ప్రాక్టికల్స్‌తో కూడిన విద్యతో ప్రగతికి బాట

ABN , First Publish Date - 2022-07-02T04:57:03+05:30 IST

ప్రాక్టికల్స్‌తో కూడిన విద్య, సరైన శిక్షణ విద్యార్థులకు వాస్తవ ప్రపంచ పరిస్థితులను అనుభవ పూర్వకంగా తెలుసుకునే వెసులుబాటును కల్పిస్తుందని ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ పేర్కొన్నారు

ప్రాక్టికల్స్‌తో కూడిన విద్యతో ప్రగతికి బాట
మాట్లాడుతున్న రాజశేఖర్‌

‘గీతం’ వర్క్‌షాప్‌ ముగింపు ఉత్సవంలో ఐఐటీ ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ 

పటాన్‌చెరు రూరల్‌, జూలై 1: ప్రాక్టికల్స్‌తో కూడిన విద్య, సరైన శిక్షణ విద్యార్థులకు వాస్తవ ప్రపంచ పరిస్థితులను అనుభవ పూర్వకంగా తెలుసుకునే వెసులుబాటును కల్పిస్తుందని ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ పేర్కొన్నారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌, మెథడ్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌’ అనే అంశంపై నిర్వహించిన మూడు రోజుల వర్క్‌షాప్‌ శుక్రవారం ముగిసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రాక్టికల్‌గా విద్యను నేర్చుకుంటే  ప్రగతికి బాటలు వేస్తుందన్నారు. అంతకు ముందు పోరస్‌ మాధ్యమంలో రవాణా, బహుళ దశ ప్రవాహ నమూనాలు అనే అంశాలపై ఆయన కీలకోపన్యాసం చేశారు. తొలుత గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ ఎం. రెజా సదస్యులందరినీ స్వాగతించి  ఫూయిడ్స్‌ రంగంపై వారికున్న ఆసక్తిని ప్రశంసించారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ దత్తాత్రి కేఎన్‌ ఈ మూడు రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారందరికీ ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమ ముగింపు సందర్భంగా వర్క్‌షాప్‌ నిర్వహించడానికి తగిన అనుమతులు మంజూరు చేసిన గీతం యాజమాన్యానికి కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.ఎం.ప్రసాద్‌ కృతజ్ఞతలు తెలిపారు.  కార్యశాలను విజయవంతంగా నిర్వహించిన గణిత శాస్త్ర అధ్యాపకులు డాక్టర్‌ వంశీ కృష్ణ నార్ల, డాక్టర్‌ జె.విజయశేఖర్‌ను ఆయన అభినందించారు. ఈ మూడు రోజుల వర్క్‌షా్‌పలో దేశవ్యాప్తంగా సుమారు 50 మంది ప్రతినిధులు పాల్గొనగా, వారిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు.  సౌదీ అరేబియాకు చెందిన అబ్దుల్‌ రహీం, సూడాన్‌కు చెందిన ఫక్రుద్దీన్‌ కూడా ఇందులో పాల్గొన్నారు. గీతం పరిశోధక విద్యార్థులు దాదాపు 20 మంది ఈ కార్యశాలలో పాల్గొని తమ ప్రతిభకు మెరుగులద్దుకున్నారు. 

Updated Date - 2022-07-02T04:57:03+05:30 IST