి పద్య కవితా పరిచయం. ఇందులో విశ్వామిత్ర పాత్ర మధునాపంతుల వారిది. ఈ పుస్తకంలో పనిలో పనిగా కవుల కల్పనలు, వాటి లోని అద్భుతాలు, తర్వాతి కవుల అనుసరణలు, పోలికలు, పాఠాంతరాలు, కవి సమయాలు వాటి ఉపయోగాలు, పద్యంలోని పదప్రయోగ ఔచిత్యం, అవసరమైనచోట వ్యాకరణ విశేషాలు, పద్యానికి నేపథ్యాలు, ముందు వెనుకల అవసరమైన వివరణలు ఇలా చమత్కార సంగతులు ఎన్నో కుప్పపోసి ఉన్నాయ్‌. అసలు పద్యంలో ఏముందో తెలుసుకోలేని పాఠకుడికి ఈ వివరణలు చాలా ఆసక్తికరంగా ఉంటాయ్‌. అందు వల్ల సాధారణ పాఠకుడికి పద్య సాహిత్యం పట్ల ఆసక్తి కల్గుతుంది. అలా పుస్తక ప్రయోజనం నెరవేరింది.  


పద్య కవితా పరిచ యం రాసిన రెండు దశా బ్దుల తర్వాత బేతవోలు వారి మానస పుత్రికలా, నవజవ్వనిలా, వారి మేధ నుండి మరింత కొత్తగా దూసుకొచ్చింది ‘పాఠకమిత్ర వ్యాఖ్య’. పద్యం, అన్వయం, వ్యాఖ్య, విశేషాంశాలు-ఇదీ పాఠకమిత్ర వ్యాఖ్య నిర్మా ణం. పద్యంలోని విషయా ల్ని ఒక అధ్యాపకుడిలాకాక, ఒక మిత్రుడిలా పాఠకుడి అవగాహనలోకి సులభంగా తీసుకురావాలన్నదే ఈ వ్యాఖ్యాన లక్ష్యం. వ్యాఖ్యానాన్ని నేటి ఆధునిక వ్యావహా రికంలో ఇవ్వడం, పద్యంలోని కఠిన, కావ్య పదజాలాన్ని వ్యావహారిక పదాల మధ్యనే కుండలీకరణల్లో చూపడం ఈ వ్యాఖ్య ప్రత్యేకత. ఈ కుండలీకరణలు పానకంలో పుడకల్లా కొందరు అనుకున్నా--కావ్యభాషను పాఠకులకు దగ్గర చేస్తుంది ఈ పద్ధతి. మొదట పద్యం చదవడం, తర్వాత వ్యాఖ్యానం చదివి మళ్ళీ పద్యం చదవడం ఇదీ పాఠకమిత్ర రూపకర్త సూచించిన వ్యాఖ్యానం చదివే పద్ధతి. దీనివల్ల పాఠకుడికి వ్యాఖ్యానం చదవకముందు, దాని తర్వాత ఎలాంటి అవగా హన కల్గుతుందో స్వయంగా అంచనా వేసుకోవచ్చు.


ఈ పరంపరలో తెలుగు వాళ్ళకు మొదటగా అందిన పుస్తకం మంచెళ్ళ కృష్ణకవి వేంకట నగాధిపతిశతకం. రెండోది వర్ణనరత్నాకరం. వర్ణనరత్నాకరం ఎనిమిదివేల పైచిలుకు తెలుగు పద్యాల మూట. 1930లో నాలుగు సంపుటాలుగా పిఠాపురం నుండి దాసరి లక్ష్మణస్వామి సంకలనంగా వచ్చింది. దాన్నే 90ఏళ్ళ తర్వాత రామబ్రహ్మం గారు ఎందరో తెలుగు పండితులను చేర్చుకుని, 23 సంపు టాలుగా, పాఠకమిత్రగా తెలుగు సాహిత్యలోకంలోకి ఒలకబోశారు. ఈ సంకలనాల్ని పాఠకమిత్రతో చదివి తెలుగు సాహిత్యం చాలా భాగం చదివేశామని ఎవ రైనా బడాయికి పోవచ్చు.


చిలకమర్తి వారన్నట్లు ‘‘ఈ మహాగ్రంథ మెవ్వని యొద్దనుండునో యాతఁడు సకలాంధ్రకవులమధ్యమున గూర్చుండి వారితో ముచ్చటించినట్లే యానందపారావార మున దేలుచుండును’’. కానీ ఇది 90ఏళ్ళ క్రితం నాటిమాట. ఇప్పటివాళ్ళుకూడా అలా తెలుగు కవుల మధ్యలో కూర్చుని వాళ్ళతో మాట్లాడుతున్నట్లుండాలంటే పాఠకమిత్ర తప్పనిసరి. వర్ణన రత్నాకరం మనకిచ్చిన లక్ష్మణస్వామి ధన్యుడు. వ్యాఖ్యానంతో మనకందించిన బేతవోలు ధన్యుడు. చదివి తరించే మనం ధన్యులం.

