Abn logo
Sep 22 2021 @ 00:36AM

కంప్యూటర్‌ సైన్స్‌పైనే మక్కువ

- విద్యార్థుల రెండో ఆప్షన్‌ ఈసీఈ

- తొలి విడత ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు పూర్తి

- 23 వరకు రిపోర్టు చేసేందుకు గడువు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) 

కంప్యూటర్‌ సైన్స్‌  కోర్సుపై ఇంజనీరింగ్‌ విద్యార్థులు మక్కువ చూపించారు. కాలేజీ, ఫ్యాకల్టీతో సంబంధం  లేకుండా కంప్యూటర్‌ సైన్స్‌ సీటు దొరికితే చాలు అన్న విధంగా దరఖాస్తులు చేసుకున్నారు. రెండో ఆప్షన్‌గా విద్యార్థులు ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌పై ఆసక్తి ప్రదర్శించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్‌ విభాగంలో సివిల్‌ ఇంజనీర్ల అవసరాలు ఉన్నా విద్యార్థులెవరు ఆ కోర్సుపై ఆసక్తి ప్రదర్శించలేదు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు ఆశించినంతగా లేకపోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. తొలి విడతలో కన్వీనర్‌ కోటా కింద ఇంజనీరింగ్‌ సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేసేందుకు ఈ నెల 23 చివరి తేదీగా ప్రకటించారు. మొదటి విడతలో సీట్లు పొందినవారు నిర్ధేశిత ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌మిట్టల్‌ సూచించారు. 

68 శాతం సీట్ల కేటాయింపు పూర్తి

ఉమ్మడి జిల్లాలో తొలివిడతలో 68 శాతం సీట్ల కేటాయింపు జరిగింది. 10 ప్రైవేట్‌, మూడు ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కలుపుకుని కన్వీనర్‌ కోటాలో 4,253 సీట్లు ఉండగా ఇందులో తొలి విడతలో 2,885 సీట్లను భర్తీ చేశారు. సీఎస్‌సీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌, సీఎస్‌ఎం, సివిల్‌, ఐటీ, మైనింగ్‌, సీఎస్‌ఐ, సీఎస్‌వో, టెక్స్‌టైల్స్‌ ఇంజనీరింగ్‌, సీఎస్‌జీ కోర్సులు ఉన్నాయి. విద్యార్థులందరూ సీఎస్‌సీ, ఈసీఈలకు ప్రథమ, ద్వితీయ ప్రాధాన్యమిచ్చారు. ఆ తర్వాత సీఎస్‌ఎం, ఈఈఈ కోర్సులపై మక్కువ చూపించారు. ఐదో ఆప్షన్‌గా మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఆ తర్వాత సివిల్‌ ఇంజనీరింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 

- జిల్లాలోని ప్రైవేట్‌, ప్రభుత్వ కళాశాలల్లో 994 సీఎస్‌సీ సీట్లు ఉండగా 966 సీట్లను, 881 ఈసీఈ సీట్లకుగాను 657, 807 ఈఈఈ సీట్లకు గాను 331, 482 మెకానికల్‌ సీట్లకు గాను 216 సీట్లను విద్యార్థులకు కేటాయించారు.

- సివిల్‌ ఇంజనీరింగ్‌లో 411 సీట్లు ఉండగా 176 సీట్లను, సీఎస్‌ఎంలో 440 సీట్లు ఉండగా 357 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. 66 ఐటీ సీట్లు ఉండగా అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. 

- మైనింగ్‌ ఇంజనీరింగ్‌లో 34 సీట్లు ఉండగా 31, సీఎస్‌ఈలో 47 సీట్లు ఉండగా 21, సీఎస్‌వోలో 23 సీట్లు ఉండగా 22, సీఎస్‌జీలో 46 సీట్లు ఉండగా 42, టెక్స్‌టైల్స్‌ ఇంజనీరింగ్‌లో 20 సీట్లకు తొలి విడతలోనే కేటాయింపులు చేశారు. 

- జిల్లాలోని 13 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 3,659 కన్వీనర్‌ కోటా సీట్లు ఉండగా ఈబీసీ సీట్లు జేఎన్‌టీయూ సీట్ల సర్దుబాటుతో కలుపుకొని 594 సీట్లు పెరిగి మొత్తం ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్య 4,253కు చేరుకున్నది. 

- ఉమ్మడి జిల్లా పరిధిలోని జగిత్యాల జేఎన్‌టీయూ కళాశాలలో 333 సీట్లకుగాను 327, సిరిసిల్ల జేఎన్‌టీయూలో 356 సీట్లకు 337, మంథని జేఎన్‌టీయూలో 367 సీట్లకుగాను 350 సీట్లను తొలివిడతలోనే విద్యార్థులకు కేటాయించారు. 

- కరీంనగర్‌ శ్రీచైతన్యలో 653 సీట్లు ఉండగా 559, జ్యోతిష్మతి కళాశాలలో 467 సీట్లు ఉండగా 304, వాగేశ్వరి ఇంజనీరింగ్‌ కళాశాలలో 513 సీట్లు ఉండగా 302, హుజూరాబాద్‌ కిట్స్‌లో 420 సీట్లు ఉండగా 243 సీట్లను, పెద్దపల్లి మదర్‌ థెరిస్సా కళాశాలలో 280 సీట్లు ఉండగా 147, వివేకానంద కళాశాలలో 280 సీట్లు ఉండగా 128, కరీంనగర్‌ ట్రినిటి ఇంజనీరింగ్‌ కళాశాలలో 187 సీట్లకుగాను 181, పెద్దపల్లి ట్రినిటీ కళాశాల్లో 187 సీట్లకు 62, కరీంనగర్‌ నిగమ కళాశాలలో 210 సీట్లకుగాను 45 సీట్లను విద్యార్థులను కేటాయించారు. 

- మొత్తం ప్రైవేట్‌ కళాశాలల్లో 3,197 సీట్లకుగాను 1,871 సీట్లు మొదటి విడతలో కేటాయించారు. ఈ సీట్లు పొందిన విద్యార్థులందరూ ఈ నెల 23వ తేదీలోగా ఆయా కళాశాలలకు ఫీజు చెల్లించి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. కన్వీనర్‌ కోటాలో సీట్లు పొందిన వారికి ఫీజు రీ యింబర్స్‌మెంట్‌ ఉంటుంది.  మొత్తం ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌ ఫీజును పొందాల్సి ఉంటుంది.