నైట్‌ ల్యాండింగ్‌కు..మార్గం సుగమం

ABN , First Publish Date - 2020-07-06T10:17:23+05:30 IST

కడప ఎయిర్‌పోర్టులో రాత్రిపూట విమానాల ల్యాండింగ్‌కు మార్గం సుగమమైంది.

నైట్‌ ల్యాండింగ్‌కు..మార్గం సుగమం

అబ్‌స్టాకిల్‌ లైట్ల ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతి

ఇక ఎయిర్‌బస్‌ విమానాల రాకపోకలు


(కడప - ఆంధ్రజ్యోతి): కడప ఎయిర్‌పోర్టులో రాత్రిపూట విమానాల ల్యాండింగ్‌కు మార్గం సుగమమైంది. కొండల్లో అబ్‌స్టాకిల్‌ లైట్ల ఏర్పాటుకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో కడప ఎయిర్‌పోర్టు నుంచి దేశంలోని మెట్రోసిటీ్‌సతో పాటు విదేశాలకు విమానాల రాకపోకలకు లైన్‌ క్లియర్‌ అయింది. ఇప్పటి వరకు 72 సీట్ల కెపాసిటీ గల ఏటీఆర్‌ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అబ్‌స్టాకిల్‌ లైట్ల ఏర్పాటుతో పాటు రన్‌వే పూర్తయితే 175 సీట్ల కెపాసిటీ గల ఎయిర్‌బస్‌ నడపవచ్చు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉడాన్‌ స్కీం ద్వారా కడప నుంచి విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ట్రూజెట్‌ సర్వీసు హైదరాబాదు, చెన్నై, విజయవాడ, బెల్గాంలకు సర్వీసులను నడుపుతోంది. కోవిడ్‌ నేపధ్యంలో ప్రస్తుతం చెన్నై, హైదరాబాదు, విజయవాడకు మాత్రమే సర్వీసులు నడుస్తున్నాయి.


రన్‌వే విస్తరణ

175 సీట్ల సామర్థ్యం గల ఎయిర్‌బస్‌ విమానాల రాకపోకల కోసం రన్‌వేను విస్తరిస్తున్నారు. ప్రస్తుతం 1719 మీటర్లు ఉన్న రన్‌వేను 2500 మీటర్లకు విస్తరిస్తున్నారు. నిర్మాణ పనులు 75 శాతం పూర్తయ్యాయి. కోవిడ్‌ కారణంగా కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో పనులు నిలిచిపోయాయి. కార్మికులు తిరిగి వస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు డైరెక్టరు శివప్రసాద్‌ ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. అబ్‌స్టాకిల్‌ లైటింగ్‌తో పాటు మిగతా పనులన్నీ ఆరుమాసాల్లోపు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. 


అటవీశాఖ నుంచి లైన్‌ కి ్లయర్‌

రాత్రిపూట విమానాలు ల్యాండింగ్‌ కావాలంటే రన్‌వేకు ఎదురుగా ఉన్న కొండలపై అబ్‌స్టాకిల్‌ లైట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ కొండలు ఉన్నాయని పైలట్‌కు తెలిసే విధంగా కొండలపై సోలార్‌తో 24 గంటలు ఎర్రలైటు వెలుగులతో కూడిన టవర్లను నిర్మిస్తారు. దీంతో పైలట్‌కు కొండలు ఎక్కడున్నాయో తెలిసిపోతుంది. రన్‌వేకు ఎదురుగా నాలుగుచోట్ల అడవుల్లో లైట్‌ టవర్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది.


ఒక్కో టవర్‌ ఏర్పాటు కోసం పాయింట్‌ 01 హెక్టారు భూమి అవసరం. అలా నాలుగు చోట్ల అటవీ శాఖ భూమి ఇవ్వాల్సి ఉంది. అబ్‌స్టాకిల్‌ లైట్ల టవరు ఏర్పాటు కోసం స్థలం కేటాయిస్తూ అనుమతినివ్వాలంటూ ఎయిర్‌పోర్టు అధికారులు అటవీ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. అయితే చివరికి ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డి చొరవతో అటవీశాఖ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఎయిర్‌పోర్టు నుంచి కొండలు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అనుమతి రావడంతో టవర్స్‌ నిర్మించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు సిద్ధమవుతున్నారు.


చుట్టూ లైటింగ్‌

కొండల్లో అబ్‌స్టాకిల్‌ టవర్స్‌తో పాటు ఎయిర్‌పోర్టు ప్రహరీ చుట్టూ దాదాపు 10 కిలోమీటర్ల మేర లైటింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎయిర్‌పోర్టు పరిధిలో ఎప్రోచ్‌ లైటింగ్‌ ఏర్పాటుకు అవసరమైన 50 ఎకరాల భూమిని ఇటీవలే కేటాయించారు. అక్కడ పనులు చేపట్టాల్సి ఉంది.


ఉన్నతాధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్‌

కడప ఎయిర్‌పోర్టులో నైట్‌ ల్యాండింగ్‌కు అవసరమైన నిర్మాణ పనులు పూర్తయిన తరువాత డైరెక్టర్‌ జనరల్‌ ఏవీయేషన్‌ అధికారులు తనిఖీ చేస్తారు. రాత్రిపైట విమానాల రాకపోకలు అనుకూలంగా ఉందా లేదా అని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన తరువాత గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారు. అప్పటి నుంచి రాత్రి పూట కూడా విమానాల రాకపోకలు కొనసాగించవచ్చు. ప్రస్తుతం కడప విమానాశ్రయం 3సీ కేటగిరిలో ఉంది. రాత్రుళ్లు రాకపోకలు కొనసాగితే 4సీ కేటగిరీలోకి చేరుతుంది.

Updated Date - 2020-07-06T10:17:23+05:30 IST