కాంగ్రెస్ ఈవెంట్‌లో ఇందిర పక్కనే పటేల్ ఫోటో

ABN , First Publish Date - 2021-11-24T18:55:49+05:30 IST

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ శివకుమార్ గత అక్టోబర్ 31న బెంగళూరు పార్టీ కార్యాలయంలో..

కాంగ్రెస్ ఈవెంట్‌లో ఇందిర పక్కనే పటేల్ ఫోటో

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ శివకుమార్ గత అక్టోబర్ 31న బెంగళూరు పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్దంతి కార్యక్రమాన్ని నిర్వహించినప్పటి ఆసక్తికరమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆక్టోబర్ 31వ తేదీ దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కూడా. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమయస్ఫూర్తితో వ్యవహరించి కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు నచ్చచెప్పడంతో ఇందిరాగాంధీ చిత్తరువు పక్కనే పటేల్ ఫోటో కూడా పెట్టారు.


కాంగ్రెస్ కుటుంబం పటేల్‌ను దూరంగా పెడుతూ వచ్చిందని బీజేపీ ఎప్పట్నించో ఆరోపిస్తూ వస్తోంది. అయితే, ఇందిరాగాంధీ వర్దంతి రోజున ఆమె ఫోటోను ఉంచడమే కాంగ్రెస్‌ పార్టీ ఆనవాయితీగా పాటిస్తోంది. సిద్ధరామయ్య ఈసారి బీజేపీ నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడ్డారు. శివకుమార్‌ను పటేల్ ఫోటో కూడా పెట్టమంటూ సూచించడంతో వారి మధ్య ఆసక్తికరమైన సంభాషణ సాగింది. ఇందిరాగాంధీ వర్దంతి రోజున ఎప్పుడూ పటేల్ ఫోటో పెట్టలేదంటూ శివకుమార్ ప్రత్యుత్తరం ఇచ్చారట. కొద్దిసేపు ఇద్దరి మధ్యా సంభాషణ తర్వాత కాంగ్రెస్ కార్యాలయం ఉద్యోగిని శివకుమార్ పిలిచి, సర్దార్ పటేల్ ఫోటో తెమ్మని ఆదేశించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఫోటో పక్కనే పటేల్ ఫోటో ఉంచి కార్యక్రమం కొనసాగించారు. ఇందుకు సంబంధించిన విడియోను బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో దానిపై ఆసక్తికరమైన చర్య జరుగుతూ వైరల్ అవుతోంది.

Updated Date - 2021-11-24T18:55:49+05:30 IST