పాటల వెన్నెల

ABN , First Publish Date - 2022-01-05T07:49:28+05:30 IST

వెన్నెలకంటి సినీ పాటల, మాటల రచయితే కాదు. అంతకంటే గొప్ప సాహిత్యాన్ని మనకి వదలి వెళ్ళిపోయాడు. ఆయన ఏ అంశం సృజించినా అక్షరగతంగా భావగతంగా, గొప్ప సౌందర్య భావంతో, అనుభూతితో నిండి ఉంటాయి...

పాటల వెన్నెల

వెన్నెలకంటి సినీ పాటల, మాటల రచయితే కాదు. అంతకంటే గొప్ప సాహిత్యాన్ని మనకి వదలి వెళ్ళిపోయాడు. ఆయన ఏ అంశం సృజించినా అక్షరగతంగా భావగతంగా, గొప్ప సౌందర్య భావంతో, అనుభూతితో నిండి ఉంటాయి. పదకొండేళ్ళకే ఆ తరం వారందరి మాదిరే ముందు పద్యాలు రాశాడు. ‘ఉషోదయం ఆపలేవు’ ఆయన తొలి కవితా సంపుటి. 1979 నాటిది. ‘లహరి’ ఆయనకు పేరు తెచ్చిపెట్టిన కావ్యం. ‘వెన్నెల జల్లు’ మరో చక్కటి కావ్యం. వెన్నెలకంటి తన సినీ రజతోత్సవ సభలో ‘వెన్నెలజల్లు’ గ్రంథాన్ని గాయకుడు యస్‌.పి.బాలసుబ్రహ్మణ్యానికి అంకితం ఇచ్చిన స్నేహశీలి. ఆయన తేటగీతిలో రామాయణం ప్రారంభించి దాన్ని పూర్తి చేయకుండానే వెళ్ళిపోవడం ఒక బాధాకర విషయం. నెల్లూరువాళ్ళకి వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్‌గా పరిచయమయినా లోకానికి మాత్రం అప్పుడూ ఎప్పుడూ వెన్నెలకంటిగానే సువర్ణాక్షరాలతో మిగిలిపోయాడు.


‘ఎద ఎదలో విషపు ముల్లు, పెదవులపై పూలజల్లు, ఎదుటివాణ్ణి కాజేసే ఎత్తుగడలే రేబవళ్ళు’ అంటూ 1979లోనే సామాజిక స్పర్శతో ఆనాటి స్థితిగతులకి అద్దంపడుతూ కవిత్వం వెలువరించాడు వెన్నెలకంటి. అందరి భావకవులకి మాదిరే వెన్నెలకంటి కావ్యనాయిక ‘లహరి’. ‘లహరి’ని పన్నెండు విధాలుగా వర్ణించిన తీరు ఆయనలోని కవితాశక్తికి నిలువెత్తు నిదర్శనం. ‘ఏటి గట్టున లహరి ఎదురు చూస్తావుంటే, ఎదురుచూసిన చూపు వెన్నెలై పోతుంటే, వెన్నెలే తన ముందు చిన్నబోతావుంటే, చిన్నబోయిన సిగ్గు చిటికెలేస్తా వుంటే, ఎట్టాగ ఆపేది నా గుండెని, చలి మాపు చెలి కళ్ళ నీరెండని’ అంటూ ‘లహరి’ని మనకు పరిచయం చేస్తాడు వెన్నెలకంటి.


‘చిరునవ్వుల వరమిస్తావా చితి నుంచి లేచొస్తాను, మరుజన్మకు కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తానని’ ఒట్టు పెట్టుకున్న వెన్నెలకంటి ‘లహరి’ నాయికను పన్నెండు విధాలుగా మన ముందు పరిచి అద్భుతరీతిన వర్ణించాడు. శృంగార లహరి, భాషా లహరి, సంఖ్యా లహరి, సంగీత లహరి, నాట్య లహరి, శిల్ప లహరి, సౌందర్య లహరి, అనురాగ లహరి... ఇలా లహరిని వర్ణిస్తాడు. ప్రతి ముక్తకాన్ని చక్కని భావగీతికలుగా మలచి తీర్చిదిద్దిన అద్భుత భావుకుడు వెన్నెలకంటి.


