ఆత్మవిశ్వాసానికి పేటెంట్‌

ABN , First Publish Date - 2022-05-25T07:42:14+05:30 IST

చిన్ననాటి అభిరుచే ఆలంబనగా... ఆదర్శ రైతుగా మారి... ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు కాదంబినీ బెహరా.

ఆత్మవిశ్వాసానికి పేటెంట్‌

‘ప్రయోగాలు లేకపోతే పురోగతి ఉండదు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో నిరంతరం ప్రయోగాలు జరగాల్సిందే’ అనేది కాదంబినీ బెహరా నిశ్చితాభిప్రాయం. ఒడిశాలోని రెధువా గ్రామానికి చెందిన ఈ మహిళా రైతు ఒక కొత్త వరి వంగడానికి పేటెంట్‌ సాధించి... సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు.


చిన్ననాటి అభిరుచే ఆలంబనగా... ఆదర్శ రైతుగా మారి... ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు కాదంబినీ బెహరా. చదువు, మొక్కల పెంపకం... బాల్యం నుంచి కాదంబినికి ఈ రెండే ప్రధాన వ్యాపకాలు. సాధారణ కుటుంబానికి చెందిన ఆమె తన కుటుంబ సభ్యులను ఒప్పించి... డిగ్రీ వరకూ చదివారు. వెంటనే వివాహం జరగడంతో... పాతికేళ్ళ కిందట రఘునాథ్‌పూర్‌లోని అత్తవారింటికి వచ్చారు. అక్కడ కూడా మొక్కల పెంపకాన్ని ఆమె మరచిపోలేదు. 


రెండు దశాబ్దాల కృషి...

ప్రయోగాలు చెయ్యాలనే ఆమె తపన... ఆ రెండు రకాలనూ క్రాసింగ్‌ చేసి ఒక కొత్త వంగడాన్ని తయారు చెయ్యడానికి ప్రేరణనిచ్చింది. ఈ రకానికి ‘లాల్‌ బన్సా ధన్‌’ అని ఆమె పేరు పెట్టారు. ‘‘ఇది కరువు, నీటి ముంపు పరిస్థితులను తట్టుకోగలదు. ఎక్కువ దిగుబడి కూడా ఇస్తుంది’’ అని చెబుతున్నారు కాదంబిని. ఈ వంగడాన్ని రిజిస్టర్‌ చెయ్యడం కోసం ‘ప్లాంట్‌ వెరైటీస్‌ రిజిస్ట్రీ’కి నమూనాను ఆమె పంపించారు. ఈ ఏడాది మార్చిలో ఈ వరి రకం ఆమె పేరిట రిజిస్టర్‌ అయింది. ‘‘నాలుగు నుంచి నాలుగున్నర నెలలలోపు ఈ పంట చేతికి అందుతుంది. ఇది దేశవాళీ వరి రకం. రుచి, సువాసన బాగుంటాయి. దీన్ని రబీ, ఖరీఫ్‌ సీజన్లు రెండిటిలోనూ పండించవచ్చు’’ అని కాదంబిని వివరించారు. తన పేరిట రిజిస్టర్‌ కావడం వల్ల... ఈ రకాన్ని సాగుచేసే, విక్రయించే, ఎగుమతి చేసే హక్కులన్నీ ఆమెకే ప్రత్యేకంగా ఉంటాయి. ‘‘దాదాపు రెండు దశాబ్దాల కృషి ఫలితం ఇది. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో చేస్తాను. తలపెట్టిన పనిని పూర్తయ్యేదాకా వదిలిపెట్టను. ‘లాల్‌ బన్సా ధన్‌’ పేటెంట్‌ నా పేరిట రిజిస్టర్‌ కావడం సంతోషంగా ఉంది. మరిన్ని ప్రయోగాలకు ఇది నాకు స్ఫూర్తినిస్తుంది’’ అంటున్నారు కాదంబిని. యువత పల్లెలు వదలి... పొట్టకూటి కోసం నగరాలకు వెళ్ళకుండా, స్థానికంగానే ఉపాధి మార్గాలను చూపించాల్సి ఉందని, దీనికి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయడమే మార్గమనీ ఆమె విశ్వాసం. తన కుమారులిద్దరూ వ్యవసాయ రంగంలోనే కొనసాగాలన్నది ఆమె అభిలాష. దానికి అనుగుణంగా... వాళ్ళు ఓయుఎటిలో అగ్రికల్చర్‌ సైన్స్‌ చదువుతున్నారు. ‘‘ప్రస్తుతం నా దృష్టంతా కొత్త వరి రకాల సాగులో స్థానిక స్వయంసహాయక మహిళలకు సాయం అందించడం మీదే కేంద్రీకరిస్తున్నాను. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది, స్వావలంబన సాధిస్తే... గ్రామాలకు పూర్వవైభవం వస్తుంది’’ అంటున్నారు కాదంబిని.


చదువే మేలు చేసింది...

రఘునాథ్‌పూర్‌ ప్రాంతంలో వరి సాగు ఎక్కువగా జరుగుతుంది. ఒకసారి ఆసక్తితో పొలానికి వెళ్ళిన కాదంబినిని వ్యవసాయం ఆకర్షించింది. తమ కుటుంబానికి చెందిన భూమిలో వరి పండించడం మొదలుపెట్టారు. క్రమంగా ఆమె దృష్టి కొత్త వంగడాల మీద పడింది. రెదువాలో రైతులకు సహాయసహకారాలు అందిస్తున్న గోరఖ్‌నాథ్‌ కృషక్‌ మహాసం్‌ఘలో చేరారు. అత్యుత్తమ నాణ్యమైన వరి విత్తనాలను తయారు చేసి, రైతులకు అందజేసే ఆ సంఘం కార్యక్రమాల్లో కాదంబిని చురుగ్గా పాల్గొనేవారు. ‘‘డిగ్రీ వరకూ చదువుకోవడం కూడా నాకు ఎంతో మేలు చేసింది. అనుభవజ్ఞులైన రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు చెప్పే విషయాలను సులువుగానే అర్థం చేసుకోగలిగేదాన్ని. వాటిని రైతులకు అర్థమయ్యేలా వివరించేదాన్ని. క్రమంగా ‘నేషనల్‌ రైస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌’ (ఎన్‌ఆర్‌ఆర్‌ఐ), ‘ఒడిశా యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ’ (ఓయుఎటి)లకు చెందిన శాస్త్రవేత్తలు పరిచయమయ్యారు. వరి వంగడాల బ్రీడింగ్‌, విత్తనాల ఉత్పత్తి గురించి వారి ద్వారా చాలా తెలుసుకోగలిగాను’’ అని చెప్పారు కాదంబిని. ఆమె దృష్టి పరిమళ బియ్యం మీద పడింది. శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో గత పదిహేనేళ్ళుగా ఎన్‌ఆర్‌ఆర్‌ఐ ధ్రువీకరణ పొందిన కేతకిజుహా, దేశీయమైన కుద్రత్‌-3 అనే రెండు రకాల పరిమళ వరి రకాలను తన పొలంలో ఆమె పండిస్తూ వచ్చారు. ‘‘మా ప్రాంతంలోని రైతులందరూ సంప్రదాయిక రకాలనే పండిస్తారు. వారిని కొత్త రకాల సాగుకు ప్రోత్సహించడానికి వీలైనంత కృషి చేస్తున్నాను’’ అని చెబుతున్న కాదంబిని... ‘ఒడిశా లైవ్లీహుడ్‌ మిషన్‌’కు రెధువా పంచాయతీ స్థాయిలో కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2022-05-25T07:42:14+05:30 IST