పాసంగం

ABN , First Publish Date - 2021-02-22T05:45:10+05:30 IST

పొద్దు ఉరక ఎద్దు ఉరక ఎద్దు ఎంట ఎన్ను ఉరక ఎన్ను ఎంట మడి కన్నీటి తడి పచ్చి పడమటి గూడు జేరింది...

పాసంగం

పొద్దు ఉరక ఎద్దు ఉరక

ఎద్దు ఎంట ఎన్ను ఉరక

ఎన్ను ఎంట మడి కన్నీటి తడి

పచ్చి పడమటి గూడు జేరింది


గలుమ తాకింది లేదు

గడియ పురుసతు లేదు

కండ్లు గాలిస్తున్నయి

చేతులు చెరుగుతున్నయి

కుత కుత లేని కుండ

కూడునే కలగంటుంది

కార్తి కలసి రాలే

ఏలినోడు ఏరు పురుగయ్యిండు


శెరలు లేని సిరులు

సిరులు లేని శెరలు

ఏమి సిత్రమో

ఎవరు రాసుకున్న పత్రమో

గట్టు కీదిన కుక్క 

గుదేల్లి సచ్చినట్టయ్యింది

ఏమి సేత సేద లేని సేత

పాణం ముక్కుల మీదికొస్తుంది

నిమిషం నిమ్మలం లేదు

మడికట్ల మీది నించే

మఠాలెంట పడిపోతే బాగుండు


ఎడ్డి సెలక ఎల్లెలుకల పడితె

సాలు మీది కొచ్చేసరికి

సాలు సాలు అయ్యింది

మెడ మీని గుండ్లు

మెడ మీది నించే బాయె

సెవుల గంటీలకు

గంట కొట్టి

కాళ్ళ కడీయాలు కరిగి పాయె

కన్నీళ్లే మెరిసే నగలు

కడుపు తరుముకు పోతుంటే

కడుపు మీదే కొడుతున్రు

కాలం కాకపోతే

కాలం జేసుడేనాయే

కనికరం లేక పాయె


మట్టి మరక తప్ప ఏ మరక ఉంది

ఎద మీద పొట్టకొచ్చిన పైరు

పడుకొని ఉంది

కండ్లు తొట్టల్లయ్యినయి

కలల మీన వలలేసి

కల్లాన్ని అల్లకల్లోలంజేస్తున్రు

మనిండంగనే మట్టి నించి

మనిషిని మైల బాపుతున్రు


నడి తోవనా......

తల్లెలు నాదానుతో తల్లడిల్లితున్నయి

గాంధి లేడు గ్రామస్వరాజ్యం లేదు

నోట్ల మీద తప్ప

ఎవరి నోట్లో ఉన్నవు మాహాత్మా

బలగం లేదు బంధువులులేరు

పచ్చులకు ఉచ్చులేసే ఉన్నయి

ఊర్ల ఉసురు కొట్టుకొని

నగరం నడి తోవ నరకమయ్యింది

నాట్లేస్తే నల్లమబ్బులన్నా కరుగుతయేమో కాని

ఓట్లేస్తే గీ పాశనపు గుండెలు కరుగలే


రైౖతు భూమిని కౌలుకు తీసుకున్నట్టు

మార్కెటు పార్లమెంటును 

కౌలుకు తీసుకుందేమో

కన్నీళ్ళని కూడ కాంట కొడుతున్నరు

జెండా పాసంగంతోనే ఎగురుతుంది

మునాసు వెంకట్‌ 

99481 58163

Updated Date - 2021-02-22T05:45:10+05:30 IST