Abn logo
Sep 23 2021 @ 00:42AM

ప్రయాణికుల భద్రతే ముఖ్యం

అమలాపురం డిపో ఆవరణలో మొక్క నాటి నీరు పోస్తున్న ద్వారకా తిరుమలరావు

ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు అంకితభావంతో పని చేయాలి 

 ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారకా తిరుమలరావు

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 22: సంస్థ అభివృద్ధికి కార్మికులంతా అంకితభావంతో పనిచేయాలని, ప్రమాదాలు జరగకుండా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా               పనిచేయాలని ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు కోరారు. బుధవారం రాత్రి ఆయన రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ముందుగా ఆర్టీసీ డిస్పెన్సరీని పరిశీలించారు. అనంతరం గ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ విభాగాల కార్మికులతో మాట్లాడారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనందున సంస్థ పరిరక్షణ విషయంలో            మనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. పార్శిల్స్‌ రవాణా ద్వారా ఆదాయం పెంచుకోవాలని అధికారులకు సూచించారు. త్వరలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని పేర్కొన్నారు. కాంప్లెక్స్‌లో పలు విభాగాలు తనిఖీ చేసి కార్గో పార్శిల్‌ విభాగాన్ని పరిశీలించారు. అక్కడున్న సిబ్బందితో మాట్లాడారు. తూకం ఎలా వేస్తున్నారు, ఏ పార్శిల్‌కు ఎంత ఫీజు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్‌) కేఎస్‌ బ్రహ్మానందరెడ్డి, విజయనగరం జోన్‌ ఈడీ చింతా రవికుమార్‌, రాజమహేంద్రవరం రీజనల్‌ మేనేజరు ఆర్వీఎస్‌ నాగేశ్వరరావు, ఇతర అధికారులు             పాల్గొన్నారు. 

కార్పొరేషన్‌ (కాకినాడ): ఆర్టీసీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఆర్డీసీ వైస్‌ చైర్మన్‌, ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన కాకినాడ ఆర్టీసీ డిపోలో ఉద్యోగులతో సమావేశమయ్యారు. జిల్లాలో కాకినాడ డిపో అతి పెద్దది అని, ఇక్కడి నుంచి రాష్ట్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు 170 సర్వీసులు నడుస్తున్నాయన్నారు. ఇక్కడ సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. సిబ్బంది రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఆర్టీసీని ముందుకు తీసుకురావాలన్నారు. వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. డిపో      పరిధిలో ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులు అందించారు.               రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ వైడీ రామారావు ఎండీని సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ పి.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. 

అమలాపురం రూరల్‌: అమలాపురం ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు, కార్మికులనుద్దేశించి ప్రసంగించారు. సిబ్బందికి ప్రతీనెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తామన్నారు. తొలుత డిపో ఆవరణలో మొక్కలు నాటారు. పీఎన్‌ రావు, ఎస్వీ రావు, ఎన్‌.వరహాలబాబు, ఎంఆర్‌ కృష్ణ, పీఆర్‌ బాబు, జేవీవీకే సాయి, పి.లోవరాజు, ఎస్‌కేడీ ప్రసాద్‌, కేఆర్‌ శేఖర్‌, జేఎస్‌ నారాయణ, వైవీవీఎస్‌ఆర్‌ గోపాల్‌, ఏఎం బాషా, జీఆర్‌ఎల్‌ దేవిలకు ఉత్తమ పురస్కారాలు అందజేశారు. డిపో మేనేజర్‌ ఎంయూఎన్‌ మనోహర్‌, సిబ్బంది పాల్గొన్నారు.