పద్యంలోని అసలు పాఠం అన్వయానికి దూరంగా ఉన్నా, అర్థ సందిగ్ధత ఏర్పడినా వ్యాఖ్యాత కొత్త పాఠాన్ని సూచిస్తాడు. దాన్ని కుండలీకరించడం, పాఠాంతరాన్ని పేర్కొనడం తప్పనిసరి. ఇది పారదర్శకంగా ఉండడానికి, భవిష్యత్‌ తరాలకు పాఠంలాంటిది. అన్వయం కుదరని చోట తోచిన వివరణ ఇవ్వడం, సంతృప్తినివ్వకపోతే, అది సంతృప్తిగాలేదని చెప్పడం, పాఠకులే ప్రమాణం అనడం, అంతకుమించిన మంచి అన్వయాలకు స్వాగతం పల్కడం వంటి నేర్చుకోదగ్గ, మార్గదర్శకంగా ఉండే విలువలు ఎన్నో ఈ వ్యాఖ్యానంలో ఉన్న సుగుణాలు.  


పాండిత్య బలమేకాదు, రసహృదయం ఉన్నవ్యక్తి బేతవోలు రామబ్రహ్మం. ఆ రసాన్ని ఆధునిక వ్యాపహారి కంలోకి తీసుకురాగల నేర్పరి. అందుకే పాఠకమిత్ర మరింత మందికి స్ఫూర్తి. ఈ స్ఫూర్తిని అందుకుని తెలుగువాళ్ళముందుకొచ్చిన మరో పాఠకమిత్రుడు అద్దంకి శ్రీనివాస్‌. వర్ణన రత్నాకరం తర్వాత కంకటి పాపరాజు ఉత్తర రామాయణం, మాదయగారిమల్లన రాజశేఖర చరిత్రలకు బేతవోలు కలం వ్యాఖ్య అందిస్తే, కేతన విజ్ఞానేశ్వరీయము, అప్పనమంత్రి చారుచర్యలకు అద్దంకి శ్రీనివాస్‌ వ్యాఖ్య అందించాడు. ఈయన ఆ వరుసలో తర్వాత అందించబోయే కావ్యం కవికర్ణ రసాయనం. 


కవిత్రయంలోని ఎర్రనకు అన్యాయం జరిగిందనే చెప్పాలి. భారతంలో నన్నయ, తిక్కనల మధ్యలో పడి ఎర్రన కన్పించకుండా పోయాడు. ఎర్రన రాసిన హరి వంశం, నృసింహపురాణం వ్యాఖ్యానానికి నోచుకోలేదు. ఎర్రన కవితా సౌందర్యం సామాన్యులకు అందలేదు. ఆ లోపం తీర్చడానికి పాఠకమిత్ర నుండి కొంత మిన హాయించి, హరివంశాన్ని ప్రతిపద్యానికీ ప్రతిపదార్థం, తాత్పర్యంతో బేతవోలు అందిస్తున్నారు. కేవలం పూర్వ భాగం వ్యాఖ్య రెండు సంపుటాల్లో వచ్చింది. ఒక్కో సంపుటం ఐదువందల పైచిలుకు పుటలు. బేతవోలుని చూసిన సహాధ్యాయి రేమిళ్ళ వేంకట రామకృష్ణశాస్త్రి ఎర్రన మరోకావ్యం నృసింహపురాణానికి వ్యాఖ్య అందిం చాడు. వీళ్ళు ఎర్రన ఋణం కొంతవరకూ తీర్చారు. మరికొంత మనపై ఉంది. ఇవి శ్రీరాఘవేంద్ర ప్రచురణ లుగా మనముందుకొచ్చాయ్‌. 


తెలుగుపద్యాన్ని అర్థం చేసుకోవడం అటుంచితే, సరిగ్గా అర్థం చెప్పేవాళ్ళు కరువయ్యారు. అలాంటి సమ యంలో ఈ పాఠకమిత్ర చలువపందిరిలా, చలివేం దిరంలా అన్పిస్తోంది. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి, అనుభవిం చాలి, అనుకునేవాళ్లకీ; పద్య సాహిత్యం చూసి అదో పెద్దబూచిలా భయపడే వాళ్ళకీ; కనీసం పద్యం చదివి అర్థం చేసుకోకుండానే అదో అయోమయంజగత్‌ అని భావించేవాళ్ళకీ; పద్య సాహిత్యంపై స్పష్టమైన, సరైన విమర్శ చేయాలనుకునేవాళ్ళకీ భుజంతట్టి ముందుకు నడిపించే దారిదీపం ఈ పాఠకమిత్ర. 

టి. సతీశ్‌ 

93916 14443


Advertisement
Advertisement
Advertisement