సౌదీ, కువైట్ దేశాలకు వెళ్లేవారికి శుభవార్త!

ABN , First Publish Date - 2022-08-28T22:03:31+05:30 IST

కువైట్ దేశానికి ఉద్యోగానికి వెళ్లేవారు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పిసిసి - PCC) దాఖలు చేయాలన్న నిబంధన ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది.

సౌదీ, కువైట్ దేశాలకు వెళ్లేవారికి శుభవార్త!

కరీంనగర్, నిజామాబాద్ పాస్‌పోర్టు కేంద్రాల్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు పొందవచ్చు 

కువైట్ దేశానికి ఉద్యోగానికి వెళ్లేవారు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పిసిసి - PCC) దాఖలు చేయాలన్న నిబంధన ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. సౌదీ అరేబియాకు వెళ్లేవారు కూడా పీసీసీ తప్పనిసరిగా దాఖలు చేయాలని ఇటీవల సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. విదేశాంగ శాఖ ఉన్నతాధికారి డా . ఔసాఫ్ సయీద్ ఇటీవల హైదరాబాద్‌‌ను సందర్శించిన సందర్భంగా పిసిసి పొందడంలో ఎదురవుతున్న సమస్యలను పలువురు ఆయన దృష్టికి తీసికెళ్ళారు. వెంటనే స్పందించి ఆయన పిసిసి పొందడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 


హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని మొత్తం ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు టోలీ చౌకీ, బేగంపేట, అమీర్ పేట, నిజామాబాద్, కరీంనగర్‌లలో అపాయింట్‌మెంట్ లేకుండానే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ల కోసం వాక్-ఇన్ దరఖాస్తులను ప్రత్యేకంగా ప్రాసెస్ చేయడానికి శనివారాల్లో ప్రత్యేక కౌంటర్లు పని చేసేలా డా. ఔసాఫ్ సయీద్ ఏర్పాట్లు చేశారు. కాగా.. ఈ సమస్యపై డా. ఔసాఫ్ వేగంగా స్పందించి పరిష్కారం చూపడంతో గల్ఫ్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన డా. ఔసాఫ్ సయీద్‌కు గల్ఫ్ కార్మికుల పక్షాన టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి కృతఙ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. డా. ఔసాఫ్ సయీద్‌.. మే 1993 నుండి 1995 వరకు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్‌గా పని చేశారు. సౌదీ అరేబియాలోని జిద్దాలో ఇండియన్ కాన్సుల్ జనరల్‌గా, రియాద్‌లో ఇండియన్ అంబాసిడర్‌గా పనిచేశారు.

Updated Date - 2022-08-28T22:03:31+05:30 IST