ప్రయాణికుల పాట్లు పట్టవా?

ABN , First Publish Date - 2022-05-09T04:21:41+05:30 IST

జిల్లా కేంద్రం నుంచి కాగజ్‌నగర్‌ వచ్చే రహదారి అధ్వానంగా తయారైంది. ఆరు నెలల క్రితం ఈ రోడ్డుకు మరమ్మతులు ప్రారంభించారు. ఐతే పనులు ప్రారంభించిన కొద్ది రోజులకే అర్థాంతరంగా నిలిపి వేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రయాణికుల పాట్లు పట్టవా?
వాహనం పోవటంతో లేస్తున్న దుమ్ము

- అధ్వానంగా ఆసిఫాబాద్‌-కాగజ్‌నగర్‌ రోడ్డు

- ఆరు నెలలుగా అవస్థలు

- మరమ్మతుల పేరిట రోడ్లను తవ్వివదిలేశారు

- దుమ్ము దూళితో ప్రయాణికుల అగచాట్లు

- ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించక తంటాలు

కాగజ్‌నగర్‌, మే 8: జిల్లా కేంద్రం నుంచి కాగజ్‌నగర్‌ వచ్చే రహదారి అధ్వానంగా తయారైంది. ఆరు నెలల క్రితం ఈ రోడ్డుకు మరమ్మతులు ప్రారంభించారు. ఐతే పనులు ప్రారంభించిన కొద్ది రోజులకే అర్థాంతరంగా నిలిపి వేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై చిన్నపాటి వాహనం పోతే చాలు ఒక్కసారిగా దుమ్ము లేస్తోంది. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు ఏ మాత్రం కనబడని పరిస్థితి. ఈ విషయంలో అధికారులకు ఫిర్యాదులు చేస్తే తాత్కాలికంగా నీటిని స్ర్పే చేసి వదిలేస్తున్నారు. రెండు నెలల క్రితం మంత్రి హరీష్‌రావు పర్యటన ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ గుంతలను పూడ్చేందుకు తాత్కాలికంగా కంకర, సుద్ద నింపారు. జిల్లా కేంద్రం నుంచి అధికారులు కూడా నిత్యం ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటారు. కానీ ఎవరూ పట్టించు కున్న దాఖలాలు లేవు.  

ఎదుటి వారు కనిపించనంత దుమ్ము లేస్తోంది

కాగజ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి కాగజ్‌నగర్‌కు వచ్చే రహదారిలో మూడు చోట్ల రోడ్డును తవ్వేశారు. చిన్నపాటి ఆటో, ట్రాలీ ఆటో పోతే చాలు రోడ్డు కనబడదు. దుమ్ము ఒక్కసారిగా లేవటంతో ద్విచక్ర వాహనదారులు దారి కనిపించక కిందపడి సంఘటనలున్నాయి. కొన్ని సంఘాల వారు నేరుగా అధికారులకు ఫిర్యాదులు చేస్తే మరుసటి రోజు నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లుతున్నారు. అయితే వేసవి కాలం కావడంతో అరగంట తర్వాత మళ్లీ పాతకథే ఉంటోంది. ఈ విషయాలను పట్టణానికి చెందిన పలువురు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులకు ట్విట్టర్‌లో ట్వీట్‌ కూడా చేశారు. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. ఈ విషయమై డీఈ లక్ష్మినారాయణను వివరణ కోరగా పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. 

ఏమీ కనిపించడం లేదు

-విజయ్‌గరామీ, కాగజ్‌నగర్‌

ఆసిఫాబాద్‌కు వెళ్లాలంటే పరిస్థితి చూడాలి. క్రాస్‌రోడ్డు సమీపంలో మూడు చోట్ల దుమ్ము అధికంగా లేస్తోంది. ఏమీ కనబడదు. అధికా రులు స్పందించి పనులు పూర్తి చేస్తే బాగుంటుంది. ఈ విషయంలో వెంటనే స్పందించాలి. లేకుంటే నిత్యం చాలా బాధలు పడాల్సి వస్తోంది. 

చాలా ఇబ్బంది పడుతున్నాం

-నర్సయ్య, కాగజ్‌నగర్‌ 

కాగజ్‌నగర్‌ నుంచి క్రాస్‌ రోడ్డు వరకు రోడ్డు మరమ్మతులు చేసేం దుకు మూడు చోట్ల పూర్తిగా తవ్వి వదిలేశారు. అంతేకాకుండా కంకర, సుద్ద వేయటంతో చిన్నపాటి వాహనం పోతే చాలు ఎదురుగా వచ్చే వాహనాలు ఏమీ కనపడనంతగా దుమ్ము లేస్తోంది. అధికారులు వెంటనే పనులు పూర్తి చేస్తే బాగుంటుంది.

Read more