తిరుమలలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం

ABN , First Publish Date - 2022-01-17T08:00:48+05:30 IST

తిరుమలలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం

తిరుమలలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం

తిరుమల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ఏటా కనుమ పండుగ రోజున పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మధ్యాహ్నం మలయప్పస్వామిని, శ్రీకృష్ణస్వామిని ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఊరేగించి, కల్యాణమండపంలో ఆస్థానం నిర్వహించారు. ఆలయ అర్చకులు మూడుసార్లు స్వామి తరఫున ఈటెను విసిరి పార్వేట ఉత్సవం ముగించారు. తర్వాత స్వామి తిరిగి ఆలయానికి చేరుకున్నారు.


శ్రీవారికి సుప్రభాత సేవ పునఃప్రారంభం

పవిత్ర ధనుర్మాసం శుక్రవారం ముగియడంలో శనివారం ఉదయం నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభమైంది. ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పారాయణ చేపట్టారు. జనవరి 14వ తేదీన ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో 15వ  తేదీ నుంచి సుప్రభాత సేవను తిరిగి ప్రారంభించారు. 


వరాహస్వామికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం

వరాహస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం మండలాభిషేకం సందర్భంగా స్వామివారికి ఏకాంతంగా ప్రత్యేక సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కాగా.. శ్రీవారి ఆలయంలో ఏటా కనుమ పండుగను పురస్కరించుకుని ఉదయత్పూర్వం నిర్వహించే ‘కాకబలి’ కార్యక్రమాన్ని ఆదివారం వైదికోక్తంగా నిర్వహించారు. 

Updated Date - 2022-01-17T08:00:48+05:30 IST