ముగిసిన పార్వేట

ABN , First Publish Date - 2021-02-28T05:29:46+05:30 IST

అహోబిలేషుడి పార్వేట ముగిసింది. కనుమ రోజున దేవస్థానం నుంచి బయలుదేరిన స్వామివారి ఉత్సవ పల్లకి 44 రోజుల పాటు 33 గ్రామాలను సందర్శించింది.

ముగిసిన పార్వేట

  1. 33 గ్రామాలకు అహోబిలేషుడు
  2. తెలుపుల వద్ద దర్శించుకున్న భక్తులు
  3. 44 రోజులు.. 200 కి.మీ. పల్లకి మోసిన బోయీలు
  4. నేటి ఉదయం అహోబిలం చేరుకోనున్న స్వామివారు


రుద్రవరం, ఫిబ్రవరి 27: అహోబిలేషుడి పార్వేట ముగిసింది. కనుమ రోజున దేవస్థానం నుంచి బయలుదేరిన స్వామివారి ఉత్సవ పల్లకి 44 రోజుల పాటు 33 గ్రామాలను సందర్శించింది. జ్వాలా లక్ష్మీనరసింహస్వామి, ప్రహ్లాదవరద స్వామి ప్రజల చెంతకు వెళ్లి అనుగ్రహించారు. పార్వేట పల్లకిలో కొలువుదీరిన స్వాములవారిని భక్తులు దర్శించుకుని పూజించుకున్నారు. ఈ ఏడాది జనవరి 16న అహోబిలం దేవస్థానం ఆధ్వర్యంలో పార్వేట పల్లకి ఉత్సవం ప్రారంభమైంది. 27వ తేదీ శనివారం రాత్రి ముగిసింది. స్వామివారు ఆదివారం ఉదయం అహోబిలం క్షేత్రానికి చేరుకుంటారు.


చెంచులకు వోలి ఇచ్చేందుకు..

పార్వేట పల్లకిలో స్వామివారు గ్రామాలను సందర్శించడం వెనుక పౌరాణిక గాథ ఉంది. హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం నరసింహ స్వామి నల్లమలలో సంచరిస్తుండగా చెంచులక్ష్మి అమ్మవారు తారసపడతారు. స్వామివారు అమ్మవారిని వివాహం చేసుకోవాలని భావిస్తారు. అమ్మవారు చెంచుల ఆడబిడ్డ కావడంతో వారు స్వామివారిని వోలి (కట్నం) అడుగుతారు. భక్తుల నుంచి స్వామివారు వోలి సేకరించి, చెంచులక్ష్మిని వివాహం చేసుకుంటారు. ఈ సంప్రదాయమే పార్వేట పల్లకి ఉత్సవం. స్వామివారు గ్రామాలకు వెళ్లి భక్తులు ఇచ్చే ధాన్యాన్ని స్వీకరిస్తారు. పది బస్తాలు పండించిన రైతులు ఎనిమిది పడుల ధాన్యం స్వామికి సమర్పించారు. ఈ ధాన్యాన్ని వోలి కింద చెంచులకు స్వామివారి తరపున సమర్పిస్తారు. పార్వేట ముగియగానే అమ్మవారిని  వివాహం చేసుకుంటారు. 


ఏకాంత అభిషేకం 

పార్వేట పల్లకిలో ఉత్సవమూర్తులకు ఏకాంత అభిషేకం నిర్వహిస్తారు. టి.లింగందిన్నె, సర్వాయిపల్లె, చందలూరు, రుద్రవరం గ్రామాల్లో ఈ వేడుక జరిగింది. ఏకాంత అభిషేకం అనంతరం స్వామివారిని నూతన పట్టు వస్త్రాలతో అలంకరించారు.  


200 కి.మీ. యాత్ర

అహోబిలం పుణ్యక్షేత్రం నుంచి పార్వేట పల్లకి సుమారు 200 కి.మీ. దూరం ప్రయాణించింది. ఈ ఏడాది బోయీలు మొత్తం దూరాన్ని కాలి నడకనే సాగించారు. గ్రామ గ్రామాన తెలుపుల వద్ద కొలువుదీర్చి సేదదీరారు. పూజల అనంతరం మరో గ్రామానికి మోసుకెళ్లారు. 

Updated Date - 2021-02-28T05:29:46+05:30 IST