తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.59 కోట్లు

ABN , First Publish Date - 2021-01-23T05:30:00+05:30 IST

పటాన్‌చెరు నియోజకవర్గం జీహెచ్‌ఎంసీ పరిధి భారతీనగర్‌ 111 డివిజన్‌లో నెలకొన్న

తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.59 కోట్లు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరిష్‌రావు

 భెల్‌ మాజీ కార్మికులకు రేషన్‌కార్డులు, పింఛన్లు

 ఇక్రిశాట్‌ ఫెన్సింగ్‌ ఏరియా పేదలకు ఇళ్ల పట్టాలు

 సమీక్షా సమావేంలో మంత్రి హరీష్‌రావు


రామచంద్రాపురం, జనవరి 23(ఆంధ్రజ్యోతి): పటాన్‌చెరు నియోజకవర్గం జీహెచ్‌ఎంసీ పరిధి భారతీనగర్‌ 111 డివిజన్‌లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలకు మంత్రి హరిష్‌రావు పరిష్కారం చూపారు. శనివారం స్థానిక కార్పొరేటర్‌ వి.సింధూఆదర్శరెడ్డి అధ్యక్షతన మంత్రి హరిష్‌రావు జిల్లా కలెక్టర్‌ వి.హనుమంత్‌రావు, పలు శాఖల ఉన్నతాధికారులు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరికెపుడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డిలతో కలిసి హెచ్‌ఐజీలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.


హెచ్‌ఐజీ, మాక్‌సొసైటీ, బీడీఎల్‌ కాలనీల్లో.. 

హెచ్‌ఐజీ, మాక్‌సొసైటీ, బీడీఎల్‌ కాలనీల్లో సరిపడా తాగునీటి సరఫరా కోసం ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణం కోసం రూ.59 కోట్లను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. భెల్‌ కార్మికుల కాలనీలను గేటెడ్‌ కమ్యూనిటీగా గుర్తించరాదని హెచ్‌ఎండబ్ల్యూఎ్‌స ఉన్నతాధికారులు చక్రవర్తి, కృష్ణ, ప్రవీణ్‌లకు సూచించారు. గేటెడ్‌ కమ్యూనిటీలుగా చూడడం వల్లే నీటి సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. 


ఎంఎంటీఎస్‌ నిర్వాసితులకు ఇళ్లు... ఇళ్ల పట్టాలు

ఎంఎంటీఎస్‌ నిర్మాణంలో ఇళ్లను కోల్పోయిన ఇక్రిశాట్‌ ఫెన్సింగ్‌ ఏరియా పేదలకు జూన్‌ వరకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హరిష్‌ రావు తెలిపారు. 


రేషన్‌కార్డులు, ఆసరా పింఛన్లు

బీహెచ్‌ఈఎల్‌ పరిశ్రమలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు పక్కా భవనం ఉన్నప్పటికీ రేషన్‌ కార్డు, పింఛన్లు మంజూరు చేయాలని మంత్రి కలెక్టర్‌ హనుమంత్‌రావు, జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌ సమక్షంలో అధికారులకు సూచించారు. బీడీఎల్‌, మాక్‌ సొసైటీ కాలనీల ఫైనల్‌ లే అవుట్‌ జారీ చేపట్టాలని హెచ్‌ఎండీఏ అధికారులు యాదగిరి, తులసీరాంలను మంత్రి ఆదేశించారు. 


సబ్‌స్టేషన్‌ ఏర్పాటు... ఎంఎంటీఎస్‌ రైళ్ల పెంపునకు..

ఈఎ్‌సఐ ఆస్పత్రి ఆవరణలో సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు స్థల సేకరణ విషయమై.. ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకల పెంపునకు ఎంపీతో కలిసి ఢిల్లీ వెళ్లి సాధించుకురావాలని కార్పొరేటర్‌ సింధూఆదర్శరెడ్డికి మంత్రి సూచించారు. 


నియోజక వర్గానికి 3500 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు

పటాన్‌చెరు నియోజకవర్గానికి మొత్తం 3500 ఇళ్లు మంజూరు ఉండవచ్చని డబుల్‌ బెడ్‌ రూం అధికారి సురేష్‌ తెలిపారు. నియోజకవర్గంలో కొల్లూరు, ఈదులనాగులపల్లిలోనే డబుల్‌ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయిందన్నారు. మంచినీటి వసతి కల్పిస్తే పనులు పూర్తి అయినట్టేనన్నారు. 



Updated Date - 2021-01-23T05:30:00+05:30 IST