Passport: విదేశాలకు వెళ్లేవారికి తీపి కబురు.. ఇకపై ఆ రోజుల్లో కూడా..

ABN , First Publish Date - 2022-08-28T15:52:34+05:30 IST

ఉన్నత విద్య, ఉపాధి, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వారికి తీపి కబురు. ఇకపై శనివారాల్లో కూడా పాస్‌పోర్టు కేంద్రాలు తెరిచే ఉండనున్నాయి.

Passport: విదేశాలకు వెళ్లేవారికి తీపి కబురు.. ఇకపై ఆ రోజుల్లో కూడా..

హైదరాబాద్: ఉన్నత విద్య, ఉపాధి, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వారికి తీపి కబురు. ఇకపై శనివారాల్లో కూడా పాస్‌పోర్టు కేంద్రాలు తెరిచే ఉండనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య శనివారం వెల్లడించారు. ప్రస్తుతం వారంలో 5రోజులు మాత్రమే పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పనిచేస్తుండడంతో విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్న వందలాది మంది ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి వారి దరఖాస్తులను పరిష్కరించేందుకు మూడు వారాల సమయం పడుతోంది. ఈ సమస్యను ఇటీవల ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని సందర్శించిన వీసా, పాస్‌పోర్టు విదేశీ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎ. సయీద్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో విదేశాలకు వెళ్లే వారి సౌకర్యార్థం శనివారం కూడా పాస్‌పోర్టు సేవా కేంద్రాలు కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు బాలయ్య తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని టోలీచౌకీ, బేగంపేట, అమీర్‌పేటలతో పాటు నిజామాబాద్, కరీంనగర్‌లోని పాస్‌పోర్టు కేంద్రాలు కూడా ప్రతి శనివారం పనిచేస్తాయని చెప్పారు.  

Updated Date - 2022-08-28T15:52:34+05:30 IST