‘లహరి’ కావ్యంలో కథ లేదుగాని, కావ్య నాయికను అద్భుత అపురూప సౌందర్యవతిగా సాక్షాత్కరింపచేస్తాడు వెన్నెలకంటి. ఋతులహరిలో ఋతువులతో పోలిక తెస్తాడు. భావ లహరిలో భావ తీక్షణతతో అలంకార శాస్త్రంపై తనకున్న పట్టును ప్రదర్శించి మనల్ని తన్మయులని చేస్తాడు. ‘మొనదేలిన సోకు మొగలి రేకౌతుంటే’ అంటూ ప్రారంభించి, ‘నిలువునా నను దోచి నిలువనీయకపోతే’ అంటూ కవి మనసున దోచిన చిత్రాన్ని బయటపెడ్తాడు. నండూరి సుబ్బారావు ఎంకితోనూ, పోటీకి తెస్తాడు. ‘సినారె కవితకే సిగబంతియనిపించు/ లకుమ నాట్యమ్ముతో లావణ్య మొకవంక/ నాగభైరవ కావ్య రమణి రంగాజమ్మ/ లలిత కవితల్లోని లాస్యమ్ము ఒక వంక/ ఆరుద్ర కావ్యాల అనుప్రాస ఒక వంక/ శేషేంద్ర పద్యాల శేముషీ ఒక వంక/ కలబోసినా చెలియ కదలి వస్తూ వుంటే/ కడకు నాకూ కాస్త కవిత పుడుతూ వుంటే...’ ఇలా లహరి కావ్యంలో తన గురువులనూ గుర్తుకు తెచ్చుకుంటాడు. వారి కావ్య నాయికల తీరుతో కడకు నాకూ కాస్త కవిత పుడుతూ వుంటే అంటూ నెల్లూరు నెరజాణలని మన ఊహాలోకంలోకి తీసుకొచ్చి కవిగా వెన్నెలకంటి తన ఊహాశబలత విన్యాసాన్ని మనకు చూపిస్తాడు. ఆమె (లహరి) చిరునవ్వు జల్లులో చిలుకు ముత్యపు చినుకు పెదవిపైనా రాలి పగడమైపోయిందని ఉపమాలంకారాన్ని గొప్పగా ఉపయోగిస్తూ సౌందర్య వర్ణన చేస్తాడు. సత్యభామకు కూడా అలక నేర్పెడిదాన అంటూ అలుకకు నిర్వచనమే అయిన సత్యభామకు అలుకనేర్పించడం అంటూ గొప్ప ప్రతీకతో పరాకాష్ఠగా అన్వయిస్తాడు. ప్రణయానికే లహరి ప్రత్యామ్నాయమంటాడు. ఆమె కోసం ఆక్రోశిస్తాడు, తపిస్తాడు, విరహం, వియోగం అనుభవిస్తాడు.


వెన్నెలకంటి ‘వెన్నెల జల్లు’ పుస్తకం భావగీతికలకి నిండు కాణాచి. వేటూరి సుందరామ్మూర్తి, సిరివెన్నెల వంటి ఉద్దండ సినీ రచయితల చేత మెచ్చుకోబడ్డ కావ్యం. ‘‘రసానుభూతిని నింపిన కవన ఖచిత సువర్ణ పాత్ర ఇది’’ అని సిరివెన్నెల ఈ కావ్యాన్ని ప్రశంసించారు. వెన్నెలకంటి సాహిత్యమంతా తనదైన స్నేహముద్రతో మనదైపోతుంది. ఆయన తేటగీతి పద్యాలతో ప్రారంభించిన రామాయణం అసంపూర్ణంగా మిగిలిపోవడం మన దురదృష్టం. తేటగీతి పద్యాలతో పూర్తిగా రామాయణం రచించిన ఖ్యాతి వెన్నెలకంటికే దక్కేది. కిష్కంధకాండ వరకూ రామాయణం ఆయన రాయగలిగారు.


‘మాటరాని మౌనమిది’ అన్న వెన్నెలకంటి పాట మనకు మౌన శోకాన్ని మిగిల్చింది. రెండువేలకు పైగా సినిమా పాటలు రాసిన ఘనత ఆయనది. 1979లో స్టేట్‌బ్యాంక్‌లో చంద్రగిరిలో ఉద్యోగం చేసేవాడు. 1986లో ‘శ్రీరామచంద్రుడు’ చిత్రంలో తొలి గీతంతో సినిమా ప్రస్థానం మొదలుపెట్టాడు. మంచి నటుడు కూడా. కీ.శే. డా. నాగభైరవ కోటేశ్వరరావుచే రూపొందిన ‘కవనవిజయం’లో అభ్యుదయ కవిగా రెండు వందల ప్రదర్శనల్లో నటించాడు. ‘పోతురాజు’లో ఖైదీ వేషం వేశాడు. అతని పిల్లలు శశాంక్‌ మౌళి, రాకేందు మౌళి కూడా తండ్రి వారసత్వాన్ని సినీరంగంలో కొనసాగిస్తున్నారు. తన 63వ యేట గుండెపోటుతో ఈ లోకం నుంచి శలవు తీసుకున్నాడు వెన్నెలకంటి.

చిన్ని నారాయణరావు

(నేడు వెన్నెలకంటి ప్రథమ వర్ధంతి)

Updated Date - 2022-01-05T07:49:28+05:30 IST