Shocking: విమానం గాల్లో ఉండగా బుల్లెట్ తాకి గాయపడిన ప్రయాణికుడు

ABN , First Publish Date - 2022-10-02T23:54:59+05:30 IST

విమానం గాల్లో ఉండగా తూటా తాకి ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మయన్మార్

Shocking: విమానం గాల్లో ఉండగా బుల్లెట్ తాకి గాయపడిన ప్రయాణికుడు

న్యూఢిల్లీ: విమానం గాల్లో ఉండగా తూటా తాకి ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు. వినడానికి  ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మయన్మార్ ఎయిర్‌లైన్స్‌(Myanmar Airlines)లో ప్రయాణిస్తున్న ఒక ప్యాసెంజర్‌ను భూమి నుంచి వచ్చిన తూటా గాయపరిచింది. మయన్మార్‌(Myanmar)లోని లొయికాలో విమానం ల్యాండ్ అయిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. విమానాశ్రయానికి తూర్పున నాలుగు మైళ్ల దూరంలో 3,500 అడుగుల ఎత్తున విమానం ఎగురుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. విమానంలోని ముఖ్యభాగమైన ‘ఫ్యూజ్‌లేజ్’ నుంచి ఈ తూటా దూసుకొచ్చింది. ఈ ఘటన తర్వాత వెంటనే అప్రమత్తమైన లయికాలోని మయన్మార్ నేషనల్ ఎయిర్‌లైన్స్(Myanmar National Airlines) కార్యాలయం అక్కడికి వచ్చే అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. 


కయాలోని రెబల్ దళాలే ఈ పనికి పాల్పడ్డాయని మయన్మార్ మిలటరీ (Myanmar Military) ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే, రెబల్స్ మాత్రం ఈ ఘటనతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. ప్రభుత్వంతో పోరాడుతున్న మైనారిటీ మిలీషియా గ్రూప్ అయిన కరెన్ని నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీ ‘ఉగ్రవాదులే’ విమానంపై కాల్పులు జరిపారని మయన్మార్ మిలటరీ(Myanmar Military) ప్రభుత్వ అధికారి మేజర్ జనరల్ జా మిన్ టున్ తెలిపారు. పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్‌, సాయుధ ప్రజాస్వామ్య అనుకూల సమూహంలోని తమ మిత్రులతో కలిసి అది పనిచేస్తోందని చెప్పారు. 


ప్రయాణికుల విమానంపై ఇలాంటి దాడి యుద్ధ నేరాల కిందకు వస్తుందని తాను చెప్పదలుచుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. శాంతి కోసం పరితపించే సంస్థలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాల్సి ఉందని అన్నారు. మిలిటరీకి, స్థానిక ప్రతిస్పందన దళాలకు మధ్య జరుగుతున్న పోరుతో కయా ఉద్రిక్తంగా ఉంది. మయన్మార్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసిన మిలటరీ ప్రభుత్వం 2021లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 

Updated Date - 2022-10-02T23:54:59+05:30 IST